తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం సిటీ : ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్.. ఇప్పుడు దళారులు, కమీషన్ ఏజెంట్లు, అవినీతి అధికారులకు, మార్కెట్ కమిటీ పాలక వర్గానికి కాసుల వర్షం కురిపించే అడ్డాగా మారింది. పగటిపూట రైతుల కళ్లెదుటే ఒక మోసం జరిగితే, గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో కోట్లాది రూపాయల ‘చీకటి వ్యాపారం’ యథేచ్ఛగా సాగుతోంది. మార్కెట్‌లో పెట్రేగిపోతున్న ‘జీరో’, ‘ఆర్డీ’ (RD) దందాల వల్ల అటు ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల గండి పడుతుండగా……ఇటు రైతన్న నిలువు దోపిడీకి గురవుతున్నాడు….
జీరో, ఆర్డీ దందాలు.. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి….
నిబంధనల ప్రకారం మార్కెట్‌లో కొనుగోలు చేసిన ప్రతి బస్తాకు 1 శాతం మార్కెట్ ఫీజుతో పాటు, కమర్షియల్ ట్యాక్స్ (GST) చెల్లించాలి. కానీ మార్కెట్ అధికారులు, పాలకవర్గ సభ్యుల అండదండలతో బడా వ్యాపారులు ‘జీరో’ దందాకు తెరలేపారు. అంటే వంద బస్తాలు కొనుగోలు చేస్తే, రికార్డుల్లో కేవలం 20 బస్తాలు మాత్రమే చూపిస్తూ, మిగతా 80 బస్తాలను ఎటువంటి పన్నులు కట్టకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. ఈ దందా వల్ల ఖమ్మం మార్కెట్‌కు, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు కోట్ల రూపాయల ఆదాయం గల్లంతవుతోంది…..
రైతు భవిష్యత్తును బలితీసుకుంటున్న ‘చీకటి వ్యాపారం’….
ఈ ‘జీరో’ వ్యాపారం రైతుల పాలిట శాపంగా మారుతోంది. రికార్డుల్లో రైతు పంట అమ్మినట్లు ఎక్కకపోవడం వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయి.
పంట అమ్మిన ఆధారాలు లేకపోవడంతో భవిష్యత్తులో ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరల బోనస్, పంట నష్టపరిహారం వంటి ప్రయోజనాలను రైతులు కోల్పోతున్నారు.అంతే కాకుండా చట్టబద్ధమైన లావాదేవీలు లేకపోవడం వల్ల ఏవైనా ఆపదలు వస్తే రైతు బీమా అందడంలోనూ చిక్కులు వస్తున్నాయి, కర్మజాలక వ్యాపారులు డబ్బులు చెల్లించకుండా బోర్డు తిప్పేస్తే తమ పంట అమ్మినట్లు రైతుల వద్ద ఎలాంటి రసీదులు ఉండవు. దీంతో రైతులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసి, న్యాయపరంగా పోరాడే అవకాశం కూడా లేకుండా పోతోందనేది అక్షర సత్యం…..
సిండికేట్ రాక్షసత్వం.. ‘ఈ-నామ్’ అపహాస్యం…
దేశవ్యాప్తంగా పారదర్శకత కోసం కేంద్రం ఈ-నామ్ (e-NAM) పద్ధతిని ప్రవేశపెట్టినా, ఖమ్మం మార్కెట్‌లో అది అపహాస్యం పాలవుతోంది. వ్యాపారులు, కమీషన్ దారులు, గుమస్తాలు ఒక సిండికేట్‌గా ఏర్పడి బిడ్డింగ్‌లో ధరలు పెరగకుండా చక్రం తిప్పుతున్నారు. రైతు ఎంత నాణ్యమైన పంట తీసుకొచ్చినా.. తేమ ఎక్కువగా ఉందని, రంగు మారిందని, తాలు ఉందని ఏదో ఒక వంక పెట్టి ధరను అమాంతం తగ్గించేస్తున్నారు. వ్యాపారులు ముందుగానే మాట్లాడుకుని, ఒక నిర్ణీత ధర కంటే ఒక్క రూపాయి కూడా పెంచకుండా రైతులను నిలువునా ముంచుతున్నారు.
తూకాల్లో దగా.. గుమస్తాల ఆగడాలు….
ఈ దోపిడీలో కమీషన్ దారుల వద్ద పనిచేసే గుమస్తాలదే కీలక పాత్ర.ఎలక్ట్రానిక్ కాటాలను (తూకం యంత్రాలను) ముందుగానే సెట్టింగ్ చేసి కిలోల కొద్దీ బరువును కొట్టేస్తున్నారు.బస్తాలను వేగంగా దించుతూ, తూకం స్లిప్పులపై తప్పుల తడకగా బరువును రాస్తున్నారు.ఈ అక్రమాలను పసిగట్టి ఏ రైతు అయినా ప్రశ్నిస్తే.. గుమస్తాలు వారిపై బూతులతో విరుచుకుపడుతూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారు. “గిట్టుబాటైతే అమ్ముకో.. లేదంటే బస్తాలు వెనక్కి తీసుకెళ్లు” అంటూ బెదిరింపులకు దిగడం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నిత్యకృత్యంగా మారింది….
బదిలీ అయినా.. కుర్చీని వదలని సెక్రెటరీ…
ఇంత బహిరంగంగా మోసాలు, జీరో దందాలు జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన మార్కెట్ సెక్రటరీ, విజిలెన్స్ అధికారులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు చోద్యం చూస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు ప్రతి నెలా వ్యాపారుల నుంచి భారీగా ముడుపులు అందుతున్నాయన్నది మార్కెట్‌లో బహిరంగ రహస్యం.ముఖ్యంగా మార్కెట్ సెక్రెటరీ వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ నాయకుల అండదండలతో చెలరేగిపోతున్న సెక్రెటరీ.. బదిలీ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఐదు సార్లు పొడిగింపు ఉత్తర్వులు తెచ్చుకోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటో అధికారులకే తెలియాలి.సదరు సెక్రెటరీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తో పాటు అధికార పార్టీకి చెందిన మరికొంతమంది నాయకులతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగడం,వారితో కలిసి ప్రైవేట్ వ్యాపరాలు చేయడంతో పాటు దళారులకు వంతపాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి తుమ్మల స్పందించాలి.. సమగ్ర విచారణ జరిపించాలి…
అన్నం పెట్టే రైతన్న కన్నీరు పెడుతున్నా ఖమ్మం మార్కెట్ అధికారుల్లో చలనం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అయిన శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించాలని స్థానిక రైతులు, రైతు సంఘాల నాయకులు ముక్తకంఠంతో కోరుతున్నారు.ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న జీరో, ఆర్డీ దందాల్లో మార్కెట్ సెక్రటరీ, వైస్ చైర్మన్ పాత్రపై ఉన్నతస్థాయి అధికారులతో లేదా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తో సమగ్ర విచారణ జరిపించి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
