తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు తెలంగాణ అమరవీరుల స్థూపానికి లైటింగ్ కరువు !!

Pathi Sreenivas Rao

ఖమ్మం సిటీ – జనం ముచ్చట ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఖమ్మం నగర నడిబొడ్డున తీవ్ర అవమానం జరిగింది. ఏ అమరుల త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో.. అదే అమరులను, రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కనీసం స్మరించుకునే నాథుడే కరువయ్యాడు. ఖమ్మం ప్రధాన కూడలిలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కనీస లైటింగ్ ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి, పాలకుల ఉదాసీనతకు అద్దం పడుతోంది….

జూన్ 2వ తేదీ.. యావత్ తెలంగాణ సమాజం పండుగ చేసుకునే రోజు. అధికారికంగా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న అమరవీరుల స్థూపాన్ని అధికారులు పూర్తిగా గాలికి వదిలేశారు. కనీసం విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అమరుల స్మారకం రాత్రి వేళ చీకట్లో మగ్గిపోయింది. ఈ దృశ్యం స్థానికులను, తెలంగాణ సానుభూతిపరులను తీవ్రంగా కలచివేసింది.అమరవీరుల స్తూపం పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మలిదశ తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “అమరుల ప్రాణత్యాగాల వల్లే నేడు అధికారులు, పాలకులు తమ కుర్చీల్లో కూర్చోగలిగారు. అలాంటిది వారిని స్మరించుకోవాల్సిన పవిత్రమైన రోజున, స్థూపం వద్ద కనీసం ఒక దీపం వెలిగించలేని దుస్థితిలో యంత్రాంగం ఉండటం సిగ్గుచేటు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, తెలంగాణ చరిత్రను, అమరుల త్యాగాలను అవమానించడమేనని వారు ఆరోపించారు….

గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జిల్లాలో ఎంత ఘనంగా జరిగాయో స్థానికులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. గత పదేళ్లుగా ప్రతి జూన్ 2న అమరవీరుల స్థూపాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి, భారీ ఎత్తున పూలమాలలు వేసి నివాళులు అర్పించేవారు. పండుగ వాతావరణం కనిపించేది. కానీ ప్రస్తుత పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా తయారైందని, అధికారుల తీరులో వచ్చిన ఈ మార్పు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అమరవీరుల పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలిచ్చిన వీరులకు ఇలాంటి అవమానం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు హెచ్చరిస్తున్నారు….