సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సామాన్యుల ‘నిరీక్షణ’: ఏళ్లు గడుస్తున్నా అందని సాయం!!

Pathi Sreenivas Rao
2 Min Read

హైదరాబాద్: నిరుపేదలకు ఆపన్నహస్తం అందించాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారింది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల పాలై, అప్పులు చేసి వైద్యం చేయించుకున్న సామాన్యులకు ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్థిక సాయం అందని ద్రాక్షలా మారింది. గత ప్రభుత్వంలో కొన్ని నెలల్లోనే బాదితుల చేతికి చెక్కులు వచ్చేవి,ప్రస్తుత పాలనలో ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,అంతే కాకుండా మంత్రులు,ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇవ్వడమే తప్ప తరువాత వాటి గురించి పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మంత్రులు,ఎమ్మెల్యేల కార్యాలయాల్లో సీఎం రిలీప్ ఫండ్ దరఖాస్తులు స్వీకరణ పెద్ద ప్రహసనంగా మారిందని, సామాన్య ప్రజలు దరఖాస్తులు తీసుకువెళితే మీ ఏరియాలో ఉన్న అధికార పార్టీ నాయకుని సిఫార్సు లేఖ,లేదా తను స్వయంగా ఫోన్ చేసి చెప్పాలని,సదరు నాయకుడు మనవాడే అని చెబితే తప్ప దరఖాస్తులు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….

ప్రభుత్వం మారిన తర్వాత వెరిఫికేషన్ ప్రక్రియలో తీసుకొచ్చిన మార్పులు, క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల గుట్టలే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సరిచూడడంలో యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది.ఖజానా నుండి నిధుల మంజూరులో జాప్యం జరగడం వల్ల వేల సంఖ్యలో చెక్కులు ప్రింటింగ్ దశలోనే నిలిచిపోయాయి.ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా, సచివాలయం నుండి స్పష్టమైన సమాధానం రావడం లేదని బాధితులు వాపోతున్నారు.గత ప్రభుత్వ హయాంలో CMRF దరఖాస్తు చేసుకున్న 5 నుండి 6 నెలల కాలంలోనే లబ్ధిదారుల చేతికి చెక్కులు అందేవి. కానీ, ప్రస్తుత ఏడాది దాటినా సాయం అందడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నిన్న సచివాలయంలో ఎదురైన ఒక సంఘటన హృదయాన్ని కలచివేసేడుగా ఉంది,క్యాన్సర్ చికిత్స కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేశాను. ఇప్పటికీ సచివాలయం చుట్టూ తిరుగుతున్నా సమాధానం లేదు. అప్పుల వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఒక బాధితుడు “జనం ముచ్చట”తో తన ఆవేదన వ్యక్తం చేశారు ఒక విధంగా చెప్పాలంటే సచివాలయంలో విజిటింగ్ పాస్ లు తీసుకున్నవారిలో ఎక్కువ శాతం “సీఎం రిలీప్ ఫండ్”బాదితులు ఉండడం గమనార్హం…..

చాలామంది పేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని, ఆ బిల్లులను CMRF ద్వారా రీయింబర్స్ అవుతాయన్న ఆశతో భారీగా అప్పులు చేశారు.అయితే చెక్కులు రాకపోవడంతో వడ్డీల భారం పెరుగుతోంది.అధికారులు “ప్రాసెస్ లో ఉంది” అని చెప్పడం తప్ప, ఖచ్చితమైన గడువు ఇవ్వడం లేదు.మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉన్నా ఫైళ్లు కదలడం లేదు.ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది రాజకీయం కాదు, అది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం. ప్రభుత్వం తక్షణమే స్పందించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి. పాత పద్ధతిలో లేదా అంతకంటే వేగంగా సాయం అందేలా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడి, పేదవాడి కన్నీరు తుడుస్తుందా? లేదా కాలయాపనతోనే కాలం గడుపుతుందా? వేచి చూడాలి.….

📄 Generate e-Paper Clip
Share This Article