తెలంగాణ /ఖమ్మం జిల్లా:
వైరా, జూన్ 22:రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా తుంగలో తొక్కి రైతాంగాన్ని, సామాన్య ప్రజలను నట్టేట ముంచిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం వైరా నియోజకవర్గ కేంద్రంలోని కమ్మ కల్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, తక్కిళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు…..

రైతుబంధు ‘ఓట్ల పండగ’గా మార్చారు…
కేసీఆర్ హయాంలో ప్రతీ సీజన్లో ‘నాట్లకి’ ముందే అండగా నిలిచిన రైతుబంధు పథకాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ‘ఓట్ల పండగ’గా మార్చిందని మండిపడ్డారు. వానాకాలం, యాసంగి సీజన్లు వస్తున్నా పెట్టుబడి సాయం అందక రైతులు తీవ్రంగా అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ పాలనలో ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే, దశదిన కర్మ లోపే రూ. 5 లక్షల బీమా సొమ్ము వారి ఖాతాల్లో జమయ్యేదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రీమియం కూడా చెల్లించకపోవడంతో, సుమారు రూ. 1400 కోట్ల ప్రీమియం బకాయిలు పేరుకుపోయాయని, దీంతో రైతు బీమా పథకం అటకెక్కిందని విమర్శించారు.రైతులకు చేస్తామన్న రుణమాఫీని కూడా ప్రభుత్వం అరకొరగా అమలు చేసి, రైతులను నిలువునా వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు….

యూరియా కోసం యాప్‌ల తిప్పలు….
నాడు కేసీఆర్ హయాంలో యూరియా బస్తాలు రైతులకు నేరుగా, సులభంగా అందుబాటులో ఉండేవని, కానీ నేడు వాటిని యాప్‌లకు అనుసంధానం చేశారని ఎద్దేవా చేశారు. తీరా చూస్తే ఆ యాప్‌లు అస్సలు పనిచేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు.గత యాసంగిలో పండించిన పంటను కొనుగోలు చేసే నాథుడే లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. నెలన్నర రోజులుగా కల్లాల్లోనే పడిగాపులు కాస్తున్న రైతులు, వర్షానికి కళ్లెదుటే ధాన్యం తడిసిపోతుంటే గడగడ వణికిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు….

ఆరు గ్యారెంటీలు అటకెక్కాయి….
అధికారంలోకి రాకముందు ఆర్భాటంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలుకు నోచుకోలేదని నాయకులు విమర్శించారు.ఆడబిడ్డలకు ఇస్తామన్న రూ. 2500 మహాలక్ష్మి పథకం.వృద్ధులకు ఇస్తామన్న రూ. 4000 పెన్షన్.నిరుద్యోగ భృతి వంటి హామీలన్నీ బుట్టదాఖలయ్యాయన్నారు. అంతే కాకుండా అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదని, పైగా హైదరాబాద్‌లో విలువైన భూములను అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తున్నారని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు….

కాంగ్రెస్ అహంకారానికి పరాకాష్ట.. వైరా మున్సిపల్ ఘటనే తార్కాణం…
మొన్న జరిగిన వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా తీర్పును కాంగ్రెస్ అపహాస్యం చేసిందని పువ్వాడ అజయ్ విమర్శించారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఒక మహిళా కౌన్సిలర్ ప్రజా సమస్యలపై నిలదీస్తే, సమాధానం చెప్పలేక మున్సిపల్ చైర్మన్ ఆమెను దుర్భాషలాడటం దారుణమన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అహంకారానికి, మహిళల పట్ల వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు.బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి గ్రామగ్రామాన గులాబీ జెండాను ఎగరవేయాలని పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి, రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఉద్బోధించారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456