రఘునాథపాలెంలో రెచ్చిపోతున్న ‘మట్టి మాఫియా డాన్’.. గుట్టలు, చెరువులు స్వాహా!!

Pathi Sreenivas Rao

ఖమ్మం (రఘునాథపాలెం): మండలంలో మట్టి మాఫియా అక్రమాలు శృతి మించుతున్నాయి. అధికార పార్టీ నాయకులు, కొందరు అవినీతి అధికారుల అండదండలతో ఓ ‘మట్టి మాఫియా డాన్’ పర్యావరణాన్ని నిలువునా దోచేస్తున్నాడు. పచ్చని గుట్టలు, ప్రభుత్వ చెరువులు అతని ధన దాహానికి కనుమరుగవుతున్నాయి. నిబంధనలను గాలికి వదిలేసి, అందిన కాడికి ప్రకృతి సంపదను కొల్లగొడుతూ కోట్లు గడిస్తున్న తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు అతి సామాన్య స్థితిలో ఉన్న సదరు వ్యక్తి.. కేవలం ఈ అక్రమ మట్టి దందా ద్వారానే వందల కోట్లు గడించి ‘మాఫియా డాన్’గా ఎదిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తన అక్రమాలను ప్రశ్నించే వారికి అరిచే కుక్కకు బిస్కెట్లు పడేసినట్లు డబ్బు ఆశ చూపి నోరు మూయిస్తున్నాడు. మాట వినని వారిపై రౌడీయిజం ప్రదర్శిస్తూ బెదిరింపులకు, భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….

తాజాగా రఘునాథపాలెం గ్రామ చెరువులో అర్ధరాత్రి వేళ ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు చేపట్టాడు .రాత్రికి రాత్రే వందల ట్రిప్పుల మట్టిని తవ్వి, యథేచ్ఛగా ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు.కేవలం చెరువులే కాకుండా రఘునాథపాలెం పరిసరాల్లోని గుట్టలకు సైతం గుండు కొట్టిస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖనిజ సంపదను లూటీ చేస్తున్నాడు .ఈ అక్రమ దందా వెనుక రఘునాథపాలెం మండలానికి చెందిన ఒక అధికార పార్టీ నాయకుడు, అలాగే మండల పార్టీ ఇన్‌ఛార్జి పేరుతో చక్రం తిప్పుతున్న మరో నాయకుని హస్తం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీరి అండదండలతోనే సదరు ‘డాన్’ రెచ్చిపోతున్నాడు. ఇక ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాల్సిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు ‘మామూళ్ల మత్తు’లో జోగుతూ మట్టి మాఫియా డాన్ పై విపరీతమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. తవ్వకాలు జరుగుతున్నా అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు….అర్ధరాత్రి చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకాలపై స్థానికుల ఫిర్యాదుతో కదిలిన పోలీస్ యంత్రాంగం ఒక ట్రిప్పర్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించింది.వాహనం పట్టుకున్న వెంటనే పోలీసు అధికారులకు అధికార పార్టీ నాయకుల నుంచి పదుల సంఖ్యలో ఫోన్లు వెళ్లాయి. తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లతో చేసేదేమీ లేక పోలీసులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన తర్వాత కూడా వెనక్కి తగ్గని మట్టి మాఫియా డాన్ ఇంకా చెరువులో మట్టి తవ్వకాలు జరపడం విశేషం, అంతే కాకుండా తనను ప్రశ్నించిన స్థానికులపైనే ఎదురు దాడులకు యత్నించడం అతని బరితెగింపునకు నిదర్శనమని స్థానికులు విమర్శలు చేయడం గమనార్హం…..

ప్రకృతిని నాశనం చేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ మట్టి మాఫియా డాన్ ఆగడాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. పర్యావరణాన్ని రక్షించి, అక్రమార్కులపై రౌడీషీట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రఘునాథపాలెం ప్రజలు కోరుతున్నారు…..