‘మాకు కనీస గౌరవం లేదు’.. డిప్యూటీ సీఎం భట్టి ముందు ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ దళిత ప్రజాప్రతినిధులు….

Pathi Sreenivas Rao
2 Min Read

హైదరాబాద్:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ తమ నియోజకవర్గాల్లో తమకు కనీస ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదని కాంగ్రెస్ దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఎస్సీ ప్రజాప్రతినిధుల సంఘం చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, కన్వీనర్ మల్లు రవిల ఆధ్వర్యంలో దళిత ప్రజాప్రతినిధుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దళిత నేతలు తమ నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పాలనాపరమైన సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనల వివరాలు గానీ, నియోజకవర్గాల్లో నిర్వహించే అభివృద్ధి పనుల శంకుస్థాపనల సమాచారం గానీ స్థానిక దళిత ప్రజాప్రతినిధులకు కనీసం తెలియజేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు….

అదే విధంగా డివిజన్ స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల బదిలీలు, కొత్త అధికారుల పోస్టింగ్‌ల విషయంలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, తమకు తెలియకుండానే నియామకాలు జరిగిపోతున్నాయని పేర్కొన్నారు,నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు సచివాలయానికి వెళ్తే, సంబంధిత శాఖల సెక్రటరీలు కనీసం కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలన్నా, క్షేత్రస్థాయిలో ప్రజల్లో పట్టు నిలుపుకోవాలన్నా తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్లు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అంతే కాకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, దీనిని వెంటనే అరికట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, పార్టీ పరంగా భారీగా నష్టపోతామని ప్రభుత్వానికి సూచించారు…..

ఈ సందర్బంగా ప్రజాప్రతినిధుల ఆవేదనను ఓపికగా విన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తుంగతుర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.”నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేదా సమస్యలు ఉన్నా అంతర్గత సమావేశాల్లో చర్చించుకుని పరిష్కరించుకోవాలి. బహిరంగంగా గొడవలు పడి పార్టీ పరువును వీధికి ఈడ్చవద్దు.”అంతర్గత విభేదాలు రచ్చకెక్కితే అది ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నాయకులంతా క్రమశిక్షణతో వ్యవహరించి సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు….

📄 Generate e-Paper Clip
Share This Article