సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సత్తుపల్లి సింగరేణి జీఎం కార్యాలయం వద్ద బుధవారం భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు…

సత్తుపల్లి సింగరేణి కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన BRS కార్యకర్తలు….
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సింగరేణి కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఎక్సెస్ టెండర్లు పిలిచి, అర్హత ఉన్న కంపెనీలను పక్కన పెట్టి, అవినీతి చేసే తమ అనుకూల సంస్థలకు టెండర్లు కట్టబెడుతున్నారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు….
ప్రతిపక్షాల ఆందోళనలు, పత్రికలలో వచ్చిన కథనాల నేపథ్యంలో నైని బ్లాక్‌లో టెండర్లు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసిన సండ్ర వెంకట వీరయ్య, అదే తరహాలో ఇప్పుడు కూడా అక్రమ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి తమకు కావలసిన కంపెనీలకే లాభం చేకూర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు…..

సత్తుపల్లి సింగరేణి కార్యాలయం ముందు ధర్నాలో పాల్గొన్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య…
బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణి సంస్థకు అన్యాయం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ ఈ అక్రమాలపై ప్రశ్నించకపోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింగరేణి లాభాల్లో కార్మికులకు కూడా వాటా ఇచ్చారని, ఇప్పుడు మాత్రం దీపావళి బోనస్‌లకే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే డీఎంఎఫ్ (DMF) నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించిన ఆయన, ఆ నిధులన్నీ కలెక్టర్ ఖాతాలో జమ చేసి పారదర్శకంగా వినియోగించాలని డిమాండ్ చేశారు. పనులు చేసిన వారికి సమయానికి, న్యాయంగా డబ్బులు చెల్లించాలని, సింగరేణిలో జరుగుతున్న అక్రమాలకు తక్షణమే చెక్ పెట్టాలని అన్నారు…..

సత్తుపల్లి సింగరేణి కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్న BRS కార్యకర్తలు….
సింగరేణి సంస్థలో జరిగిన అన్ని అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు పూనుకుంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని సండ్ర వెంకట వీరయ్య హెచ్చరించారు.
Pathi Sreenivas Rao: 9703973456
