తెలంగాణ/ఖమ్మం జిల్లా:
అక్రమ మట్టి తవ్వకాలపై ప్రభుత్వ ఆంక్షలు ఉన్నప్పటికీ, ఖమ్మంలో పెచ్చు మీరుతున్న మట్టి మాఫియా ఆగడాలు రోజు రోజుకు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా రెచ్చిపోయిన మట్టి మాఫియా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొందరు అధికార పార్టీ నాయకుల అండతో అదే దూకుడును కొనసాగిస్తూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది,అధికార పార్టీ నాయకుల అండ దండలు, రెవెన్యూ, మైనింగ్ అధికారుల అధికారుల ఆశీస్సులతో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది…..
గత ప్రభుత్వంలో ఖమ్మంలో పేరు మోసిన ఇద్దరు మట్టి మాఫియా”కింగ్ పిన్” లు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా సాగించిన అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులు పలుమార్లు జరిమానాలు విధించినప్పటికీ,ఆ జరిమానాల వసూళ్లలో మాత్రం పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది,
అధికారిక గణాంకాల ప్రకారం,గత రెండున్నర సంవత్సరాలుగా మట్టి అక్రమ తవ్వకాలపై కోట్లల్లో జరిమానాలు విధించినప్పటికీ ఒక్క నయా పైసా వసూళ్లకు నోచుకోలేదు, దీంతో ప్రభుత్వానికి ఆదాయానికి బారీగా నష్టం వాటిల్లుతుంది ,జరిమానాలు విధించడం వరకే పరిమితమైన మైనింగ్ అధికారులు వాటి వసూళ్లపై అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది….
ముఖ్యంగా గత ప్రభుత్వంలో అన్నీ తానై,రాజు నేనే మంత్రి నేనే అనే స్థాయిలో అక్రమ “మట్టి మాఫియా”ను ఒంటి చేత్తో నడిపించి,అటు రాజకీయ నాయకులకు,ఇటు రెవెన్యూ , మైనింగ్ అధికారులకు తలలో నాలుకలా మెలుగుతూ వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి అక్రమ, సామ్రాజ్యాన్ని స్థాపించి నేడు హైదరాబాద్ లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఓ మట్టి మాఫియా “కింగ్ పిన్”బినామీకి దాదాపు తొంబై కోట్ల రూపాయలు జరిమానా విధిస్తే ఈ రోజుకు కూడా ఆ జరిమానా తాలూకు డబ్బులు వసూళ్లు చేయడానికి రెవిన్యూ అధికారులు భయపడుతున్నారంటే ఏ స్థాయిలో సదరు “కింగ్ పిన్” వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడనే విషయం అర్థమవుతుంది, అంతే కాకుండా సదరు”మట్టి మాఫియా డాన్” పై చింతకాని మండలం, చిన్న మండవ గ్రామంలో మున్నేరు నది పక్కన సొంతంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమ ఇసుక వ్యాపారం సాగిస్తున్నాడంటూ వివిధ పత్రికల్లో వార్తా కథనాలు రావడం,ఈ విషయంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీరియస్ అవడంతో చింతకాని పోలీస్ స్టేషన్లో సదరు “మట్టి మాఫియా డాన్” పై “నాన్ బెయిల్ బుల్” కేసు నమోదు కాగా ఈ రోజుకు అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే సదరు వ్యక్తి పలుకుబడి ఏమిటనేది సామాన్యులకు కూడా ఇట్టే అర్థమవుతుంది,అంతే కాకుండా ఇటివల మరో పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి….
అంతే కాకుండా ఖమ్మం “మట్టి మాఫియా”ను ఒంటి చేత్తో
శాసించే మరో “మట్టి మాఫియా డాన్” పైన కూడా దాదాపు పది నుండి ఇరవై కోట్ల రూపాయల జరిమానా విధిస్తే ఇప్పటికీ ఒక్క పైసా కూడా అతని దగ్గర అధికారులు వసూళ్లు చేయలేక పోతున్నారు పైగా అతని పేరు మీద మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో అతని బార్య పేరు మీద అనుమతులిస్తూ అధికారులు తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారు, ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లను చదును చేసే నెపంతో రెవెన్యూ, మైనింగ్ అధికారులు సదరు మట్టి వ్యాపారితో కుమ్మక్కై బల్లెపల్లి రెవెన్యూ పరిధిలోని దాదాపు నలభై రెండు ఎకరాల్లో ఉన్న పెద్ద మట్టి గుట్టను ఎటువంటి టెండరు పిలవకుండా ఇష్టారీతిన సదరు వ్యాపారి భార్య పేరు మీద మంజూరు చేయడం విశేషం, అక్రమంగా మంజూరు చేయడమే కాకుండా దాదాపు పదిహేను నుండి ఇరవై సార్లు తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ విషయం మీద మైనింగ్ అధికారులను ప్రశ్నిస్తే మంత్రి పోన్ చేశాడు మేము అనుమతులిచ్చాం మాకేం సంబంధం లేదని పొంతన లేని సమాధానాలు చెప్పడం గమనార్హం, వాస్తవానికి మంత్రి ఎపుడూ ఇలాంటి అక్రమ వ్యాపారులను దగ్గరకు రానివ్వడనే మంచి పేరు ఉంది కానీ తన అనుచరులు కొంతమంది ఆయన పేరు ఉపయోగించుకుని అధికారులను బెదిరించడమో లేక ప్రలోభాలకు గురి చేయడమో చేసి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి….
సదరు “మట్టి మాఫియా డాన్”లకు అధికార పార్టీ నాయకులు,అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో వారిపై విధించిన జరిమానాల వసూళ్ల విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ,
ఈ అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయంటూ తప్పించుకుంటున్నారు నిజానికి కోర్టు రికార్డులను పరిశీలిస్తే సదరు మట్టి వ్యాపారులపై విధించిన జరిమానాలపై ఎలాంటి స్టే ఆర్డర్లు లేకపోవడం విశేషం,ఈ నేపథ్యంలో, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, జరిమానాల వసూళ్లను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.అక్రమ తవ్వకాలపై నిరంతర పర్యవేక్షణతో పాటు,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు……
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
