తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం సిటీ: తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం చుట్టూ అవినీతి నెట్‌వర్క్ అలుముకుంది,అధికారుల ఉదాసీనత కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది,పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపించే కామధేనువుగా మారింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, నకిలీ రికార్డులు,తప్పుడు రిపోర్టులతో ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు, అంతే కాకుండా ప్రభుత్వం సకాలంలో నెట్ వర్క్ హాస్పత్రులకు బిల్లులు చెల్లించక పోవడంతో పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు బ్రోకర్లను ఆశ్రయించడంతో “బ్రోకర్ల దందా “మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది…..

బ్రోకర్ల దందా: పెండింగ్ బిల్లుల సెటిల్మెంట్లు!!
ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లుల విడుదల ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారంగా మారింది. వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో, వాటిని త్వరగా క్లియర్ చేయించుకోవడానికి ఆసుపత్రుల యాజమాన్యాలు బ్రోకర్లను ఆశ్రయిస్తున్నాయి.ఒక్కో ఫైల్ క్లియర్ కావడానికి 5% నుండి 10% వరకు కమీషన్లను బ్రోకర్ల ద్వారా ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సేవా కార్యక్రమాల పేరుతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగులో ఉండే ఒక ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్ యజమాని పెండింగ్ బిల్లులు క్లియర్ చేపించినందుకుగాను ఒక ప్రముఖ మీడియా ప్రతినిధికి ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వడంతో పాటు సదరు మీడియా ప్రతినిధికి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి….
అసలు దందా మొదలయ్యేది ఇక్కడే !!
గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ క్రింద TRP,ERSL,PCNL
ప్యాకేజీలు ఉండేవి ఆ ప్యాకేజీలకు ఒక్కొక్క దానికి 20,000 రూపాయలు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దానిని 40,000 లకు పైగా పెంచడంతో కొన్ని ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు కేవలం డబ్బు కోసం పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.అవసరం లేకపోయినా స్కానింగ్, ఎక్స్‌రే రిపోర్టులను ట్యాంపర్ చేసి సర్జరీలు అవసరమని చూపిస్తున్నారు.ముఖ్యంగా కిడ్నీ,గర్భసంచి తొలగింపు (Hysterectomy), మోకాళ్ల ఆపరేషన్లు, అపెండిసైటిస్ వంటి విభాగాల్లో భారీగా క్లెయిమ్‌లు దాఖలవుతున్నాయి.
అదే విధంగా కొంతమంది ఆధార్ కార్డులు సేకరించి, పేషెంట్ ఆసుపత్రిలో అడ్మిట్ కాకుండానే డిశ్చార్జ్ సమ్మరీలను సృష్టించి కోట్లు క్లెయిమ్ చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి,అంతే కాకుండా ప్యాకేజీలు డబుల్ ఆయన కారణంగా ఇబ్బబడి ముబ్బడిగా రోగులను అడ్మిట్ చేసుకోవడం,
వారం రోజులైనా సర్జరీలు చేయక పోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,ఈ క్రమంలో ఖమ్మం నగరంలో ఒక ప్రముఖ హాస్పిటల్లో ఈ ఒక్క రోజే దాదాపు ముప్పై రెండు మంది కిడ్ని సంబంధిత రోగులను అడ్మిట్ చేసుకోవడం విశేషం,దీంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవడమే కాకుండా, నిజంగా అత్యవసర చికిత్స అవసరమైన పేదలకు పడకలు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. అనవసర శస్త్రచికిత్సల వల్ల గ్రామీణ పేదల ఆరోగ్యం దెబ్బతింటోంది వైద్య నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…..
అధికారుల “మామూళ్ల” మౌనం !!
ఈ అక్రమాలను అరికట్టాల్సిన ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారులు,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కళ్లుండి చూడని కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజు అధికారులు ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయి తనిఖీలు చేయాలి కానీ అవి కేవలం మొక్కుబడిగా సాగుతున్నాయి.అంతే కాకుండా నెలవారి మామూళ్ళు కాకుండా క్లెయిమ్ చేసిన ప్రతి బిల్లుల్లో కొంత శాతం అధికారుల జేబుల్లోకి వెళ్తుండటంతోనే ఈ “అక్రమ దందా” యధేచ్ఛగా సాగుతోందని సమాచారం.ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పత్రుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలకు రావడానికి ముందే ఆసుపత్రులకు సదరు జిల్లా అధికారులు సమాచారం అందిస్తుండడంతో హాస్పిటల్ యాజమాన్యాలు అక్రమాలను కప్పిపుచ్చుతున్నారు…..

ఆరోగ్యశ్రీ అక్రమాలను అరికట్టాలంటే !!
ప్రైవేటు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ క్లెయిమ్‌లపై స్వతంత్ర సంస్థలతో ఆడిటింగ్ నిర్వహించాలి,సర్జరీకి ముందు, తర్వాత పేషెంట్ లైవ్ వీడియో/ఫోటోలను తప్పనిసరి చేయాలి.అంతే కాకుండా అక్రమాలకు పాల్పడే ఆసుపత్రులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడమే కాకుండా, బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.అదే విధంగా పేదలకు వరంగా ఉండాల్సిన పథకం, ప్రైవేట్ శక్తుల పాలిట వరంలా మారకముందే ప్రభుత్వం స్పందించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రజలు,మేధావులు భావిస్తున్నారు……
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
