రఘునాథపాలెం 218 సర్వే నెంబర్ల నిర్వాసితులకు న్యాయం చేయాలి: బీఆర్ఎస్ డిమాండ్ !!

Pathi Sreenivas Rao
3 Min Read
Highlights
  • రఘునాథపాలెం 218 సర్వే నెంబర్ల నిర్వాసితులకు న్యాయం చేయాలి:....
  • ముందస్తు సమాచారం లేకుండా పేదల ఇళ్ల కూల్చివేత దారుణం.....
  • బాధితులకు అండగా ఉంటాం.. కలెక్టరేట్ ముట్టడికి సైతం వెనకాడం: మాజీ నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు హెచ్చరిక....

ఖమ్మం :ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని 218 సర్వే నెంబర్లలో అర్హులైన పేదలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా గత పది రోజులుగా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదల బేస్‌మెంట్లు, నిర్మాణాలను కూల్చివేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ సమస్యను నిర్వాసితులు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకుల బృందం గురువారం ఉదయం ఘటన స్థలాన్ని సందర్శించింది. మాజీ నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్ తదితరులు కూల్చివేతలకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. కూల్చివేతలతో శిథిలాలుగా మారిన తమ ఇళ్లను, బేస్‌మెంట్లను చూసి నిర్వాసితులు కన్నీరుమున్నీరయ్యారు. తాము రెక్కలకష్టం నమ్ముకుని, అప్పులు చేసి కట్టుకున్న నిర్మాణాలను ఇలా నేలమట్టం చేయడంపై బాధితులు బీఆర్ఎస్ బృందం వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు…..

అనంతరం మీడియా సమావేశంలో పగడాల నాగరాజు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో, అప్పటి ఖమ్మం ఎంపీగా ఉన్న ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సుమారు 625 మంది అర్హులైన పేదలకు ఇక్కడ పూర్తి పారదర్శకంగా ఇంటి పట్టాలు అందజేశామని గుర్తు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చినా స్థలాలు చూపించలేదని, కానీ బీఆర్ఎస్ హయాంలో స్థలాలు చూపించడమే కాకుండా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, బోర్లు వంటి మౌలిక వసతులు కల్పించి పేదలు ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించామని తెలిపారు.అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజాపాలన’ పేరుతో పేదల పొట్ట కొడుతోందని విమర్శించారు. అమరావతి హైవే నిర్మాణం, మోడల్ స్కూల్ పేరుతో ఇప్పటికే కొన్ని ప్లాట్లు రద్దు చేయగా.. ఎలాంటి అడ్డంకులు లేని మిగిలిన 350 ప్లాట్లను కూడా స్వాధీనం చేసుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు….”ఇళ్లు నిర్మించే ప్రభుత్వాలను, పట్టాలు ఇచ్చే ప్రభుత్వాలను చూసాం.. కానీ పేదల ఇళ్లను కూల్చే దారుణమైన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితుల సమస్య ఇంకా పరిష్కారం కాకముందే, రఘునాథపాలెంలో మరోసారి పేదల ఆర్తనాదాలు వినబడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని పగడాల నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు…..

రఘునాథపాలెం 218 సర్వే నెంబర్లలో జరుగుతున్న అక్రమ కూల్చివేతలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలనీ.హైవే రోడ్డు నిర్మాణం, మోడల్ స్కూల్ కోసం భూములు కోల్పోయిన బాధితులందరికీ తక్షణమే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని,మిగిలిన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా, వారు ఇళ్లు నిర్మించుకునేందుకు తగిన రక్షణ, అనుమతులు కల్పించాలనీ, అంతే కాకుండా బాధితులందరికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలనీ డిమాండ్ చేశారు ఒకవేళ బాధితులను ప్రభుత్వం అదుకోకపోతే బాధితుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమస్యపై త్వరలోనే నిర్వాసితులందరినీ ఏకం చేసి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని.. అక్కడ కూడా సరైన న్యాయం జరగని పక్షంలో, పేదల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కందాల వీరేందర్, వాంకుడోత్ సురేష్, ఆరెంపల వీరభద్రం, సత్తార్ మియా, తీగల సతీష్ గౌడ్, పోలే రమేష్, పొంగు వెంకట్, మిర్యాల రమేష్, పిట్టల తిరుమల్ రమేష్, గుంటి రాజు, ప్రవీణ్, వెంకటేశ్వర్లు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక బాధితులు, మహిళలు పాల్గొన్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment