ఖమ్మంలో గంజాయిపై “టాస్క్ ఫోర్స్” ఉక్కుపాదం: సరఫరా చైన్‌ను బ్రేక్ చేసే దిశగా పోలీసుల అడుగులు….

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం క్రైమ్:నగరంలో గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఏసీపీ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. కేవలం కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోకుండా.. గంజాయి మూలాలను వెలికితీస్తూ డ్రగ్స్ సరఫరా చైన్‌ను బ్రేక్ చేసే దిశగా పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు….

మంగళవారం రాత్రి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండు గంజాయి తాగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరిని టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకోగా, మరొకరు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. పట్టుబడిన యువకుడిని విచారించి, అతని వద్ద ఉన్న 40 గ్రాముల ఎండు గంజాయి, ప్లాస్టిక్ సీసాలు, రోల్ పేపర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.ఇదే తరహాలో నగరంలో రాత్రి జరిగిన తనిఖీల్లో గంజాయి సేవిస్తూ ఇద్దరు యువకులు పట్టుబడగా, మరో ఇద్దరు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్లలో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు….

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఎవరైనా గంజాయి లేదా మత్తుమందులతో పట్టుబడితే కేవలం వారిపై కేసులు నమోదు చేసి వదిలేయడం లేదని స్పష్టం చేశారు. పట్టుబడిన వారు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎవరికి రవాణా చేస్తున్నారు? ఎవరి వద్ద కొనుగోలు చేశారు? అనే పూర్తి సమాచారాన్ని సేకరించి, ముఠా మూలాలను వెలికితీస్తున్నామని తెలిపారు. గంజాయి సేవించిన వారితో పాటు, వారికి విక్రయించిన వారిపైనా కేసులు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. ఈ విధంగా వ్యవహరించడం ద్వారా గంజాయి, డ్రగ్స్‌ సరఫరా నెట్ వర్క్ ను పూర్తిగా విచ్ఛిన్నం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట యువకులు గంజాయితో పట్టుబడుతున్న నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సీరియస్‌గా దృష్టి సారించారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి నగరానికి గంజాయి సరఫరా అవుతున్న మార్గాలతో పాటు, వినియోగం ఎక్కువగా ఉంటున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఇందుకోసం అన్ని పోలీస్‌ స్టేషన్ల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు, డ్రగ్స్‌ నియంత్రణకు ప్రత్యేకంగా నియమించిన బృందానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.డ్రగ్స్, గంజాయి విక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు….

📄 Generate e-Paper Clip
Share This Article