తెలంగాణా /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :
చండ్రుగొండ (భద్రాద్రి కొత్తగూడెం):
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే చేర్చి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో గురువారం మంత్రి విస్తృతంగా పర్యటించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్‌లతో కలిసి మంగయ్యబంజార, పొకలగూడెం, రావికంపాడు గ్రామాల్లో సుమారు రూ. 1.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా పోకలగూడెం వేదికగా జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు…
గుడిసెల్లేని తెలంగాణే మా ధ్యేయం…
రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా పూరి గుడిసెలో నివసించకూడదనే ఏకైక ధ్యేయంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. “ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో మొత్తం 7 లక్షల ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఒక్క రాజధాని హైదరాబాద్ నగరానికే ప్రత్యేకంగా లక్ష ఇళ్లను మంజూరు చేశాం” అని ఆయన వెల్లడించారు.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, రూ. 8.21 లక్షల కోట్ల భారాన్ని నెత్తిపై పెట్టినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏమాత్రం ఆపకుండా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి వివరించారు…
మహిళా సాధికారత, నిరుద్యోగులకు భరోసా…..
తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తూ ఏకంగా రూ. 70 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందించినట్లు తెలిపారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామన్నారు.అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తూ పేదల పక్షపాతిగా నిలిచామన్నారు.అలాగే ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల వ్యవధిలోనే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇటీవలే మరో 16 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించామని సగర్వంగా ప్రకటించారు….
గ్రామాల వారీగా అభివృద్ధి పనుల మంజూరి వివరాలు….
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెబుతూ, వివిధ గ్రామాల్లో పనులను మంత్రి ప్రారంభించారు.రూ. 45 లక్షలతో చేపట్టే గ్రావెల్ రోడ్డు, కల్వర్టు, సీసీ రోడ్డు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ గ్రామానికి కొత్తగా 24 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.అదే విధంగా రూ. 60 లక్షల వ్యయంతో నాలుగు అంతర్గత సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. ఈ గ్రామానికి ఇప్పటికే 77 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు.అంతే కాకుండా రావికంపాడులో రూ. 20 లక్షలతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేశారు. మిగిలిన అంతర్గత రహదారులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీవో మధు, చండ్రుగొండ తహసిల్దార్ జగదీశ్వర ప్రసాద్, డీపీఓ అనూష, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
