యాధాద్రి ధర్మల్ పవర్ ప్లాంటులో అసలు సమస్య ఎక్కడ ? మేనేజ్‌మెంట్ వైఫల్యాలను ఫీల్డ్ ఇంజనీర్లపై రుద్దుతున్న వైనం!!

Pathi Sreenivas Rao

హైదరాబాద్ : ప్రస్తుతం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) లో అనేక సాంకేతిక, ఉత్పత్తి మరియు నిర్వహణ సంబంధిత సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఒక భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కేంద్రంలో ఆశించిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగకపోగా, సవాళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అతిపెద్ద విషాదం ఏమిటంటే.. ప్రతి సమస్యకు ప్లాంట్ ఇంజనీర్లు, ఆపరేషన్ సిబ్బంది లేదా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (CHP) సిబ్బందినే బలిపశువులను చేయడం! వ్యవస్థాగత లోపాలను పక్కనబెట్టి, క్షేత్రస్థాయి ఉద్యోగులపై బాధ్యత నెట్టివేయడం ఎంతవరకు సమంజసం అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రధానాంశం.

CHP డిజైన్ లోపమా? సాంకేతిక వైఫల్యమా? అనే విషయం అంతు పట్టడం లేదు,CHP కన్వేయర్ సిస్టమ్ డిజైన్ సామర్థ్యం 2500 TPH (టన్స్ పర్ అవర్) కాగా, ప్రస్తుతం గరిష్టంగా 1200 TPH మాత్రమే నడుస్తోంది. ఇది చూసి “CHP సామర్థ్యం తగ్గింది, సిబ్బంది పనితీరు సరిగా లేదు” అని చెప్పడం చాలా సులభం. కానీ వాస్తవం ఏమిటంటే, యూనిట్ కమిషనింగ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు EPC కాంట్రాక్టర్ అయిన BHEL కూడా ఈ 2500 TPH సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రూవ్ చేయలేకపోయింది. డిజైన్ చేసిన కెపాసిటీని ప్రాక్టికల్‌గా సాధించలేకపోతే.. అది డిజైన్ పరమైన లోపమా, ఎరెక్షన్ సమస్యనా, లేదా సిస్టమ్ ఇంటిగ్రేషన్ వైఫల్యమా అనే సాంకేతిక విశ్లేషణ జరగాలి. దానిని వదిలేసి ప్లాంట్ ఇంజనీర్లపై నిందలు వేయడం సబబు కాదు…..

సాధారణంగా 800 MW యూనిట్‌కు సుమారు 450 TPH నాణ్యమైన బొగ్గుతో పూర్తి లోడ్ రావాలి. కానీ ప్రస్తుతం అదే 450 TPH బొగ్గును మండిస్తున్నా కేవలం 400 MW విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీనికి కారణం యంత్రాలు పని చేయకపోవడం కాదు, ఇంజనీర్ల నిర్లక్ష్యం అంతకంటే కాదు. గత ఏడాది కాలంగా ప్లాంట్‌కు సరఫరా అవుతున్న అత్యంత తక్కువ నాణ్యత గల బొగ్గే ప్రధాన కారణం. అదే మంచి నాణ్యత గల బొగ్గు వస్తే 200–250 TPH వద్దనే పూర్తి ఉత్పత్తి సాధ్యమవుతుంది. నాసిరకం బొగ్గు వల్లే CHP కన్వేయర్లు, క్రషర్లు, స్టాకర్లు, రీక్లైమర్లు తదితర మొత్తం కోల్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌పై రెట్టింపు భారం పడుతోంది…..

నాలుగు యూనిట్లు నిరంతరాయంగా నడవాలంటే CHP కు రోజుకు కనీసం 12 రైలు లోడ్ల (రేకులు) బొగ్గు రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వస్తున్నవి కేవలం 4 లోడ్లు మాత్రమే. బొగ్గు రాకుండా విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది? సరఫరాను పర్యవేక్షించాల్సిన వ్యవస్థలు విఫలమైతే, ప్లాంట్ సిబ్బందిని ప్రశ్నించడం వల్ల ప్రయోజనం ఏమిటి? అంతే కాకుండా బొగ్గు నాణ్యత అధ్వాన్నంగా ఉండటం, తగినంత ఇన్-ఫ్లో లేకపోవడం వల్ల బాయిలర్ స్థిరత్వం కోసం అదనంగా ఆయిల్ (Oil) వినియోగించాల్సి వస్తోంది. బొగ్గుతో పోలిస్తే ఆయిల్ ఖర్చు ఎన్నో రెట్లు ఎక్కువ. ఒకవైపు నాసిరకం బొగ్గు కారణంగా ఎక్కువ పరిమాణంలో బొగ్గు కాల్చాల్సి రావడం, మరోవైపు బాయిలర్ ట్రిప్ కాకుండా ఆయిల్ వాడాల్సి రావడం సంస్థపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతోంది. అంతిమంగా ఇది ప్రజల నెత్తిపైనే పడుతుంది…..

ఇంజనీర్లు సిస్టమ్‌ను నడుపుతారు, ఆపరేట్ చేస్తారు. కానీ ప్లాంట్ డిజైన్ చేయరు, వేల కోట్ల రూపాయల బొగ్గు కొనుగోలు చేయరు, రైల్వే రేకులు కేటాయించరు, ఫ్యూయల్ పాలసీ (Fuel Policy) నిర్ణయించరు. బొగ్గు కొనుగోలు, నాణ్యత నియంత్రణ, సరఫరా ప్రణాళిక, రైలు రేకుల కేటాయింపు, ఇంధన నిర్వహణ వంటి అత్యంత కీలకమైన అంశాలన్నీ యాజమాన్యం (మేనేజ్‌మెంట్) మరియు ప్రభుత్వ విధానాల పరిధిలోకి వస్తాయి. ఈ అంశాల్లో ఉన్న లోపాలను సరిదిద్దాల్సింది, EPC కాంట్రాక్టర్‌ను నిలదీయాల్సింది కూడా మేనేజ్‌మెంట్‌నే.కానీ బోర్డు రూముల్లో పరిష్కరించాల్సిన సమస్యలను పక్కన పెట్టి, ఫలితంగా ఏర్పడిన ఇబ్బందులను మాత్రమే చూపిస్తూ ఇంజనీర్లు, ఫీల్డ్ సిబ్బందిపై వేలెత్తి చూపడం సమస్యను పక్కదారి పట్టించడమే అవుతుంది….

బొగ్గు నాణ్యత మరియు కొనుగోలు ఒప్పందాలపై ఉన్నత స్థాయి సమీక్ష జరగాలి.BHEL కాంట్రాక్టు నిబంధనల ప్రకారం డిజైన్ కెపాసిటీ ఎందుకు సాధించలేకపోతున్నారో నిపుణుల కమిటీతో విచారణ చేపట్టాలి.అదే విధంగా యాజమాన్యం, రైల్వే మరియు బొగ్గు సరఫరా సంస్థల మధ్య సమన్వయం పెంచి ప్రతిరోజూ 12 రైలు రేకులు వచ్చేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని ఉద్యోగులు కోరుతున్నారు,నిజమైన బాధ్యత ఎక్కడ ఉందో అక్కడే చర్చ జరగాలి. అసలు కారణాలను గుర్తించకుండా కేవలం ఫలితాల గురించి మాట్లాడటం వల్ల ప్లాంట్ పనితీరు మెరుగుపడదు. “సమస్య వచ్చినప్పుడు తప్పు ఎవరిది?” అనే ప్రశ్న కంటే, “సమస్య రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?” అనే ప్రశ్నకు సమాధానం వెతికితేనే YTPS భవిష్యత్తుకు మేలు జరుగుతుంది. బొగ్గు నాణ్యత, సరఫరా పరిమాణం, ఆయిల్ వినియోగం, CHP పై పెరుగుతున్న లోడ్ వంటి అంశాలపై యాజమాన్యాన్ని ప్రశ్నించడం, సమర్థవంతమైన చర్యలు కోరడం ఇప్పుడు ప్రతి ఉద్యోగిపై ఉందని పలువురు విధ్యుత్ రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు…..