ఖమ్మంలో దారుణం: మిర్చి వ్యాపారిపై మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనుచరుడి దాడి….

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం (క్రైమ్):ఖమ్మం నగరంలోని కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద దారుణం చోటుచేసుకుంది. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుమస్తా కందుల అనిల్.. కన్నె వెంకన్న అనే మిర్చి వ్యాపారిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. పట్టపగలు జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన.. సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది….

కన్నె వెంకన్న వెంకటేశ్వర స్వామి గుడిలో దైవదర్శనం ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో, అప్పటికే అక్కడ కాపు కాసిన కందుల అనిల్ అకస్మాత్తుగా దాడికి దిగాడు. విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు ‘జనం ముచ్చట’ కు చిక్కడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది….

బాధితుడు కన్నె వెంకన్న గతంలో సదరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వద్ద గుమస్తాగా పనిచేసేవాడు. అయితే కొంతకాలంగా ఆ పని మానేసి, మార్కెట్ లో సొంతంగా మిర్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. తాను సొంతంగా ఎదుగుతుండటం ఓర్వలేకనే వైస్ చైర్మన్ తనపై కక్ష పెంచుకున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. సొంత వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచే వైస్ చైర్మన్, అతని అనుచరుడు అనిల్ తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, గత కొన్నేళ్లుగా తనను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని వెంకన్న వాపోతున్నాడు….

తనపై జరిగిన ఈ దారుణ దాడిపై బాధితుడు వెంకన్న.. ఖమ్మం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే నాలుగు రోజులు గడుస్తున్నా పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ (FIR) కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. కేసు నమోదు చేయకుండా పోలీసుల మీద సదరు వైస్ చైర్మన్ తన రాజకీయ పలుకుబడితో తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.మరోవైపు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోకపోతే ‘నీ అంతు చూస్తాం’ అంటూ గత నాలుగు రోజులుగా వైస్ చైర్మన్ అనుచరులు వెంకన్నను తీవ్రంగా బెదిరిస్తున్నట్లు సమాచారం…..

నగర నడిబొడ్డున ఒక వ్యాపారిపై భౌతిక దాడి జరిగితే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు, ఇతర వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, బాధితుడికి రక్షణ కల్పించడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article