తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం:ఎక్కడో వదిలేసిన బాల్యం మళ్లీ కళ్ల ముందుకొచ్చింది. నాలుగు దశాబ్దాల క్రితం నాటి స్మృతులు ఆత్మీయ పలకరింపులతో ప్రాణం పోసుకున్నాయి. పలకల మీద రాసుకున్న అక్షరాలు చెరిగిపోయినా.. మనసుల మీద ముద్రించుకున్న స్నేహం ఎప్పటికీ చెరగదని ఆ పాత నేస్తాలు నిరూపించారు. నేలకొండపల్లి మండలం అనంతనగర్‌లోని అరవింద విద్యాలయం 1987-88 (పదో తరగతి) బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఖమ్మం వైరా రోడ్డులోని త్రివేణీ స్కూల్ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన ఈ వేడుకలో పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని గతస్మృతుల్లో పరవశించిపోయారు….

రాష్ట్ర స్థాయి పతకం కంటే ఈ సత్కారమే మధురం: సీఐ సిహెచ్.శ్రీనివాసరావు….
ఈ సందర్భంగా, పోలీసు శాఖలో అద్భుత ప్రతిభ కనబరిచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంచే ‘మహోన్నత సేవా పతకం’ అందుకున్న ఖమ్మం ఇంటెలిజెన్స్ సీఐ చల్లగుండ్ల శ్రీనివాసరావును మిత్రులంతా కలిసి శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఆత్మీయ సన్మాన పత్రాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగంతో ప్రసంగించారు.
“పోలీసు శాఖలో నేను ఎన్నో పతకాలు సాధించినా.. కూనవరం వరదల్లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చగలిగానంటే, ఆ ధైర్యం, క్రమశిక్షణ నాకు ఈ బడిలోనే అలవడ్డాయి. నేను ఎన్ని స్టేట్ మెడల్స్ అందుకున్నా, నా చిన్ననాటి స్నేహితుల చేతుల మీదుగా అందుకుంటున్న ఈ ఆత్మీయ సత్కారం నా జీవితంలో అత్యంత మధురమైనది.. చిరస్థాయిగా నిలిచిపోయేదని సిఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు…..

మళ్లీ కలుసుకోవడం నా అదృష్టం…
ఇదే బ్యాచ్‌కు చెందిన మిత్రుడు, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యనభ్యసించి ప్రస్తుతం అమెరికాలో ఉన్నతస్థాయిలో స్థిరపడిన అవినేని ఆనంద్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్వాహకులు ఆయనను వేదికపై ఘనంగా సత్కరించారు.”వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడినా, నా మూలాలు, మిత్రులు ఇక్కడే ఉన్నారు. నేను ఇండియాకు వచ్చిన సమయంలోనే ఈ కార్యక్రమం జరగడం, దశాబ్దాల తర్వాత అందరినీ మళ్లీ ఇలా కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని దూరప్రాంతాల్లో ఉన్నా, మన స్నేహం ఏమాత్రం చెక్కుచెదరలేదని వైఖ్యానించారు….

కృతజ్ఞతలు.. ఆత్మీయ వీడ్కోలు….
కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం, నిర్వాహక బృందం తరఫున టి.ఎస్.రెడ్డి మాట్లాడారు. ఈ సమ్మేళనానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు యం. అప్పారావు, పార్ధ సారధి, శివారెడ్డి, లింగారెడ్డి, ఉపేందర్, పాషా, జానకి రామయ్య, తిరుపతి రావు, నాగమణి, శాంత తదితరులు పాల్గొన్నారు. దూరప్రాంతాల నుంచి శ్రమకోర్చి విచ్చేసిన మిత్రులందరూ ‘తిరిగి మళ్లీ ఇలాగే కలుసుకుందాం’ అన్న ఆత్మీయ వీడ్కోలు పలకడంతో ఈ సమ్మేళనం కనులపండువగా ముగిసింది….
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456