ప్రజా దర్బార్‌లో ప్రతి న్యాయబద్ధమైన సమస్యకు పరిష్కారం :మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి!!

Pathi Sreenivas Rao
3 Min Read

ఏదులాపురం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపించడమే ‘ప్రజాదర్బార్’ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాదర్బార్‌లో వచ్చిన ప్రతి న్యాయబద్ధమైన దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి, పరిష్కరించేలా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తో కలిసి మంత్రి పొంగులేటి ప్రజాదర్బార్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన స్వయంగా వినతులు స్వీకరించారు….

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 15 డివిజన్లకు సంబంధించి ఇది ఆఖరి ప్రజాదర్బార్ అని, సుమారు 3,500లకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా, చివరి దరఖాస్తు స్వీకరించే వరకు తాను స్వయంగా ఇక్కడే ఉండి ప్రజల వినతులు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు…..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (గృహజ్యోతి), కొత్త రేషన్ కార్డుల జారీ తదితర కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు.మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి అన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఇందులో భాగంగా ఇప్పటి వరకు మహిళా సంఘాలకు రూ. 66 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని గుర్తుచేశారు…

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, నిర్మాణ పురోగతి ఆధారంగా ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామన్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న రెండవ విడతలో.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అదనంగా మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన కీలక ప్రకటన చేశారు. ఆ తర్వాత మూడవ, నాలుగవ విడతల్లోనూ ఈ మంజూరు ప్రక్రియ కొనసాగుతుందని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు….

ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరగడం వల్లే ప్రజాదర్బార్‌కు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు పాలేరు పరిధిలో 21,536 దరఖాస్తులు అందగా.. అందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే 9,731 వినతులు వచ్చినట్లు తెలిపారు. అలాగే పెన్షన్ల కోసం 4,700, భూ సమస్యల పరిష్కారం కోసం 4,000, గృహజ్యోతి పథకం కోసం 900 దరఖాస్తులు అందాయన్నారు. అర్హులకు కొద్ది రోజుల్లోనే ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామని, అలాగే రాబోయే నెల రోజుల్లో పాలేరు నియోజకవర్గ పరిధిలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపడుతుందని మంత్రి భరోసా ఇచ్చారు..ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అటవీ శాఖాధికారి (డి.ఎఫ్.ఓ) అనూజ్ అగర్వాల్, ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ అనిత, వైస్ చైర్మన్ నవీన్, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబుతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article