ఖమ్మం జిల్లా కార్మిక శాఖలో భారీ అవినీతి :నకిలీ లేబర్ సర్టిఫికెట్లతో  కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మోసం!!

Pathi Sreenivas Rao

ఖమ్మం జిల్లా కార్మిక శాఖలో భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వస్తోంది. కొంతమంది దళారులు (ఏజెంట్లు) మరియు ఉన్నతాధికారుల మద్దతుతో నకిలీ లేబర్ సర్టిఫికెట్లు జారీ చేసి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసలు కార్మికులుగా పనిచేయని వ్యక్తులకు నకిలీ లేబర్ కార్డులు జారీ చేయడమే కాకుండా ప్రమాదాలు, మరణాలు జరిగినట్టు తప్పుడు పత్రాలు తయారు చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేస్తున్నారు,ప్రతి క్లెయిమ్ వెనుక లక్షల రూపాయలు, కొన్ని సందర్భాల్లో కోట్ల రూపాయలు మాయమవుతున్నాయి,ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది కార్మిక శాఖ అధికారులు, ముఖ్యంగా లేబర్ కమిషనర్ కార్యాలయానికి చెందిన సిబ్బందితో పాటు ఒక ప్రముఖ బ్యాంకు అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి…..

అంతే కాకుండా ఒక్కో కేసులో లక్ష రూపాల నుంచి కోట్ల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సొమ్ము క్లెయిమ్ చేసి, వాటిని ఏజెంట్లు మరియు అధికారులు పంచుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాల్లో ఈ అక్రమాలు వ్యవస్థపరంగా జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి,ఒక్క కామేపల్లి మండలంలోని రెండు గ్రామాల్లోనే దాదాపు పది కోట్ల రూపాయలకు పైగా ఇన్సూరెన్స్ క్లైములు జరిగినట్లు స్థానికులు చెప్పడం విశేషం,రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగనన్ని ఇన్సూరెన్స్ క్లైములు ఈ రెండు గ్రామాల్లోనే జరిగినట్లు తెలుస్తుంది,నిజంగా ఆ రెండు గ్రామాల్లో అంతమంది కార్మికులకు లేబర్ కార్డులు ఉన్నాయా ? కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసింది నిజమైన కార్మికులకేనా ? ఆ ఇన్సూరెన్స్ క్లైములు నిజంగా పారదర్శకంగా జరిగాయా అనే అంశం మీద ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఇది సాధారణ అవినీతి కాదు సంస్థాగతంగా నడుస్తున్న పెద్ద మాఫియా వ్యవస్థగా మారిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి…..

తాజాగా కామేపల్లి మండలంలో జరిగిన ఒక సంఘటన
ప్రజల్లో అనేక సందేహాలకు తావిస్తుంది,మండలంలోని
ఓ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి భార్య కాలేయ సంబంధిత వ్యాధితో మరణించింది.బ్రోకర్ల ద్వారా విషయం తెలుసుకున్న
ఏజెంట్లు అక్కడ గద్దల్లా వాలిపోయారు.మృతురాలి భర్తకు మేము చెప్పినట్లు వింటే లక్ష రూపాయలు లేబర్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి ఒప్పందం చేసుకున్నారు,మేము చెప్పిన బ్యాంకులోనే ఖాతా తెరవాలి అని నిబంధన పెట్టి,ఆ బ్యాంకులోనే ఖాతా ఓపెన్ చేపించి ఏటిఎం కార్డు,చెక్ బుక్ దగ్గర పెట్టుకుని,ఒక ఖాళీ చెక్కు మీద సదరు బ్రోకర్లు సంతకం చేయించుకున్నారు,ఆ తరువాత జిల్లా కార్యాలయంలో మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి దాదాపు పదకొండు లక్షల రూపాయలు ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేశారు.ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బులు మొత్తం లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతాయి,ఈ మొత్తం వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది,మొదట లబ్ధిదారుని సెల్ పోన్ కు తన ఏకౌంట్లో పదకొండు లక్షలు జమ అయినట్లు మెసేజ్ వస్తుంది,మరో పది నిమిషాల్లో
పది లక్షల రూపాయలు డెబిట్ అయినట్లు తిరిగి మెసేజ్ వస్తుంది.దీంతో అనుమానం వచ్చిన సదరు లబ్ధిదారుడు బ్యాంకు అధికారులను కలవడంతో బ్యాంకు అధికారులు కాసేపు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పినప్పటికీ బాధితుడు గట్టిగా నిలయదీయడంతో బ్రోకర్ల చేసిన మాయాజాలాన్ని బయటపెట్టక తప్పలేదు…..

విషయం తెలుసుకున్న బాధితుడు బ్రోకర్లను నిలదీయగా
నీకు లక్షరూపాయలు మాత్రమే ఇస్తామని ఒప్పందం చేసుకున్న రోజు చెప్పాము అంతకన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వం నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ, ఇష్టారీతిన తిడుతూ బాధితునిపై భౌతిక దాడి చేసే ప్రయత్నం చేయడంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులను స్టేషనుకు పిలిపించి విచారణ చేపట్టే లోగానే ఓ అధికార పార్టీ నాయకుడు లక్షల రూపాయలు మోసం చేసిన కేసులో తన అనుచరున్ని కాపాడుకోవడం కోసం పోలీసులకు పోన్ చేసి మా వాళ్లు ఐదు లక్షలు బాధితునికి ఇస్తారు కేసు క్లోజ్ చేయండి అని హుకుం జారీ చేయడంతో పోలీసులు విధిలేని పరిస్థితుల్లో ఎలాంటి కేసు నమోదు చేయకుండా ఐదు లక్షల రూపాయలు బాధితునికి ఇచ్చేలాగా బయట సెటిల్ చేసుకోండి అంటూ పంపించేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి ….

నిజంగా శ్రమించి జీవనం సాగించే కార్మికులు ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ఎదురు చూస్తుంటే, మోసగాళ్లు వారి హక్కులను దోచుకుంటున్నారు.కొందరు కార్మిక శాఖ అధికారులను, బ్యాంకు మేనేజర్లను అడ్డం పెట్టుకుని నిజమైన కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలు మోసపూరితంగా ఏజెంట్లు దారి మళ్లించడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఇది కేవలం అవినీతి కాదని, నిజమైన లబ్ధిదారుల హక్కులను దోచుకోవడమేనని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు.జిల్లా కార్మిక శాఖ అధికారులపై ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోంది.కోట్ల రూపాయలు ప్రజల డబ్బు దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్,ఏజెంట్లకు సహకరిస్తున్న బ్యాంకు మేనేజర్లతో సహా నకిలీ లేబర్ కార్డులు సృష్టించి తప్పుడు ఇన్సూరెన్స్ క్లైములు చేస్తున్న ఏజెంట్లపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని, కార్మిక సంఘాలు,ప్రజలు డిమాండ్ చేస్తున్నారు,….