తెలంగాణ/ఖమ్మం సిటీ:
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నగర అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వం వందల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు,రోడ్లు, డ్రైనేజ్, స్ట్రీట్ లైటింగ్ వంటి ప్రాజెక్టులలో నాణ్యత లేకుండా పనులు పూర్తి చేస్తున్నారని, కాంట్రాక్టర్లు,అధికారుల మరియు కొంతమంది కార్పొరేటర్ల మధ్య అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని సమాచారం. టెండర్ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం,అర్హతలేని కాంట్రాక్టర్లకు పనులు కేటాయించడం వంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి…..

46 వ డివిజన్లో కోటి ఇరువై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న కాలువ….
తాజాగా స్థానిక నలబై ఆరవ డివిజన్లో కోటి ఇరువై లక్షల రూపాయల నిధులతో చేపట్టిన గోళ్ళపాడు ఛానెల్ ఆధునికీకరణ పనులు లోపభూయిష్టంగా తయారయ్యాయి,కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాలువను ఆధునీకరణ నెపంతో అవసరం లేని పనులకు అడ్డగోలుగా ఎస్టిమేషన్లు వేయడంతో పాటుగా టెండర్లు ఖరారు చేసి దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తి చేశారు కానీ అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది దాదాపు పనులు పూర్తీ కావొస్తున్న తరుణంలో అకస్మాత్తుగా కాంట్రాక్టరును తొలగించి ఎనబై లక్షల రూపాయలు బిల్ సెటిల్ చేసి పంపించారు,కాంట్రాక్టరు తొలగింపు వెనుక స్థానిక అధికార పార్టీ నాయకులకు సదరు కాంట్రాక్టరుకు మధ్య లెక్కలు తేడా వచ్చినట్లు స్థానిక ప్రజలు భావిస్తున్నారు,ఈ మొత్తం వ్యవహారంలో అసలు తతంగం ఇపుడే మొదలైంది డెబ్బై శాతం పనులు పూర్తి అయ్యక మిగిలిన ముప్పై శాతం పనుల కోసం కోటి రూపాయల ఎస్టిమేషన్లు తయారు చేసి రేపో మాపో టెండర్లు పిలవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది, చారానా గుడ్డుకు బారానా మసాలా అన్నట్లు కోటి ఇరువై లక్షల రూపాయలతో
పూర్తయ్యే పనిని రెండు కోట్ల ఇరువై లక్షల రూపాయలు
ఖర్చు పెట్టడం ఏమిటని,ఇది కేవలం ఇంజనీర్లు,కాంట్రాక్టరు,అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకోవడానికేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….

మామిళ్లగూడెం డ్రైనేజీ కాలువకు సమాంతరంగా నిర్మిస్తున్న మరో కాలువ ….
నిజానికి మామిళ్లగూడెం నుండి పెద్ద డ్రైనేజీ కాలువ వయా సారధినగర్ మీదుగా మున్నేరులో కలుస్తుంది కానీ నిబంధనలకు విరుద్ధంగా దానికి సమాంతరంగా మరో కాలువను ప్రతిపాదించి కోటి ఇరువై లక్షల రూపాయలు కేటాయించి డెబ్బై శాతం పనులు పూర్తి చేశారు,రెండు మూడు లక్షలు ఖర్చు పెడితే ప్రస్తుతం నిర్మిస్తున్న కాలువను రైల్వే ట్రాక్ పక్కనే డ్రైనేజీ కాలువలో కలపవచ్చు కానీ కాసులకు కక్కుర్తితో ప్రకృతి విరుద్ధంగా పల్లపు ప్రాంతం నుండి ఎత్తైన ప్రాంతానికి మళ్ళించే ప్రయత్నం జరుగుతుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో కొంతమంది ఇంజినీర్లు,అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ప్రజలకు నష్టమే తప్ప ఏటువంటి ఉపయోగం లేని కాలువకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి…..

ప్రస్తుతం కాలువ నిర్మాణ పనులు నిలిచిపోయిన ప్రాంతం….
ఇంత పని జరిగాక ఆ కాలువ ఫలితాన్ని ఇస్తుందా అంటే ఆది జరగని పని ఎందుకంటే పక్కనే ఉన్న 48 వ డివిజన్ ప్రజలు ఈ కాలువ నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకించడంతో పాటు పలుమార్లు ధర్నాలు కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది,అంతే కాకుండా డివిజన్లో ఇటీవల నిర్మించిన రోడ్లు కొద్ది రోజుల్లోనే దెబ్బతినడం, డ్రైనేజీ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంలో మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంపై విజిలెన్స్ దర్యాప్తు జరిపిస్తే మొత్తం అక్రమ వ్యవహారాలు బయటకు వస్తాయని,కాలువ నిర్మాణంలో అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు…..

నిర్మించిన కొద్ది రోజులకే దెబ్బతిన్న కాలువపై వేసిన స్లాబ్….
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456