జలాల కేంద్రంగా తెలంగాణలో ‘రాజకీయ యుద్ధం’: రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు సవాళ్లు-ప్రతిసవాళ్లు !!

Pathi Sreenivas Rao
2 Min Read

​హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో జల జగడం మళ్లీ మొదటికొచ్చింది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేంద్రంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విసిరిన రాజకీయ సవాళ్లతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది….

​పాలమూరులో భూసేకరణ సమస్యలపై బీఆర్ఎస్ పాదయాత్రకు సిద్ధమవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైంది.మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, డిసెంబర్ లోగా తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద శుభవార్త అందించబోతున్నట్లు ప్రకటించారు.కృష్ణా జలాల్లో అదనంగా 90 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు, మరో 20 నుండి 30 టీఎంసీలను దిండి ప్రాజెక్టుకు తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు ఫలప్రదమవుతున్నాయని ఆయన తెలిపారు…​అదే సమయంలో, గతంలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీల వాటాకే అంగీకరించి కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారని రేవంత్ తీవ్రంగా దుయ్యబట్టారు….

​అయితే, గోదావరి జలాలకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. మన ప్రాజెక్టులు వాడుకున్నాక మిగిలిన నీరు సముద్రంలో కలవకుండా ఏపీ వాడుకుంటే తప్పేంటని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.దీనిపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.కృష్ణా జలాల్లో ఏదో సాధిస్తున్నామని నమ్మిస్తూ, గోదావరి జలాలను ఏపీకి రేవంత్ తాకట్టు పెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు.ఏపీ ప్రతిపాదిత ‘బనకచర్ల’ ప్రాజెక్టుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు.​కేంద్ర జలశక్తి శాఖ గణాంకాలను ప్రస్తావిస్తూ.. గత ఏడాది కృష్ణా జలాల్లో ఏపీ 70 శాతానికి పైగా వాడుకుంటే, కాంగ్రెస్ చేతకానితనం వల్ల తెలంగాణ కేవలం 26 శాతమే వాడుకోగలిగిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు….

​రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో మళ్లీ ‘మొలవనివ్వను’, పాలమూరు గడ్డపై ఆ పార్టీ గుర్తును కూడా గెలవనివ్వనని సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు…
​ఈ సవాలును హరీష్ రావు అంతే తీవ్రంగా స్వీకరించారు “పాలమూరులో మమ్మల్ని ఓడించడం కాదు, 2028 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే ఆయన్ను ఓడించి తీరుతాం” అని హరీష్ రావు ప్రతిసవాల్ విసిరారు.గతంలో 2018లో కొడంగల్‌లో రేవంత్‌ను ఓడించింది తానేనని గుర్తు చేస్తూ, సవాళ్లు చేసి పారిపోయే నైజం రేవంత్ రెడ్డిదేనని మల్కాజ్‌గిరి పార్లమెంట్ పోటీని ఉదహరించారు.​కృష్ణా, గోదావరి నదీ జలాల హక్కుల పరిరక్షణ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఒకవైపు ప్రాజెక్టుల పూర్తి బాధ్యత తమదేనని కాంగ్రెస్ అంటుంటే, రాష్ట్ర హక్కులను పక్కరాష్ట్రానికి దారాదత్తం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో ప్రజలు ఎటువైపు నిలుస్తారో కాలమే నిర్ణయించాలి….

​

📄 Generate e-Paper Clip
Share This Article