డిల్లీకి చేరిన కాంగ్రెస్ మంత్రుల లొల్లి!!

Pathi Sreenivas Rao

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు,మీడియాకు మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం ఇపుడు డిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ తలుపు తట్టినట్లుతెలుస్తుంది, ముఖ్యంగా మీడియా ముసుగులో కొంతమంది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీద బురద చల్లే ప్రయత్నం,మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తిత్వ హననానికి ప్రయత్నం చేయడం వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి అనే విషయం మీద హైకమాండ్ పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లు తెలియవచ్చింది,వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క,కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరిద్దరూ దివంగత వైయస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు,ఈ మాట వారే స్వయంగా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి,వీరిద్దరూ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న వారే,ఇలాంటి పరిస్థితుల్లో భట్టి విక్రమార్క పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి “లాయల్ పర్సన్” గా ప్రత్యేక అభిమానం,అలాగే నియోజకవర్గంలో ప్రజాభిమానం ఉన్న దళిత నాయకునిగా సోనియా,రాహుల్ గాంధీ దగ్గర గుర్తింపు ఉన్న నాయకుడు,ఒక దశలో భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రిగా చేస్తే ఎలా ఉంటుందని సోనియా, రాహుల్ ఆలోచించిన పరిస్థితి అయితే సమీకరణలు మారడం, కేసీఆర్ లాంటి పర్శనాలిటీనీ సమర్థవంతంగా ఎదుర్కొన గలిగిన స్థాయిని, కాంగ్రెస్ పార్టీనీ అధికారం వైపు నడిపించిన వ్యక్తిగా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం కట్టబెట్టింది,ఆ తరువాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ తో బలమైన బంధాన్ని ఏర్పరుచుకున్నారు….

నిజానికి తెలంగాణా రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటైన దగ్గర నుండి రేవంత్ రెడ్డికి,భట్టి విక్రమార్కకు మంచి సంబంధాలే ఉన్నాయి, అంతర్గతంగా ఎన్ని బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ బయటకు మాత్రం ఎలాంటి అరమరికలు లేకుండానే పాలన సాగించారు,ఒక్క మాటలో చెప్పాలంటే నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ భట్టి విక్రమార్క వివాదాస్పదమైన వ్యక్తి కాదు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ తన నియోజకవర్గం తప్ప పక్క నియోజకవర్గ వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోడు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది,అలాంటి వ్యక్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ,చిక్కటి పాలల్లో చిన్న విష బిందువు వేసినట్లు ఏబీఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ “కొత్త పలుకు”లో మల్లు భట్టి విక్రమార్క,ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరితో కలిసి బొగ్గు గనుల కాంట్రాక్టు విషయంలో తమ అనుయాయులకు ఇప్పించుకునేందుకు కుట్రలు చేస్తున్నారంటూ విషం చిమ్మాడు దీనికి భట్టి విక్రమార్క కూడా ఘాటుగానే సమాధానం చెప్పాడు,రాధాకృష్ణ లాగా దిగజారి ఏదైబడితే ఆది మాట్లాడను వ్రాయను అంటూనే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు,నేను రాజశేఖర్ రెడ్డి అనుచరుణ్ణి కాబట్టి ఆయన మీద ఉన్న కోపంతో ఏబీఎన్ రాధాకృష్ణ నన్ను టార్గెట్ గా చేసుకుని విషం చిమ్ముతున్నాడని,తెలంగాణా రాష్ట్రం మీదకు కొన్ని గద్దలు,రాబందులు,వ్యవస్తికృత నేరగాళ్ళ సమూహం తెలంగాణ మీదకు దండెత్తి వస్తుంది,నేను బాధ్యతల్లో ఉన్నంత కాలం వాళ్ళ ఆటలు సాగనివ్వను,వాళ్ళ బారినుండి తెలంగాణా రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది,తెలంగాణాకు సంబందించిన వనరులు,సంపద మీద ఆ గద్దలను వాళ్లనివ్వకుండా నేను అడ్డుకుంటానని ప్రకటించారు,ఎవరి బాగు కోసం,ఎవరి మెప్పు కోసం ఇలాంటీ వార్తలు వ్రాస్తున్నారో రాధాకృష్ణ నేను తేల్చుకుంటాం,ఈ దుర్మార్గపు వ్రాతల వెనుకు ఎవరు ఉన్నారనే విషయం త్వరలో విలేకరుల సమావేశం పెట్టీ చెబుతాననని మీడియాతో చెప్పడం,అయితే ఏబీఎన్ రాధాకృష్ణతో నేనే డైరెక్ట్ గా తేల్చుకుంటానని అనడంతో ఏవిధంగా తేల్చుకుంటాడు అనే
విషయం ఆసక్తికరంగా మారింది,దీంతో ఒక దశలో ఈ వ్యాఖ్యల మూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇబ్బందులు ఎదుర్కున్న పరిస్థితి కనిపించింది అందుకే డ్యామేజ్ కంట్రోల్ కోసం ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి ఈ విషయం మీద ఆసక్తికరంగా స్పందించారు,ఆది వార్నింగో,వేడుకలో అర్థం కాలేదు కానీ ఇటు ఏబీఎన్ రాధాకృష్ణ,అటు ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎడ్లు ఎడ్లు కొట్టుకుంటే మధ్యలో లేగ దూడలు కాళ్లు విరిగినట్లు మీరిద్దరూ ఆధిపత్యం కోసం కొట్టుకుని మధ్యలో మా మంత్రుల మధ్య విబేధాలు సృష్టించ వద్దని వ్యాఖ్యానించారు….

మీడియా పరిధి విస్తృతమైన ఈ రోజుల్లో క్షణాల్లో తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు హైకమాండ్ దృష్టికి చేరాయి,దీనిపై రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు తెలుస్తుంది,భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడిన మాటలను కూడా తర్జుమా చేయించుకుని విన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి,ముఖ్యమంత్రి వయా మీడియా మంత్రులు ఎదుర్కుంటున్న ఇబ్బందులను ఆదిలోనే కట్టడి చేయాలని భావిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో అధిష్టానం ఉందని,ఈ క్రమంలోనే త్వరలో భట్టి విక్రమార్క డిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలవనున్నట్లు డిల్లీ వర్గాలు చెబుతున్నాయి….

ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఒకటి కర్ణాటక కాగా రెండవది తెలంగాణ రాష్ట్రం,ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి,ఉప ముఖ్యమంత్రికి మధ్య వచ్చిన బేధాభిప్రాయాలు పరిష్కరించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదు,దాని ఫలితంగా కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే. శివకుమార్ పోటీపడినపుడు మధ్యే మార్గంగా చెరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా సిద్ధరామయ్య నేనే కొనసాగుతాననీ కుండబద్దలు కొట్టి చెబుతున్నప్పటికీ ఏమి చేయలేక కాంగ్రెస్ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో దిక్కులు చూస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టిసారిస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న,అలాగే ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు తన ఉనికికే సవాలుగా మారిన పరిస్థితుల్లో మల్లు భట్టి విక్రమార్క ఏమి చేస్తాడో,హైకమాండ్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి…..