మానవత్వం చాటుకున్న డాక్టర్ కూరపాటి ప్రదీప్….తక్కువ ఖర్చుతో బాలుడికి “బ్రెయిన్ ట్యూమర్” సర్జరీ!!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం, జూన్ 19: కార్పొరేట్ వైద్యం ఖరీదవుతున్న ప్రస్తుత రోజుల్లో ఖమ్మంలోని ప్రముఖ ‘కూరపాటి చిల్డ్రన్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’ మరోసారి గొప్ప మానవత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్‌లోని బడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏకంగా ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే అత్యంత సంక్లిష్టమైన బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సను, లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ఖర్చుతోనే విజయవంతంగా పూర్తి చేసింది. చావుబతుకుల మధ్య ఉన్న ఓ చిన్నారికి పునర్జన్మ ప్రసాదించి అందరి మన్ననలు పొందుతోంది…..

ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామానికి చెందిన జి. ఆషీర్ అనే బాలుడు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. బాలుడికి వరుసగా ఫిట్స్ వస్తుండటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఈ నెల 12వ తేదీన ఖమ్మంలోని కూరపాటి చిల్డ్రన్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేర్పించారు. పరిస్థితి గమనించిన వైద్యులు వెంటనే అప్రమత్తమై సిటీ స్కాన్ నిర్వహించారు. ప్రాథమికంగా బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు, వ్యాధి తీవ్రతను మరింత లోతుగా పరిశీలించేందుకు ఎంఆర్ఐ స్కాన్ (MRI Scan) చేయించారు. ఈ పరీక్షల్లో బాలుడి మెదడు లోపలి భాగంలో ట్యూమర్ (DNET) ఉన్నట్లు నిర్ధారణ అయింది…..

మెదడు సంబంధిత ఆపరేషన్ కావడంతో, దీనిని హైదరాబాద్‌లో చేయిస్తే సుమారు రూ. 7 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసింది. అంత పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించే స్తోమత లేని బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చివరకు దిక్కుతోచని స్థితిలో కూరపాటి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్‌ను ఆశ్రయించి తమ ఆవేదనను, నిస్సహాయతను వెలిబుచ్చారు. ఆ పేద కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయిన డాక్టర్ ప్రదీప్ కుమార్, లాభాపేక్షను పక్కన పెట్టి, అత్యంత తక్కువ ఖర్చుతో తమ ఆసుపత్రిలోనే సర్జరీ చేయించాలని నిర్ణయించారు.దీంతో చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ పర్యవేక్షణలో ఈ నెల 14వ తేదీన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం రంగంలోకి దిగింది.డాక్టర్ తరంగ్ వోరా (ప్రముఖ పీడియాట్రిక్ న్యూరో సర్జన్),డాక్టర్ రవి కుసుమరాజు (అనస్తీసియా నిపుణులు),డాక్టర్ బ్రహ్మ కుమార్ (చిన్నపిల్లల వైద్యనిపుణులు),రవి, అభిరామ్ (ఓటీ టెక్నీషియన్స్) సమన్వయంతో వ్యవహరించి అత్యంత సంక్లిష్టమైన ఈ మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి, బాలుడి మెదడులోని ట్యూమర్‌ను పూర్తిగా తొలగించారు…..

అద్భుతమైన ఈ సర్జరీ ముగిసిన కేవలం 72 గంటల్లోనే బాలుడు ఆషీర్ పూర్తిగా కోలుకుని నడవడం విశేషం. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్నాడని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ వెల్లడించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడికి అరుదైన సర్జరీ చేసి సక్సెస్ చేసిన తమ వైద్య బృందాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తక్కువ ఖర్చుతో తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్ ప్రదీప్ కుమార్‌కు, ఇతర వైద్యులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment