ఖమ్మం కార్పొరేషన్‌లో సూర్యాపేట జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ “హల్‌చల్”!!

Pathi Sreenivas Rao
3 Min Read
Highlights
  • ఖమ్మం కార్పొరేషన్‌లో సూర్యాపేట జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ హల్‌చల్...
  • మంత్రి ఉత్తమ్, పద్మావతి పేర్లతో అధికారులకు బెదిరింపులు...
  • నాసిరకం పనులకే రెడ్ కార్పెట్.. ప్రశ్నిస్తే ‘చూపిస్తా నేనేంటో’ అంటూ బిల్డప్‌లు....
  • స్థానిక కాంట్రాక్టర్ల ఆవేదన.. కలెక్టర్, కమిషనర్ స్పందించాలని డిమాండ్....

ఖమ్మం సిటీ (స్పెషల్ స్టోరీ ): ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (KMC) అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం పనిచేసే స్థానిక కాంట్రాక్టర్లను పక్కనపెట్టి, పక్క జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ ఇక్కడ చక్రం తిప్పడం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సదరు కాంట్రాక్టర్.. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పేర్లను అడ్డం పెట్టుకుని ఖమ్మం కార్పొరేషన్‌లో హల్‌చల్ చేస్తున్నట్లు సమాచారం….

“నేను మంత్రి ముఖ్య అనుచరుడిని.. నాతో పెట్టుకుంటే ఉద్యోగాలు ఊడతాయి” అంటూ సదరు కాంట్రాక్టర్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ అధికారుల వద్దకు వెళ్లిన ప్రతిసారీ మంత్రులతో దిగిన ఫోటోలను చూపిస్తూ, “లోకల్‌గా నేనేంటో చూపించమంటారా?” అంటూ బెదిరింపు ధోరణికి దిగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీనితో సదరు కాంట్రాక్టర్ చేసే నాసిరకం పనులను ప్రశ్నించడానికి కింది స్థాయి వర్క్ ఇన్‌స్పెక్టర్లు సైతం వణికిపోతున్నారు…..

సాధారణ ప్రజలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు కనీసం కమిషనర్ అపాయింట్‌మెంట్ కూడా దొరకని ఈ పరిస్థితుల్లో, సదరు వివాదాస్పద కాంట్రాక్టర్‌కు మాత్రం కార్పొరేషన్‌లో ‘రెడ్ కార్పెట్’ స్వాగతం లభిస్తుండడం గమనార్హం.ఈ మొత్తం వ్యవహారం వెనుక నగరంలో అన్నీ తామై చక్రం తిప్పే ఇద్దరు అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వారి సూచనల మేరకే కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగంలోని కొందరు అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు లోపాయికారీగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ విభాగం నుండి డెప్యుటేషన్ మీద వచ్చి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో కీలక స్థానంలో కూర్చున్న ఓ అధికారి.. ఈ కాంట్రాక్టర్‌కు పూర్తి స్థాయిలో ‘రక్షణ కవచం’గా నిలిచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి…..

సదరు కాంట్రాక్టర్ శైలి మున్సిపల్ సర్కిల్‌లో విస్మయం కలిగిస్తోంది. టెండర్లు దక్కించుకోవడం, వాటిని తాను చేయకుండా ఓ యువ నాయకుడి అనుచరుడి బినామీకి ‘సబ్ కాంట్రాక్ట్’ ఇచ్చి ఇంట్లోనే కూర్చుని కమీషన్లు దండుకోవడం ఇతని ప్రత్యేకత.ఏ డివిజన్‌లో పని చేసినా, అడ్డొచ్చిన చెట్లను, విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే వాటిపై నుండే సిసి రోడ్లు, డ్రైన్లు వేసేయడం ఈ కాంట్రాక్టర్ ‘మార్క్’ నాణ్యతకు నిదర్శనం.అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50, 59, 60 డివిజన్లలో సిసి రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణంలో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. అయినప్పటికీ, క్వాలిటీ కంట్రోల్ విభాగం క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే కళ్ళు మూసుకుని ‘క్లియరెన్స్ సర్టిఫికెట్లు’ జారీ చేయడం వెనుక పెద్ద ఎత్తున చేతులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి…..

“ఎన్నో ఏళ్లుగా ఖమ్మం కార్పొరేషన్‌లో నమ్ముకుని పనులు చేస్తున్నాం. కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టి, అడిగితే ‘చూద్దాం.. చేద్దాం’ అంటూ దాటవేస్తున్నారు. కానీ, పక్క జిల్లా నుండి వచ్చి, నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్‌కు మాత్రం పనులు పూర్తయిన పది రోజులకే బిల్లులు ఎలా క్లియర్ అవుతాయి?” అని ఖమ్మం లోకల్ కాంట్రాక్టర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…..

ఈ కాంట్రాక్టర్ ఆగడాలు మున్సిపాలిటీకే పరిమితం కాలేదు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోనూ రెండు విభాగాలకు సంబంధించిన టెండర్లను దక్కించుకుని, అక్కడ కూడా ‘తుూతూ మంత్రంగా’ పనులు కానిచ్చేస్తున్నారు. నాణ్యత లోపాన్ని ఆసుపత్రి అధికారులు ప్రశ్నించగా… నగరంలో అన్నీ తానై చక్రం తిప్పే అధికార పార్టీ నాయకుడు నేరుగా ఆసుపత్రి అధికారులకే ఫోన్ చేసి, “పనులు అయ్యేటప్పుడు అవుతాయి.. తొందరేముంది? కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తేవద్దు”అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు హాస్పిటల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి…..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును వాడుకుంటూ, స్థానిక ఇద్దరు అధికార పార్టీ నేతల అండతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న సదరు కాంట్రాక్టర్ వ్యవహారంపై తక్షణమే విచారణ జరపాలని ఖమ్మం నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి, ఇప్పటికైనా నాసిరకం పనులపై క్వాలిటీ చెక్ విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులు, సదరు కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment