ఉపాధి ‘హామీ’లో అక్రమాల జాతర: విప్పలమడకలో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్ల చేతివాటం!!

Pathi Sreenivas Rao

వైరా, జూన్ 05: పేద ప్రజల పొట్ట నింపాల్సిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కొందరు అధికారుల కాసుల కక్కుర్తికి బలవుతోంది. వైరా మండలం విప్పలమడక గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్ (FA), టెక్నికల్ అసిస్టెంట్ (TA) ఇద్దరూ చేతులు కలిపి ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన సొమ్మును పక్కదారి పట్టించారని, పనుల్లో తీవ్ర అవినీతికి పాల్పడ్డారని గ్రామ కూలీలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు…..

నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పనుల్లో కూలీలు చేసిన పనిని టేపుతో కొలిచి, దాని ఆధారంగా వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ విప్పలమడకలో టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు అసలు కొలతలే తీసుకోకుండా, తమకు ఇష్టమొచ్చినట్లుగా మస్టర్లు నమోదు చేస్తున్నారని కూలీలు మండిపడుతున్నారు.అంతే కాకుండా ఒకే ముఠాలో దాదాపు 40 మంది కూలీలు కలిసి సమానంగా పని చేసినప్పటికీ, వారికి ఇచ్చే వేతనాల్లో భారీగా వ్యత్యాసాలు చూపిస్తున్నారు. కొంతమందికి రూ. 200, మరికొంతమందికి రూ. 300 ఇస్తుండగా.. ఇంకొందరికి కేవలం రూ. 100 మాత్రమే చెల్లిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన సొమ్మును సదరు అధికారులు కాజేస్తున్నారని వారు ధ్వజమెత్తారు….

తాజాగా గ్రామంలో నిర్వహించిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) గ్రామసభలో కూలీల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గత సంవత్సర కాలంగా తాము ఎండనక, వాననక కష్టపడి పనిచేసినా.. ఇప్పటివరకు తమ ఖాతాల్లో పైసా జమ కాలేదని అధికారుల ముందు కూలీలు కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని, అడిగితే సాకులు చెబుతున్నారని అధికారులను నిలదీశారు. పని చేసిన వారికి డబ్బులు రాకపోవడం వెనుక ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం, అవినీతి స్పష్టంగా కనిపిస్తోందని గ్రామసభ సాక్షిగా నినదించారు.కూలీల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో గ్రామసభకు హాజరైన ఉన్నతాధికారులు స్పందించారు. విప్పలమడక గ్రామంలో ఉపాధి హామీ పనుల నిర్వహణలో, నిధుల చెల్లింపుల్లో తప్పు జరిగిందని ప్రాథమికంగా అంగీకరించారు,తప్పంతా స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లదేనని అధికారులు స్పష్టం చేశారు.బాధ్యులైన వారిద్దరిపై తక్షణమే విచారణ జరిపి, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కూలీలకు హామీ ఇచ్చారు.అదే విధంగా అర్హులైన కూలీలందరికీ రావాల్సిన బకాయిలను త్వరలోనే ఇప్పించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కూలీలు శాంతించారు….ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కొందరు అధికారులు తమ సొంత లాభాల కోసం వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, కూలీలకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు…