లక్షల్లో ఫీజులు…నరకంలో చదువులు:ఖమ్మంలో కార్పొరేట్ కాలేజీల నిలువు దోపిడీ.. పట్టించుకోని విద్యాశాఖ!!

Pathi Sreenivas Rao
4 Min Read

ఖమ్మం సిటీ (స్పెషల్ రిపోర్ట్): విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాల్సిన విద్యాసంస్థలు ఖమ్మం నగరంలో కమర్షియల్ ఫ్యాక్టరీలుగా మారాయి. “లక్షల్లో ఫీజులు… చుక్కల్లో చదువులు” అన్న చందంగా ఖమ్మం సిటీలోని కార్పొరేట్ కాలేజీల పరిస్థితి తయారైంది. ప్రధానంగా నగరంలో ఆరు ప్రముఖ విద్యాసంస్థలు నిబంధనలను గాలికి వదిలేసి అక్షరాలా దోపిడీకి నిలయాలుగా మారాయి. ర్యాంకుల ఆశ చూపి తల్లిదండ్రుల జేబులు గుల్ల చేయడమే కాకుండా, విద్యార్థులను శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాయి.

ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల నిబంధనలు ఖమ్మం కార్పొరేట్ కాలేజీల ముందు బలాదూర్ అవుతున్నాయి. నిర్ణీత ఫీజులకు మించి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ట్యూషన్ ఫీజులకే పరిమితం కాకుండా.. ప్రత్యేక కోచింగ్, స్టడీ మెటీరియల్, వీక్లీ టెస్టుల పేరుతో అదనపు బాదుడుకు దిగుతున్నారు. పన్నులు ఎగవేసేందుకు రసీదులు (Receipts) ఇవ్వకుండా నగదు రూపంలో (Cash Only) ఫీజులు వసూలు చేస్తూ బ్లాక్ మనీని పోగేసుకుంటున్నారు. ఫీజులు చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే చాలు.. తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి బహిరంగంగా అవమానిస్తూ వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు….

ర్యాంకుల వేటలో మార్కుల కోసం విద్యార్థులపై కార్పొరేట్ యాజమాన్యాలు మోపుతున్న ఒత్తిడి వర్ణనాతీతం. ఉదయం సూర్యోదయానికి ముందే మొదలయ్యే తరగతులు, రాత్రి పొద్దుపోయే దాకా సాగుతున్నాయి. విద్యార్థులకు కనీస విశ్రాంతి, వినోదం లేకుండా చేస్తున్నారు. నిరంతర ఒత్తిడి వలన విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధి (Personality Development) పూర్తిగా కుంటుపడుతోంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఎంతోమంది విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు (Depression) గురవుతున్నారు…..

కార్పొరేట్ కాలేజీల్లో క్రమశిక్షణ, భద్రత పూర్తిగా గాడి తప్పింది అనడానికి ఇటీవల జరిగిన సంఘటనలే సజీవ సాక్ష్యాలు. విద్యార్థుల పట్ల కనీస పర్యవేక్షణ లేకపోవడంతో వారు దారితప్పుతున్నారు.ఇటీవల వైరా రోడ్డులోని శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు గ్యాంగులుగా విడిపోయి, నడిరోడ్డుపై కొట్లాటకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది….
అలాగే వెలుగుమట్ల నారాయణ కాలేజీ బ్రాంచ్ హాస్టల్లో విద్యార్థుల వద్ద ఏకంగా మత్తుపదార్థం (గంజాయి) పట్టుబడటం మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడం కార్పొరేట్ వ్యవస్థ డొల్లతనానికి అద్దం పడుతోంది. విద్యార్థుల భద్రతను గాలికి వదిలేసి కేవలం మార్కులు, ర్యాంకుల పైనే యాజమాన్యాలు దృష్టి పెడుతున్నాయన్న విమర్శలకు ఇవి బలం చేకూరుస్తున్నాయి….

కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా, ప్రభుత్వ నిబంధనలు పగటిపూటే ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ అధికారులు (DEO, RIO, తదితరులు) చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాలేజీ యాజమాన్యాలు ఇచ్చే మామూళ్లకు, ముడుపులకు కక్కుర్తిపడి అధికారులు తనిఖీలు చేయడం మానేశారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు…విద్యార్థుల ప్రాణాలతో, భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి విద్యాసంస్థల పట్ల ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజులపై తక్షణమే ‘ప్రత్యేక ఆడిట్’ (Special Audit) నిర్వహించాలని,హాస్టళ్లు, మెస్‌లు, క్యాంపస్‌లపై సంబంధిత శాఖల అధికారులు (రెవెన్యూ, వైద్య, విద్యా శాఖలు) ఆకస్మిక తనిఖీలు (Surprise Checks) చేపట్టాలనీ అంతే కాకుండా విద్యార్థులు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకునేందుకు పోలీస్, విద్యాశాఖల ఆధ్వర్యంలో ఒక ‘ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్’ ఏర్పాటు చేయడంతోపాటు మౌలిక సదుపాయాలు లేని, నిబంధనలు ఉల్లంఘించే కాలేజీల గుర్తింపు రద్దు చేయడంతో పాటు యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని,ర్యాంకుల కంటే విద్యార్థుల సంక్షేమం, శారీరక-మానసిక ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత ఇచ్చేలా కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి….

📄 Generate e-Paper Clip
Share This Article