ఖమ్మం జిల్లాలో హోంగార్డుల ‘ఆర్డర్ టు సర్వ్’ మంటలు.. కక్షసాధింపు చర్యలంటూ సిబ్బంది తీవ్ర ఆవేదన!!

Pathi Sreenivas Rao

ఖమ్మం జిల్లా : జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డుల బదిలీల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఎలాంటి ప్రయాణ భత్యాలు (TA), కరువు భత్యాలు (DA), ఇంటి అద్దె భత్యాలు (HRA) వర్తించకపోయినా.. ఉన్నతాధికారులు బలవంతపు బదిలీలకు దిగుతుండటంతో హోంగార్డులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ ఉన్నతాధికారుల కక్షసాధింపు చర్యేనంటూ జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించిన తమను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కావాలనే వేధింపులకు గురిచేస్తున్నారనే ఆవేదన హోంగార్డుల నుంచి వ్యక్తమవుతోంది…..

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు హోంగార్డులు కూడా ఎంతో ఆశతో శ్రమించారని, తమ సమస్యలు తీరుతాయని నమ్మిన ప్రభుత్వమే ఇప్పుడు తమను పట్టించుకోకపోగా, రోడ్డున పడేసేలా వ్యవహరిస్తోందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ బతుకులు మారుతాయనుకుంటే, ఉన్న ఊరిని వదిలి వందల కిలోమీటర్ల దూరం పోవాల్సిన దుస్థితి కల్పించారని వాపోతున్నారు….

టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి కనీస ఆర్థిక ప్రయోజనాలు లేకపోయినా.. హోంగార్డులు కచ్చితంగా బదిలీ కావాల్సిందేనని పోలీసుశాఖ కఠినమైన ఉత్తర్వులు జారీ చేస్తోంది. తాజాగా ‘ఆర్డర్‌ టు సర్వ్‌’ కింద జనరల్‌ (పోలీసుశాఖ), జనరల్‌ క్యాటగిరీలో పనిచేస్తున్న అదర్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓడీ) హోంగార్డులు ఏయే జిల్లాలకు వెళ్తారో చెప్పే విల్లింగ్‌ లెటర్‌ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. ఒకవేళ స్వచ్ఛందంగా విల్లింగ్ లెటర్ ఇవ్వకపోతే, జిల్లా సీపీ ఆఫీస్ నుండి ఎవరెవరిని ఏ జిల్లాకు పంపుతారో కూడా తెలియకుండా ఇష్టారాజ్యంగా బదిలీలు చేస్తామని అధికారులు పరోక్షంగా బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ నిబంధనల ప్రకారం.. ఖమ్మంలో రెండేండ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్నవారు తప్పకుండా ‘భద్రాద్రి కొత్తగూడెం’ జిల్లాకు ఫస్ట్‌ ఆప్షన్‌ ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండటంతో జనరల్‌ డ్యూటీల హోంగార్డుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి….

ప్రతియేటా ఇలా దూర ప్రాంతాలకు బదిలీలు చేస్తుండటంతో హోంగార్డుల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి,ఇల్లు, పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల ఆరోగ్యం దృష్ట్యా వీరంతా జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోనే స్థిరపడ్డారు. ఇప్పుడు హఠాత్తుగా బదిలీలు చేయడంతో కుటుంబాలను ఇక్కడ వదిలి వెళ్లలేక, అక్కడ ఉండలేక నలిగిపోతున్నారు.వచ్చే అరకొర జీతంలో సగానికి పైగా సొంత ఖర్చులతో చేసే ప్రయాణాలకే హారతవుతోందని హోంగార్డులు ఆవేదన చెందుతున్నారు.సరైన నిద్ర లేకపోవడం, నిరంతర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరిగి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తీవ్ర మనోవేదనతో విధులను కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి దాపురించిందని చెప్తున్నారు…..

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన తొలినాళ్లలో సిబ్బంది కొరత నెపంతో ‘ఆర్డర్‌ టు సర్వ్‌’ విధానాన్ని తీసుకొచ్చి హోంగార్డులను ఇతర జిల్లాలకు పంపారు. అయితే, ప్రస్తుతం అన్ని పోలీస్ స్టేషన్లలోనూ కొత్తగా కానిస్టేబుళ్ల నియామకాలు జరిగి సిబ్బంది కొరత తీరినప్పటికీ, పాత పద్ధతిలోనే హోంగార్డులను వేధించడం వెనుక అంతరార్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని దాదాపు 65 మంది హోంగార్డులు నిత్యం 100 నుండి 130 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు….

ఈ బదిలీల పోటుపై హోంగార్డులు ఎన్నిసార్లు ఉన్నతాధికారులను కలిసి, తమ ఇబ్బందులను మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. కనీసం మానవీయ కోణంలో కూడా ఆలోచించకుండా, శాశ్వత పరిష్కారం చూపకుండా బదిలీల ఉత్తర్వులు అమలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో హోంగార్డుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ ‘ఆర్డర్ టు సర్వ్’ బదిలీలను తక్షణమే నిలిపివేసి, హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా హోంగార్డుల సంఘం డిమాండ్ చేస్తోంది…..