ఖమ్మం జిల్లా: ది:8:1:2026
ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో పాత,కొత్త కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తల మధ్య గత కొంతకాలంగా విబేధాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి, ఎన్నో ఏండ్లుగా అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ద్వితీయ శ్రేణి నేతలకు,కార్యకర్తలకు కనీస మర్యాద లేదని,డివిజన్లలో జరిగే కార్యక్రమాలకు కూడా పిలవకుండా అవమానాలకు గురి చేస్తున్నారని వాపోతున్నారు,ఎన్నికలకు ముందు,ఎన్నికలకు తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు మా మీద పెత్తనం చెలాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు…..
అధికారం లేకపోయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీని కాపాడుకున్నాం కానీ చీమలు పెట్టిన పుట్టలో పాములు
జొరబడినట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీలోకి జొరబడి మాపై కేసులు పెత్తనం చెలాయిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త అహర్నిశలు శ్రమించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తే కులాన్ని అడ్డం పెట్టుకుని కొందరు,స్నేహాన్ని అడ్డం పెట్టుకుని కొందరు పార్టీలో చేరి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన అసలు కాంగ్రెస్ కార్యకర్తలను అవమానాలకు గురిచేస్తూ,అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….
బి.ఆర్.ఎస్ పార్టీ కార్పొరేటర్లనును ఎవరి సలహాలతో,ఎవరి ప్రయోజనాలు ఆశించి,ఏ ముహూర్తాన కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం మొదలయ్యిందో అప్పుడే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలకు ఆజ్యం పోసినట్లైంది,ముఖ్యంగా ఆయా డివిజన్ల కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ముందు, అప్పటిదాక డివిజన్లలో వ్యయప్రయాసలకోర్చి పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులను,కార్యకర్తలను కనీసం ఎవ్వరిని సంప్రదించలేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు,ఇపుడు బి.ఆర్.యస్ పార్టీ కార్పొరేటర్లు చేరిన ఎనిమిది డివిజన్లలో ఆనాటి ప్రభుత్వంలో నిర్బంధాలు ఎదుర్కొని,పోలీసు కేసులను సైతం లెక్కచేయకుండా పోరాడిన చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు,అంతే కాకుండా గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అనాటి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు ఎందరో ఉన్నారు కానీ వారి త్యాగాలను అవమాన పరిచే విధంగా,వారిని ఏ విషయంలో పరిగణనలోకి తీసుకోకుండా ఒంటెద్దు పోకడలు పోతున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,ఇన్నేళ్లపాటు వాళ్ళ మీద పోరాటం చేసాం,మా మీద అక్రమ పోలీసు కేసులు పెట్టించి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసిన మా ప్రత్యర్థులను పార్టీలో చేర్చుకునేటపుడు మాతో కనీసం సంప్రదించరా,ఇదెక్కడ న్యాయం అంటూ తమ గోడు వెల్లబుచ్చుకొంటున్నారు….
ముఖ్యంగా ఒక కార్పొరేటర్,మరో కార్పొరేటర్ భర్త,ఒక ఛానెల్ రిపోర్టర్ కలిసి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నాశనానికి కంకణం కట్టుకున్నారని,అందుకే కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి పెదధోరణులు అవలంబిస్తున్నారని ఒక జిల్లా స్థాయి సీనియర్ నాయకుడు “జనం ముచ్చట” న్యూస్ తో తన ఆవేదనను వ్యక్తం చేశారంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ ఎంత దిగజారిపోతుందో అర్ధం చేసుకోవచ్చు,ఈ సందర్భంలోనే మరో మైనారిటీ నాయకుడు మాట్లాడుతూ తనకు రావాల్సిన ఎమ్మెల్యే సీటును త్యాగం చేసినప్పటికీ,నా త్యాగాన్ని గుర్తించడం లేదని,నామినేటెడ్ పదవులకు వారి సామాజిక వర్గం పేర్లు సూచిస్తున్నారు తప్ప మా పేర్లు అంచుకు కూడా రానివ్వడం లేదని,పదవులు విషయం అటుంచితే పార్టీ కార్యక్రమాలలో స్టేజి మీదకు పిలిచి మాట్లాడించే పరిస్థితి లేదని,ప్రతి పక్షంలో ఉన్నపుడే కొంత గౌరవం దక్కేదని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని,మేము అధికార పార్టీలో ఉన్నామో ప్రతిపక్ష పార్టీలో ఉన్నామో అర్థం కావడం లేదని,కాంగ్రెస్ పార్టీ కోసం మా సర్వస్వం త్యాగం చేయడం మేము చేసిన తప్పా,మమ్మల్నేందుకు ఇలా అవమానాల పాలుచేస్తున్నారంటూ అవేదన వ్యక్తం చేయడం విశేషం…..
మరో బీసీ నేత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బిసి,ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గాలు ఎంతో దోహదం చేశాయి కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చాక ఆయా సామాజిక వర్గాలను పాతాళానికి తొక్కేసారని,డోరు దగ్గర నిలబడటమే తప్ప లోపల నాయకునితో మాట్లాడే పరిస్థితి
లేదని,అంచలు వారిగా కోటరీలు ఏర్పాటై నాయకునికి సమస్యలు చెప్పుకునే సమయం కూడా ఇవ్వకుండా అడ్డు పడుతున్నారని,కొందరు మా త్యాగాల పునాదుల మీద అక్రమ ఆస్తులు కూడబెట్టుంటున్నారని,అన్ని సామాజిక వర్గాల వారు సమిష్టిగా ఓట్లు వేసి గెలిపించారని,ఏ ఒక్క సామాజిక వర్గం ఓట్లతోనో విజయం సాధ్యం కాదని,ఈ విషయాన్ని నాయకులు తెలుసుకుంటే మంచిదని తన ఆవేదన వెలిబుచ్చారు….
పాత కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహావేశాలకు ఇంకో ప్రధాన కారణం ఏమిటంటే ఇప్పటికిప్పుడు బహిరంగంగా ప్రకటించక పోయినప్పటికీ రాబోయే ఎన్నికల్లో
తెలుగుదేశం,సిపిఎం,సీపీఐలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉండడం,ఇపుడు చేరిన ఎనిమిది కార్పొరేటర్లతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్న తరుణంలో ఇపుడు పార్టీలో చేరిన కార్పొరేటర్లందరికీ టికెట్లు కేటాయించి,పొత్తులో ఉన్న పార్టీలకు మరికొన్ని సీట్లు కేటాయిస్తే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల పరిస్థితి ఏమిటనే బాధ కాంగ్రెస్ పార్టీ నాయకులను,కార్యకర్తలను మనసులో వెంటాడుతుందనేది నిర్వివాదాంశం…..
కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోసిన కార్యకర్తలకు జరుగుతున్న అవమానాలపై త్వరలో పాత కాంగ్రెస్ నాయకులను,కార్యకర్తలను కలుసుకుని ఓ సమావేశం ఏర్పాటు చేస్తామని,అందరినీ ఒకే తాటి మీదకు తీసుకు వచ్చి అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి పరిస్థితిని వివరిస్తామని,అక్కడ కూడా న్యాయం జరగకపోతే చందాలు వేసుకునైనా సరే చలో డిల్లీ కార్యక్రమం పెట్టుకుని రాహుల్ గాంధీ,సోనియా గాంధీని కలిసే ప్రయత్నం చేస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ నాయకుడు జనం ముచ్చట న్యూస్ తో అన్నారు…..
ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అన్యాదోరణులు మంచిది కాదని,పాత,కొత్త కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఎటువైపు దారి తెస్తున్నదోననీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రెండు వర్గాల మధ్య నలుగుతున్న సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కార మార్గం చూపించకపోతే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, ఖమ్మం:9703973456