తెలంగాణ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 20: ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. పెండింగ్ బిల్లులు మాత్రం మోక్షానికి నోచుకోవడం లేదు. చేసిన పనికి డబ్బులు రాక, అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ కాంట్రాక్టర్ కుటుంబం తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది.వివరాల్లోకి వెళితే.. చండ్రుగొండ మండలంలోని రవికంపాడు ఎంపీపీ యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో గతేడాది అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. దివంగత కాంట్రాక్టర్ భూపతి అప్పారావు ఈ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, నిర్మాణానికి సంబంధించిన రూ.1.13 లక్షల బకాయిలు నేటికీ విడుదల కాలేదు. పనులు చేసిన కాంట్రాక్టర్ అప్పారావు మృతి చెందడంతో, ఆ బకాయిల కోసం ఆయన కుమారుడు భూపతి శ్రీనివాసరావు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు….

కదలిక లేని ఫైళ్లు..ప్రజా పరిపాలనలో ఫిర్యాదు..…
పెండింగ్ నిధుల మంజూరు విషయమై చండ్రుగొండ మండల విద్యాధికారి (ఎంఈఓ) ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారికి (డీఈఓ) అధికారికంగా రిఫరల్ లేఖను సైతం పంపించారు. అయినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.బిల్లుల కోసం పలుమార్లు కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరిగి దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఫలితం శూన్యమని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ‘ప్రజా పరిపాలన దినోత్సవం’ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్‌ను నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించారు.”పనులు పూర్తి చేసి పాఠశాలకు అప్పగించినా బిల్లులు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందించి, సంబంధిత అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. పెండింగ్‌లో ఉన్న రూ. 1.13 లక్షల బకాయిలను వెంటనే విడుదల చేసి మా కుటుంబానికి న్యాయం చేయాలి” అని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
