ఏవి.రంగనాధ్ పై కక్షగట్టిన ల్యాండ్ మాఫియా…వంత పాడుతున్న ఒక వర్గం మీడియా….

Pathi Sreenivas Rao
2 Min Read

హైదరాబాద్ : గౌరవనీయ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహించడం, న్యాయ వ్యవస్థ పట్ల అత్యున్నత గౌరవం ప్రదర్శించడం రాజ్యాంగబద్ధమైన మన బాధ్యత. అయితే, హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే.. తెరవెనుక ల్యాండ్ మాఫియా సాగిస్తున్న చీకటి కుట్రలు, వారికి వత్తాసు పలుకుతున్న కొన్ని మీడియా సంస్థల కుతంత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలు శిరోధార్యమైనప్పటికీ న్యాయస్థానం తన ముందున్న సమాచారం, న్యాయ సూత్రాల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుని తన తీర్పును వెల్లడించింది,ఆ తీర్పును వక్రీకరించే హక్కు ఎవరికీ లేదు. కానీ, ఇదే అదునుగా కొందరు బడా కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ మాఫియా ఈ తీర్పును తమ విజయంగా మలుచుకునే ప్రయత్నం చేయడం సమాజానికి ఆందోళన కలిగించే అంశం.ఏవి.రంగనాథ్ లాంటి నిఖార్సయిన అధికారిపై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదు కావడానికి అసలు కారణం ఏమిటి?. ఆయన ప్రభుత్వ స్థలాలను రక్షించేందుకు, అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు చేసిన రాజీలేని పోరాటమే కదా….

హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ వందల కోట్లు గడిస్తున్న కబ్జాదారుల పాలిట ఏవీ రంగనాథ్ సింహస్వప్నంగా మారారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, రాజకీయ ప్రమేయాలకు అతీతంగా కేవలం 24 గంటల్లోనే ప్రజల ఫిర్యాదులపై స్పందించే వ్యవస్థను ఆయన నిర్మించారు. లోతుకుంట లాంటి ప్రాంతాల్లో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించే క్రమంలో తమ కోటలు బద్దలవుతున్నాయని గ్రహించిన భూమాఫియా, న్యాయపరమైన లొసుగులను వాడుకుంటూ ఆయనపై ఉద్దేశపూర్వకంగానే పదుల సంఖ్యలో కేసుల చక్రబంధాన్ని అల్లింది.దీనికి తోడు కొన్ని స్వార్థపూరిత మీడియా సంస్థలు పనిగట్టుకుని రంగనాథ్ పై విష ప్రచారం మొదలుపెట్టాయి. ఒక నిజాయితీ గల అధికారిని ఏకాకిని చేసి, భవిష్యత్తులో ఏ ప్రభుత్వ అధికారీ కబ్జాదారుల వైపు కన్నెత్తి చూడకుండా చేయాలన్నదే వారి వ్యూహం. ఈ మీడియా సంస్థలు అక్రమార్కుల అక్రమాలను ప్రశ్నించడం మానేసి, ప్రజా ఆస్తులను రక్షిస్తున్న అధికారిపై బురద చల్లడం జర్నలిజం ముసుగులో జరుగుతున్న దారుణం….

ఏవీ రంగనాథ్ నిజాయితీని శంకించాల్సిన పనిలేదు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతూ ప్రజల పక్షాన నిలబడిన ఒక ఐపీఎస్ అధికారి ఆయన. ఆయన ఎదుర్కొంటున్న కోర్టు కేసులు ఆయన స్వార్థం కోసం వచ్చినవి కావు, అక్రమ ఆక్రమణలను అడ్డుకునే క్రమంలో జరిగిన న్యాయపరమైన ఘర్షణ మాత్రమే అని సామాజిక కార్యకర్తలు, మేధావులు బలంగా విశ్వసిస్తున్నారు.ఒక నిజాయితీ గల అధికారిని వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టడం మాఫియాకు తాత్కాలిక విజయం కావచ్చు కానీ నిస్వార్థంగా విధులు నిర్వర్తించే అధికారులకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. న్యాయస్థానాల పట్ల అత్యున్నత గౌరవం ఉంచుతూనే.. అక్రమార్కుల కుట్రలను, కొన్ని మీడియా సంస్థల వక్రీకరణలను సమాజం గమనిస్తూనే ఉందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది…

📄 Generate e-Paper Clip
Share This Article