ఖమ్మంలో ఎన్ఎస్పీ (NSP) భూముల మహా లూటీ…కబ్జాదారుల చెరలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులు!!

Pathi Sreenivas Rao

ఖమ్మం సిటీ: ఖమ్మం నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. నగర నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (NSP) భూములు, కాలువ కట్టలు కబ్జాదారుల పాలవుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కళ్లెదుటే భారీ నిర్మాణాలు జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కబ్జాల వెనుక అధికార పార్టీకి చెందిన బడా నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయా? లేక అధికారుల అవినీతి బాగోతం ఉందా? అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మధురానగర్ రోడ్డు నెంబర్ 3లో జరిగిన భూ ఆక్రమణ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. కేవలం 150 గజాల స్థలాన్ని జీవో 59 ద్వారా క్రమబద్ధీకరించుకున్న ఓ వ్యక్తి, అదే జీవోను అడ్డం పెట్టుకుని ఏకంగా కోట్ల రూపాయల విలువైన పదిహేను వందల (1500) గజాల కాలువ భూమిని ఆక్రమించేశాడు. ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకుండానే తన కుటుంబ సభ్యులు, ఇతరుల పేర్ల మీద తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి, మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండానే ఇళ్లు నిర్మించి విక్రయిస్తున్నాడు. ఇంత జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే ప్రాంతంలోని రోడ్డు నెంబర్ 1లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని సైతం వదలలేదు. పార్కు అభివృద్ధికి టెండర్లు ఖరారై, వర్క్ ఆర్డర్ తీసుకుని కాంట్రాక్టర్ పనులు ప్రారంభించే సమయానికి అధికార పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక నేతలు రంగంలోకి దిగారు. ఖమ్మం నియోజకవర్గంలో అన్నీ తానై నడిపించే ఓ కీలక నేతను కలిసి ఏకంగా టెండర్లను రద్దు చేయించారు. ఆ తర్వాత ఆ పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని డివిజన్ ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

గొల్లగూడెం రోడ్డులో ఏకంగా 66 అడుగులు ఉండాల్సిన సాగర్ కాలువను 44 అడుగులుగా కాగితాల్లో కుదించేశారు. అధికార పార్టీ బడా నాయకులతో సహా ఇద్దరు రిటైర్డ్ అధికారులు వందల గజాల కాలువ భూమిని అక్రమంగా ఆక్రమించి భారీ షెడ్లు, భవనాలు నిర్మిస్తున్నారు. ఈ తతంగానికి కార్పొరేషన్ కు చెందిన ఓ టౌన్ ప్లానింగ్ అధికారిణితో పాటు, గత ఎన్నో ఏళ్లుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ రెవిన్యూ ఇన్స్పెక్టర్ (RI) తెరవెనుక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నగర నడిబొడ్డున ఉన్న గట్టయ్య సెంటర్లో ఏకంగా ఎన్ఎస్పీ మోరీలను, రోడ్లను ఆక్రమించి ఓ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. దీనిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సర్వే చేపట్టకపోవడం వెనుక ఉన్న అధికార పార్టీ నాయకుడు ఎవరున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు ఖమ్మం బైపాస్ రోడ్డులో ఓ ప్రముఖ డాక్టర్ బరితెగించి ఏకంగా నాగార్జున సాగర్ మెయిన్ కాలువ కట్టనే ఆక్రమించారు.సదరు డాక్టర్ దానికి గతంలోనే ఇరిగేషన్ అధికారులను మేనేజ్ చేసి NOC తెచ్చుకున్నట్లు తెలుస్తోంది,ప్రస్తుతం దాన్ని అడ్డంపెట్టుకుని అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం మున్సిపల్ కార్పొరేషన్లో దరఖాస్తు చేసినట్లు,ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేషన్లో కీలకంగా వ్యవహరించే ముగ్గురు అధికారులు బాధ్యత తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి,ఈ వ్యవహారం వెనుక కోట్ల రూపాయల చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి…..

అక్రమాలపై పత్రికలు, మీడియా ఛానెళ్లు కోడై కూస్తున్నా అధికారుల్లో చలనం లేదు. తూతూ మంత్రంగా ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు.. రెవెన్యూ అధికారులకు ‘జాయింట్ సర్వే’ చేద్దామంటూ లేఖలు రాస్తున్నారు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం సర్వేకు ముందుకు రావడం లేదు.ఈ శాఖల మధ్య సమన్వయం లేకుండా చేసి, సర్వే జరగకుండా అడ్డుకుంటున్న ఆ ‘అదృశ్య శక్తులు’ ఎవరన్నది నగరంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థలాలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేపడితే అసలు బండారం, బడాబాబుల జాతకాలు బయటకు రాక తప్పదనీ స్థానికులు భావిస్తున్నారు….

కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులు కొల్లగొడుతున్నా చోద్యం చూస్తున్న అధికారుల తీరుపై నగర ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. తక్షణమే ఎన్ఎస్పీ కాలువ భూములపై సమగ్ర జాయింట్ సర్వే చేయించి, ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ భూముల దురాక్రమణకు తెరవెనుక సహకరించిన ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారుల అక్రమాలను వెలికితీసి కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు…..