పేదల ఆత్మగౌరవానికి చిరునామా ‘ఇందిరమ్మ ఇల్లు’:మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి!!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం/కూసుమంచి: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే బృహత్తర కార్యక్రమమే ‘ఇందిరమ్మ ఇండ్లు’ అని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఉద్ఘాటించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం పాలేరు నియోజకవర్గం, కూసుమంచి మండలంలో నిర్మాణం పూర్తిచేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు….

నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లలో అడుగుపెడుతున్న లబ్ధిదారులతో స్వయంగా కలిసి మంత్రి గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా గృహ యజమానులకు ఆత్మీయ కానుకలు అందజేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “సొంతింటి కల నెరవేరిన వేళ ఆ నిరుపేదల కళ్లలో కనిపించిన ఆనందం ఎప్పటికీ మరువలేనిది. ఈ బృహత్తర కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా భాగస్వామిని కావడం నాకు అత్యంత గర్వకారణంగా ఉంది” అని మంత్రి ఉద్వేగంగా వెల్లడించారు…..

ఎంతో మంది నిరుపేదలు ఏండ్ల తరబడి సొంత గూడు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలను తీర్చేందుకే ‘ప్రజా ప్రభుత్వం’ ప్రతిష్టాత్మకంగా పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని మంత్రి వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేసి పేదల బతుకుల్లో వెలుగులు నింపామని తెలిపారు.”తెలంగాణలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్నదే మా సంకల్పం. అందుకే, రెండో విడత కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మరో 2 వేల ఇండ్ల చొప్పున మంజూరు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం” అని స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు కట్టించి, తెలంగాణను ‘పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా’ దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ఆయన భరోసా ఇచ్చారు…..

గృహప్రవేశాల అనంతరం కూసుమంచి మండల కేంద్రంలో రూ. 35 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన విద్యుత్ రెవెన్యూ కార్యాలయ (ERO) భవనాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ నూతన భవనం ద్వారా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article