స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో వెలివిరిసిన స్నేహబంధం…అంబరాన్నంటిన స్నేహితుల దినోత్సవ వేడుకలు…

Pathi Sreenivas Rao

ఖమ్మం సిటీ : ఖమ్మం నగరంలోని స్థానిక ‘స్మార్ట్ కిడ్జ్’ పాఠశాలలో శనివారం స్నేహితుల దినోత్సవ (ఫ్రెండ్‌షిప్ డే) వేడుకలు అత్యంత ఘనంగా, ఆనందోత్సవాల మధ్య జరిగాయి. విద్యార్థుల కేరింతలు, స్నేహపూర్వక పలకరింపులతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది….

ఉదయం నుంచే పాఠశాలలో సందడి వాతావరణం కనిపించింది. విద్యార్థులు తరగతి గదిలోని తమ సహచర మిత్రుల చేతులకు రంగురంగుల ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నప్పటి నుంచి తమతో పాటే చదువుకుంటూ, ప్రతి తరగతిలో తమతో విడదీయరాని మైత్రీ బంధాన్ని పంచుకుంటున్న స్నేహితులతో కలిసి విద్యార్థులు ఎంతో సరదాగా, హుషారుగా గడిపారు. ఈ వేడుకలతో పాఠశాలలో ఉత్సాహం, ఆనందం వెల్లివిరిసింది….

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. స్నేహ బంధానికి హద్దులు, సరిహద్దులు లేవని, వర్గ, ప్రాంతీయ భేదాలకు అతీతంగా స్నేహబంధం ఎల్లప్పుడూ గౌరవించబడుతుందని ఆయన పేర్కొన్నారు.చిన్నతనంలో ఏర్పడే స్నేహం ఎంతో స్వచ్ఛమైనది, అది జీవితాంతం కలకాలం నిలిచి ఉంటుంది. పురాణాల కాలం నాటి కృష్ణ-కుచేలుల స్నేహం నుంచి నేటి ఆధునిక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగం వరకు స్నేహబంధం తన విలువను ఏమాత్రం కోల్పోలేదు. ఇది స్నేహం యొక్క గొప్పతనానికి నిదర్శనం” అని ఆయన వివరించారు….

తమ పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థికి మైత్రీ బంధం విలువను తెలియజెప్పాలనే సదుద్దేశంతోనే ఈ స్నేహితుల దినోత్సవ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తూ, విద్యార్థులందరూ భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలియజేశారు.
ఈ ఆనందోత్సవాల మధ్య జరిగిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు….