తెలంగాణ/ ఖమ్మం జిల్లా:
ఖమ్మం సిటీ:ఖమ్మం నగరంలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలు, కాలువలు, పార్కులు అని తేడా లేకుండా కంటికి కనిపించిన ప్రతి ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు. తాజాగా నగరంలోని గొల్లగూడెం రోడ్డు, మధురానగర్ రోడ్ నెంబర్ 3 ప్రాంతంలో ఎన్ఎస్పీ (NSP) కాలువ భూములను లక్ష్యంగా చేసుకుని, తప్పుడు పత్రాలతో యథేచ్ఛగా అక్రమ గృహ నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు చేపడుతున్న తీరు స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది.ఒక వ్యక్తి ఎలాంటి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన మూడు ఇండ్లకు ఏకంగా యాభై నుండి అరవై వేల రూపాయలు అద్దెలు వస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు కానీ అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లో అనేక సందేహాలకు తావిస్తుంది….
తప్పుడు పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు…
ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 59 జీవో ఇప్పుడు కబ్జాకోరులకు వరంగా మారింది. ఈ జీవోను ఆసరాగా చేసుకుని పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్లకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు.59 జీవోలో క్రమబద్ధీకరించిన 150 గజాల స్థలం డాక్యుమెంట్లను అడ్డం పెట్టుకుని, ఇద్దరు వ్యక్తులు వందల గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నారు.ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తీరు మరింత వివాదాస్పదంగా మారింది. 1982 సంవత్సరంలో భూములు అమ్ముకున్న యాజమానుల కుటుంబ సభ్యుల సంతకాలతో, ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా వందల గజాల ప్రభుత్వ స్థలాన్ని ఖమ్మం సబ్ రిజిస్ట్రార్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం విమర్శలకు దారి తీస్తోంది. కనీస ఆధారాలు, సరైన పత్రాలు లేకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారో అర్థంకాక స్థానికులు తలపట్టుకుంటున్నారు,ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక బ్యాంక్ ఉద్యోగి చేసిన సంతకాలు చర్చకు దారితీసింది….
మీకు ఏమి కావాలి? మీరు ఏమి కోరుకుంటున్నారు?”
ఎన్ఎస్పీ కాలువ భూములను అడ్డగోలుగా ఆక్రమించి వందల గజాల్లో ఇండ్లు నిర్మిస్తున్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ గృహాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు, కనీసం ఇంటి నెంబర్లు కూడా కేటాయించలేదు. ఈ తప్పుడు డాక్యుమెంట్లతో నిర్మిస్తున్న కట్టడాలకు టౌన్ ప్లానింగ్, కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు
ఏ విధంగా సహకరిస్తున్నారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.అక్రమాలపై స్థానికులు ఫిర్యాదు చేస్తే, కబ్జాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు.. “మీకు ఏమి కావాలి? మీరు ఏమి కోరుకుంటున్నారు?” అని ఫిర్యాదుదారులనే బేరసారాలకు గురిచేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్ర, అవినీతిపై స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు….
మున్సిపల్ పార్కుకు కేటాయించిన స్థలంపై కన్నేసిన అధికార పార్టీ నాయకుడు….
ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతుండగా, మరోవైపు అధికార పార్టీ నాయకుల అండదండలతో కబ్జాల పర్వం మరింతగా ముదిరింది. ఏకంగా మున్సిపల్ పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కూడా వదలడం లేదు. మున్సిపల్ పార్కు నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి వర్క్ ఆర్డర్ తీసుకుని వచ్చిన ఒక కాంట్రాక్టర్‌పై, ఓ అధికార పార్టీ నాయకుడు ఓ కీలక అధికార పార్టీ నాయకుడి ద్వారా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై అటు కాంట్రాక్టరుపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు పార్కు నిర్మాణాన్ని అడ్డుకోవడమే కాకుండా, రాత్రికి రాత్రే ఆ స్థలం చుట్టూ ప్రహరీగోడ నిర్మించడం జరిగింది,ఈ మొత్తం భూకబ్జాల వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల ప్రత్యక్ష ప్రమేయం ఉండటం, వారికి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వత్తాసు పలుకుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి ఈ అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపించాలని, కబ్జాదారులతో పాటు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ, ఎన్ఎస్పీ భూములను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు…..
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, ఖమ్మం:9703973456