ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఆయనో ‘రారాజు’.. తరగతుల కోసం క్యూ కడుతున్న నిపుణులు…..

Pathi Sreenivas Rao
3 Min Read

ప్రకటనలు ఉండవు.. ప్రచార ఆర్భాటాలు అసలే కనిపించవు.. కానీ ఆయన క్లాస్ వినాలంటే మాత్రం ‘నో అడ్మిషన్’ బోర్డు తీసేదాకా వెయిట్ చేయాల్సిందే! స్కూల్ టీచర్ల నుంచి మొదలుకొని కాలేజీ లెక్చరర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, చివరకు విదేశాల్లో స్థిరపడిన తెలుగు విద్యార్థులు సైతం ఆయన తరగతులకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతారు. ఆంగ్ల భాషను అరటిపండు వలిచినంత సులువుగా నేర్పించడంలో ఆయనకాయనే సాటి. ఆయనే ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ ఆంగ్ల భాషా నిపుణులు డాక్టర్ కామిశెట్టి వెంకట్ నారాయణ…ఖమ్మం జిల్లాలో ‘క్యాంబ్రిడ్జి స్పోకెన్ ఇంగ్లీష్’ (Cambridge Spoken English) అంటే తెలియని వారుండరు. కమ్యూనికేషన్ స్కిల్స్, అడ్వాన్స్‌డ్ స్పోకెన్ ఇంగ్లీష్, IELTS శిక్షణలో సరికొత్త ఒరవడిని సృష్టించిన డాక్టర్ కేవీ నారాయణ ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయం. ప్రస్తుతం ఆయన ఖమ్మంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు….

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట అనే చిన్న గ్రామానికి చెందిన కేవీ నారాయణ.. విద్యాభ్యాసం అంతా సాధారణ స్థాయిలోనే మొదలైంది. పదో తరగతి వరకు స్వగ్రామం ముష్టికుంట్లలో, ఇంటర్మీడియట్ నాగులవంచలో, డిగ్రీ సిద్ధారెడ్డి కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంగ్ల భాషపై ఉన్న మక్కువతో కాకతీయ యూనివర్సిటీలో ఎం.ఏ (ఇంగ్లీష్) పూర్తి చేసి, జేఎస్ (JS) యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ (PhD) పట్టా పొందారు. గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినా, పట్టుదలతో ఆంగ్ల భాషపై ఆయన సాధించిన పట్టు నేటి యువతకు ఒక గొప్ప పాఠం…..

సాధారణంగా ఏ కోచింగ్ సెంటర్‌కైనా వెళితే వందల సంఖ్యలో విద్యార్థులను కూర్చోబెట్టి తరగతులు చెబుతుంటారు. కానీ నారాయణ గారి శైలి దానికి పూర్తి భిన్నం. తన వద్దకు వచ్చే వారికి న్యాయం జరగాలంటే బ్యాచ్‌కు అతి తక్కువ మందిని మాత్రమే తీసుకోవాలన్నది ఆయన సిద్ధాంతం.ఒక బ్యాచ్ పూర్తయ్యే వరకు కొత్త వారిని తీసుకోరు. అందుకే ఆయన క్లాస్ వినడానికి ఒక్కోసారి నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది.అంతే కాకుండా కమర్షియల్ హంగులకు పోకుండా, ప్రశాంతమైన వాతావరణంలో తన ఇంటి వద్దనే ఆయన తరగతులు నిర్వహించడం విశేషం.ఒక విధంగా చెప్పాలంటే తాను నిర్వహించే బ్యాచ్‌లలో విద్యార్థుల కంటే టీచర్లు, లెక్చరర్లు, ఐటీ ఉద్యోగులే ఎక్కువగా ఉంటారు. ఉదయం 5 గంటలకే ‘ప్రొఫెషనల్ బ్యాచ్’ ప్రారంభం కావడం ఆయన అంకితభావానికి నిదర్శనం…..

కేవీ నారాయణ గారి బోధనా విధానంలో అత్యంత ఆకర్షించే అంశం.. ఏకకాలంలో ‘మూడు బోర్డుల’ వినియోగం. సాధారణంగా తరగతి గదిలో ఒక బోర్డు ఉంటుంది. కానీ తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్టును, గ్రామర్ రూల్స్ ను, వాక్య నిర్మాణాలను ఒకేసారి విద్యార్థులకు కళ్ళకు కట్టినట్లు చూపించడానికి ఆయన ఈ పద్ధతిని ఎంచుకున్నారు. విద్యా రంగంలో ఇదొక వినూత్నమైన ప్రయోగం. దీనివల్ల విద్యార్థులు సులభంగా పోలికలు గ్రహించి ఆంగ్లాన్ని వేగంగా నేర్చుకుంటున్నారు…..

వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, సామాజిక బాధ్యతను ఆయన ఎన్నడూ మరువలేదు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు, అనాథలకు తన సంస్థలో నామమాత్రపు ఫీజులకే లేదా ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. గ్రామీణ విద్యార్థుల్లో ఉండే ‘ఆంగ్ల భాషా భయాన్ని’ (English Phobia) పోగొట్టి, కార్పొరేట్ కంపెనీల్లో వారు ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు.నేటి పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మనుగడ కష్టం.ఈ సత్యాన్ని గ్రహించి, తనదైన శైలిలో అద్భుతమైన శిక్షణ ఇస్తూ, వందలాది మంది కెరీర్‌లను మలుపు తిప్పుతున్న డాక్టర్ కేవీ నారాయణ ఖమ్మం జిల్లాకు గర్వకారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు….

📄 Generate e-Paper Clip
Share This Article