ఔటర్ రింగ్ రోడ్డు ఎవరి కోసం? ప్రజల కోసమా.. కమిషన్ల కోసమా..? భట్టిపై కమలరాజు ధ్వజం…

Pathi Sreenivas Rao

మధిర: ఒకప్పుడు సంస్కృతి, హిస్టరీ, త్యాగాలు మరియు విద్యా రంగానికి ప్రసిద్ధి చెందిన మధిరను నేడు ‘కమిషన్ల మధిర’గా మార్చే పరిస్థితి తీసుకొచ్చారని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తీవ్రస్థాయిలో విమర్శించారు. మధిరలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.స్థానిక బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమల్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు….రోడ్డు విస్తరణ పనుల నెపంతో చిరు వ్యాపారుల ర్యాంపులు,సన్‌సైడ్లు, నేమ్‌బోర్డులను నిర్దాక్షిణ్యంగా తొలగించారని,చిరు వ్యాపారుల పొట్ట కొట్టే అభివృద్ధి ఎవరి కోసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తిరిగి పునర్నిర్మించుకోవడానికి ఒక్కో వ్యాపారిపై రూ.50 వేల నుండి రూ.2 లక్షల వరకు భారం పడుతోందన్నారు.సామాన్యుల నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ,అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విషయంలో మాత్రం నిబంధనలను ఎందుకు పక్కన బెట్టారని నిలదీశారు….

విజయవాడ, ఖమ్మం, వరంగల్ వంటి పెద్ద నగరాలకే లేని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మధిరకు ఎందుకు అవసరమని కమల్‌రాజు ప్రశ్నించారు. ORR నిర్మాణం వల్ల పట్టణంలోకి వచ్చే వాహనాలు తగ్గిపోతే టీ దుకాణాలు, హోటళ్లు, జౌళి వ్యాపారాలు మరియు ఇతర చిరు వ్యాపారుల ఆదాయం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ORR పేరుతో వందల ఎకరాల వ్యవసాయ భూములను సేకరిస్తున్నారని,రైతులకు మార్కెట్ విలువై ఆధారంగా పరిహారం చెల్లించకపోతే బీఆర్‌ఎస్ ఊరుకోదని హెచ్చరించారు….

ORR కోసం వృథాగా కేటాయిస్తున్న నిధులను పట్టణాభివృద్ధికి మళ్లించాలని ఆయన సూచించారు,మధిరకు వచ్చే ప్రధాన రహదారులపై సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని,స్థానిక ట్యాంక్‌బండ్‌ను మరింత సుందరీకరించి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలనిగత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రోడ్లు, హాస్పిటల్, చెక్‌డ్యామ్‌లు, మార్కెట్ వంటి పనులను మరింత మెరుగుపరచాలని కోరారు…మధిర చుట్టూ ప్రతిపాదిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు ముఖ్య ఉద్దేశం, భూసేకరణ వివరాలు, రైతులకు అందించే పరిహారం, వ్యాపారులపై పడే ప్రభావంపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని కమల్‌రాజు డిమాండ్ చేశారు. ప్రజలకు నష్టం చేకూర్చే ఏ ప్రాజెక్టునూ ఒప్పుకోమని, బాధితుల తరఫున బీఆర్‌ఎస్ పార్టీ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు…ఈ సమావేశంలో లింగాల కమల్‌రాజుతో పాటు నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, బిక్కి కృష్ణప్రసాద్, యన్నంశెట్టి వెంకట అప్పారావు, అరిగే శ్రీనివాసరావు, రావూరి శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, వంకాయలపాటి నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, బొగ్గుల వీరారెడ్డి, పరిశ శ్రీనివాసరావు, ఆళ్ల నాగబాబు, చీదిరాల రాంబాబు, షేక్ సైదా, వెంపటి నాగేశ్వరరావు, నాగులవంచ రామారావు, లంకమళ్ళ నాగేశ్వరరావు, అబ్బురి రామన్, ధిల్లు, గుగులోత్ కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు….