తెలంగాణ /ఖమ్మం జిల్లా:
ఏదులాపురం, మే 14: మండల పరిధిలోని పెద్దతండా వద్ద గల స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ల వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొక్కజొన్న రైతుల నుండి గోడౌన్ ఉద్యోగులు,హమాలీలు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో పరిస్థితి ఘర్షణకు దారితీసింది. తమను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది…..

ట్రక్కుకు రూ. 500 అదనపు వసూళ్లు?….
కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వచ్చిన రైతులకు అడుగడుగునా దోపిడీ ఎదురవుతోంది. గోడౌన్ ఉద్యోగులు,హమాలీలు కుమ్మక్కై ప్రతి ట్రాక్టర్ ట్రక్కుకు రూ. 500 అదనంగా ఇస్తేనే లోడింగ్, అన్ లోడింగ్ చేస్తామంటూ వేధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లకు అంగీకరించని రైతుల ట్రాక్టర్లను గోడౌన్ లోనికి అనుమతించకుండా గంటల తరబడి నిలిపివేస్తున్నారు…..
పెద్దతండా వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో రైతుల ఆందోళన వీడియో….
కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాక్టర్లు….
అధికారుల మొండి వైఖరి కారణంగా పెద్దతండా ప్రధాన రహదారిపై మొక్కజొన్న లోడుతో ఉన్న ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఎండ తీవ్రతకు తోడు, అక్రమ వసూళ్ల ఒత్తిడితో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మొత్తం వ్యవహారంలో జీవన్, నరసింహారావు అనే ఇద్దరు ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.వే బ్రిడ్జి వద్ద కాటా వేసిన తర్వాత ఇచ్చే కాటా స్లిప్పులు, ఖాళీ ట్రాక్టర్ల కాటా స్లిప్పులను ఇవ్వకుండా సదరు అధికారులు రైతులను తిప్పలు పెడుతున్నారు.అంతే కాకుండా ఇక్కడి మేనేజర్ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని, సదరు ఉద్యోగులు ఆయననే బెదిరిస్తూ తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం…..
మంత్రి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం….
మేము కష్టపడి పంట తెస్తే, ఇక్కడ ఒక్కో ట్రాక్టర్‌కు ఐదు వందలు అడుగుతున్నారు. స్లిప్పులు అడిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోతే మా పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…ఇంత జరుగుతున్న స్థానిక అధికారులు ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మరియు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని రైతులు హెచ్చరించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సదరు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ వసూళ్లను అరికట్టాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది……
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456