తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం సిటీ : ఖమ్మం అర్బన్ మండలం, మల్లెమడుగు రెవిన్యూ పరిధిలో రెవిన్యూ అధికారుల అక్రమ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల భూములకు రక్షణగా నిలవాల్సిన అధికారులే.. నిబంధనలను తుంగలో తొక్కి, లక్షల రూపాయల చేతివాటానికి కక్కుర్తి పడి అక్రమాలకు తెరలేపిన వైనం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది….
వెంచర్ భూమిపై వారసుడి కన్ను.. నాటి LRUP తో స్కెచ్….
మల్లెమడుగు రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 186 లో గతంలో అనుమోలు వరప్రసాద్ పేరుమీద పట్టా ఉండేది. ఆయన గతంలోనే ఈ భూమిని ఎస్టీ (ST) లకు అమ్ముకున్నారు. ఆ తర్వాత ఈ భూమి పలువురి చేతులు మారుకుంటూ చివరకు 2008-2009 ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా రూపాంతరం చెందింది. దీనికి సంబంధించిన ల్యాండ్ కన్వర్షన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఆపై వందలాది ప్లాట్లుగా విభజించి, సామాన్య ప్రజలకు, అనేక మంది ఉద్యోగస్తులకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి….అయితే, ల్యాండ్ కన్వర్షన్ పూర్తయి రియల్ ఎస్టేట్ వెంచర్ అయినప్పటికీ.. పహాణీలలో మాత్రం సాంకేతిక కారణాల వల్ల ఇంకా పట్టాదారుగా అనుమోలు వరప్రసాద్ పేరే వస్తూ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న అతని వారసుడు అనుమోలు రమేష్,గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన LRUP (Land Records Upgradation Program) ను అడ్డం పెట్టుకుని 2016 లో ఎలాగైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందాలని ప్రయత్నాలు ప్రారంభించాడు….
నాటి కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్ యాక్షన్.. నేడు మళ్లీ పాత కథే….
గతంలో ఖమ్మం అర్బన్ తహసీల్దారులుగా పనిచేసిన అనేక మంది అధికారులు అనుమోలు రమేష్ చేస్తున్న అక్రమ ప్రయత్నాలను అడ్డుకున్నారు. కానీ,2023-2024 ప్రాంతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన స్వామి అనే అధికారి రూల్స్ భేకాతరు చేస్తూ వివాదాస్పద భూమికి 186/అ/1 అనే కొత్త సర్వే నెంబర్ సృష్టించి, ఐదు ఎకరాల భూమిని అనుమోలు రమేష్ పేరు మీద అక్రమంగా కన్వర్షన్ చేసేశారు.ఈ అక్రమ కన్వర్షన్ విషయం తెలుసుకున్న ప్లాట్ల కొనుగోలుదారులు వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరిస్థితి తీవ్రతను, అక్రమాలను గుర్తించిన నాటి జిల్లా కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్ తక్షణమే స్పందించి.. ఆ భూమిని బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా, అక్రమాలకు పాల్పడిన సదరు తహసీల్దార్ స్వామిని కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు…..
రూల్స్ బ్రేక్ చేసిన ప్రస్తుత మరియు బదిలీ అయిన తహసీల్దార్…
మొత్తం 8 ఎకరాల 30 కుంటల భూమిలో కలెక్టర్ ఆదేశాల ప్రకారం బ్లాక్ లిస్టులో ఉన్న ఐదు ఎకరాలు పోగా.. ప్రస్తుతం మిగిలిన మూడు ఎకరాలపై మళ్లీ అక్రమార్కుల కన్ను పడింది. ఈ మిగిలిన మూడు ఎకరాలకు వారసత్వ పట్టా క్రింద అనుమోలు రమేష్ కు పట్టాదార్ పాస్ పుస్తకం కట్టబెట్టేందుకు రెవిన్యూ అధికారులు స్కెచ్ వేశారు.ఇటీవల అర్బన్ మండలం నుండి బదిలీ అయిన తహసీల్దార్ మరియు ప్రస్తుత తహసీల్దార్ ఇద్దరూ చేతులు కలిపి పెద్ద స్కామ్ కే తెరలేపారు. ఇప్పటికే ల్యాండ్ కన్వర్షన్ పూర్తయి, ప్లాట్లుగా విభజించబడి, రిజిస్ట్రేషన్లు అయి ఉన్న ల్యాండ్ ను “వ్యవసాయ భూమి”గా చూపిస్తూ ఒక తప్పుడు రిపోర్టును తయారు చేశారు. కనీసం క్షేత్రస్థాయి పరిశీలన చేసే ఫీల్డ్ స్టాఫ్ (VRO/RI) రిపోర్ట్ లేకుండా, ప్రస్తుతం ఫోర్స్ లో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేయకుండా.. తహసీల్దారే స్వయంగా డైరెక్టుగా రిపోర్ట్ తయారు చేసిన వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది…..
కొత్త ఆర్డీవో గుడ్డిగా సంతకం…..
ఎన్నో రోజులుగా ఫైల్ ఆర్డీవో సంతకం కోసం ఎదురు చూస్తున్న సదరు తహసీల్దారులకు తాజాగా కొత్త ఆర్డీవో రావడం వరంగా మారింది దీంతో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవోకి ఈ వివాదస్పద భూమికి సంబంధించిన పూర్తి పూర్వాపరాలు, వివాదాల విషయం తెలియక పోవడంతో ఆయన తన కింది స్థాయి తహసీల్దారులపై ఉన్న నమ్మకంతో కనీసం ఫైళ్లను క్రాస్ చెక్ చేయకుండా గుడ్డిగా సంతకం చేసినట్లు తెలిసింది దీంతో మరో వారం రోజుల్లోనే పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరి కానున్నట్లు విశ్వసనీయ సమాచారం….
ముందస్తుగా అమ్మకానికి మూడు ఎకరాలు.. ఆఫీసులోనే సెటిల్మెంట్లు….
పాస్ పుస్తకాలు చేతికి వస్తున్నాయనే ధీమాతో అనుమోలు రమేష్….ఆ వివాదాస్పద మూడు ఎకరాల భూమిని అప్పుడే ఖమ్మంలోని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా, గతంలో ఈ భూమి అక్రమాలపై కోర్టుకు వెళ్లిన కొంతమంది ప్లాట్ల ఓనర్లను సదరు అధికారులు అర్బన్ మండల కార్యాలయానికి పిలిపించారు. ప్రభుత్వ ఆఫీసులోనే కూర్చోబెట్టి పట్టాదారునికి, ప్లాట్ల ఓనర్లకి మధ్య “అక్రమ సెటిల్మెంట్స్”చేసినట్లు సమాచారం బయటకొచ్చింది. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన రెవిన్యూ కార్యాలయం కాస్తా.. ఇలాంటి దందా సెటిల్మెంట్లకు అడ్డాగా మారడంపై స్థానిక ప్రజలు, బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…..
“నన్ను ఎవరూ ఏం చేయలేరు”.. మాజీ తహసీల్దార్ ధీమా….
ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పిన గత తహసీల్దార్, ప్రస్తుత తహసీల్దార్ ల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పట్టాదార్ పాస్ పుస్తకాల మంజూరి ప్రక్రియ వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి.దీనికి తోడు, ఈ అక్రమాలకు సూత్రధారి అయిన గత తహసీల్దార్ “నన్ను ఎవరు ఏమీ చేయలేరు.. నాకు త్వరలోనే ఆర్డీఓ (RDO) గా ప్రమోషన్ వస్తుంది.. నాకున్న రాజకీయ పలుకుబడితో తిరిగి ఖమ్మం ఆర్డీఓ గానే వస్తాను”అంటూ బహిరంగంగా చెప్పుకోవడం విశేషం. అధికారులు రాజకీయ అండదండలతో ఇంతలా రెచ్చిపోతుండడం చూసి బాధితులు బెంబేలెత్తిపోతున్నారు….
కలెక్టర్ గారు స్పందించాలి స్థానికుల డిమాండ్….
రూల్స్ కి విరుద్ధంగా, ప్లాట్ల స్థలాలను వ్యవసాయ భూములుగా చూపిస్తూ.. సామాన్యుల పొట్టగొట్టేలా వ్యవహరిస్తున్న ఈ మొత్తం అక్రమ భూ వ్యవహారంపై ప్రస్తుత జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని స్థానికులు, ప్లాట్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి విచారణ జరిపించి, అక్రమంగా జారీ అవుతున్న పాస్ పుస్తకాలను నిలిపివేయాలని.. అలాగే అవినీతికి, అక్రమాలకు పాల్పడిన సదరు రెవిన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456