తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం: నగరంలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. కోట్లాది రూపాయల విలువైన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (NSP) కాలువ భూములు గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. గట్టయ్య సెంటర్ నుండి మొదలుకొని గొల్లగూడెం రోడ్డు దాకా, ముఖ్యంగా మమత రోడ్డు – గొల్లగూడెం రోడ్డు పరిధిలో ఎన్‌ఎస్‌పీ కాలువ స్థలాల ఆక్రమణలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. పేదవాడు తలదాచుకోవడానికి గుడిసె వేసుకుంటే కోర్టుల చుట్టూ తిరిగి మరీ తొలగించిన అధికారులు.. బడా బాబులు, అధికార పార్టీ నేతలు కోట్ల విలువైన స్థలాలను మింగేస్తుంటే కళ్ళున్నా గ్రుడ్డివారిలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…..
రికార్డుల్లో 66 అడుగులు.. కబ్జాదారుల లెక్కల్లో 44 అడుగులు….
ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. మమత రోడ్ సబ్ స్టేషన్ నుండి గొల్లగూడెం వయా వెలుగుమట్ల వరకు ఎన్‌ఎస్‌పీ కాలువ వెడల్పు స్పష్టంగా 66 అడుగులు ఉంది. గతంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం మమతా హాస్పిటల్ భూమి క్రమబద్ధీకరణ (Regularization) సమయంలో దీనిని 66 అడుగుల కాలువగానే పేర్కొన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అలాగే మధురానగర్ సాయిబాబా గుడి కూడా ఈ 66 అడుగుల కాలువ మీదే నిర్మితమైందని స్థానికులు చెబుతున్నారు.అయితే, ఈ కాలువ స్థలంపై కన్నేసిన కబ్జాదారులు సరికొత్త దారి వెతికారు. మమత కాలేజీ ఆర్చి నుండి సుమారు 500 మీటర్ల దూరం వరకు కాలువ కేవలం 44 అడుగులే ఉందంటూ తప్పుడు పత్రాలు, నకిలీ రికార్డులు సృష్టించారు. కాలువ అంతా ఒకేలా ఉన్నప్పుడు, కేవలం అధికార పార్టీ నాయకులు ఆక్రమించిన చోట మాత్రమే 44 అడుగులకు ఎలా కుంచించుకుపోతుందని స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు…..
పేదలను గెంటేసి.. షెడ్లు వేసి అద్దెలకా ?….
గతంలో ఇదే గొల్లగూడెం రోడ్డు పరిధిలోని ఎన్‌ఎస్‌పీ కాలువ స్థలంలో నిలువ నీడ లేక పేదలు సుమారు 3,000 గుడిసెలు వేసుకున్నారు. అప్పట్లో రాజకీయ నాయకులు కోర్టుల చుట్టూ తిరిగి, ఒత్తిడి తెచ్చి అధికారుల చేత ఆ గుడిసెలను బలవంతంగా తొలగింపజేశారు. తీరా పేదలను ఖాళీ చేయించిన ఆ స్థలాల్లో ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు తప్పుడు పత్రాలతో అక్రమంగా పెద్ద పెద్ద షెడ్లను నిర్మించి, వాటిని ఇతరులకు అద్దెలకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు…..
తెర వెనుక రిటైర్డ్ అధికారులు.. టౌన్ ప్లానింగ్ లీలలు….
ఈ భారీ భూదందా వెనుక ఒక రిటైర్డ్ ఎమ్మార్వో (MRO), మున్సిపల్ శాఖకు చెందిన ఒక రిటైర్డ్ డిపార్ట్‌మెంట్ డీఈ (DE) తో పాటు అధికార పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమిత భూమిలో షెడ్డు వేసిన సదరు రిటైర్డ్ డీఈ స్థాయి మహిళా అధికారిణికి మున్సిపల్ అధికారులు అక్రమంగా ఇంటి నెంబర్ కూడా కేటాయించడం గమనార్హం.
రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులు
ఈ వ్యవహారంలో పూర్తిగా కబ్జాదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఒక మహిళా ఉన్నతాధికారితో పాటు, కొందరు మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (RI) ముడుపుల నత్తులో మునిగిపోయి ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు…..
మంత్రి ఆదేశాలకు విలువ లేదా ?….
ఖమ్మం నగరంలో ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములను గుర్తించి, వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి కాపాడాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలోనే అధికారులను కఠినంగా ఆదేశించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు మంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తూ బుట్టదాఖలు చేశారు. ఫెన్సింగ్ వేయకపోగా, కబ్జాదారులకు తివాచీలు పరుస్తున్నారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతే కాకుండా పేదవాడు చిన్న గుడిసె వేసుకుంటే తెల్లవారేసరికి జేసీబీలతో కూల్చేసే అధికారులు.. కోట్ల రూపాయల విలువైన ఎన్‌ఎస్‌పీ కాలువ భూములను అధికార పార్టీ నేతలు, రిటైర్డ్ అధికారులు మింగేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలి. తప్పుడు రికార్డులను రద్దు చేసి, కాలువ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ అక్రమ ఆక్రమణలపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి…..
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, ఖమ్మం:9703973456