బాలికపై అత్యాచారం అమానుషం,నిందితున్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలి…బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్!!

Pathi Sreenivas Rao

ఖమ్మం సిటీ : ఖమ్మం నగరంలో 12 ఏళ్ల అమాయక బాలికపై జరిగిన అత్యాచార ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణమైన అమానుష ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో చిన్నారులపై వరుసగా జరుగుతున్న దాడులు శాంతిభద్రతల వైఫల్యానికి అద్దం పడుతున్నాయని, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆయన విమర్శించారు…..

మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని మధుసూదన్ మండిపడ్డారు. పసిపిల్లల జీవితాలను చిదిమేస్తున్న మానవ మృగాలకు ఈ సమాజంలో బతికే అర్హత లేదన్నారు. ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడం ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపుతోందని ఆయన ధ్వజమెత్తారు.ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై ఎటువంటి కనికరం చూపకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసు విచారణ కోసం తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, నిందితులకు అత్యంత కఠినమైన శిక్షలు పడేలా చూడాలన్నారు. రాజకీయ, సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు స్పష్టం చేశారు….

అమానుషానికి గురైన బాధిత బాలికకు అత్యుత్తమ వైద్య చికిత్సను ఉచితంగా అందించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, పసిపిల్లల భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని, పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.బాధిత చిన్నారి త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి అడుగుపెట్టాలని మధుసూదన్ఆకాంక్షించించారు .. బాలిక కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు
బి.ఆర్.యస్ పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు….