Janam Muchata – Voice of the People | Telugu News Platformఖమ్మం కాంగ్రెస్‌లో ‘పదవుల’ మంట: రేణుకా చౌదరితో రాధా కిషోర్… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 2:48 am
Date of Publish : 15 Jun 2026, 9:05 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 236 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం కాంగ్రెస్‌లో ‘పదవుల’ మంట: రేణుకా చౌదరితో రాధా కిషోర్ భేటీ.. జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం!!

ఖమ్మం కాంగ్రెస్‌లో ‘పదవుల’ మంట: రేణుకా చౌదరితో రాధా కిషోర్ భేటీ.. జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం!!

హైదరాబాద్: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నిఖార్సైన కార్యకర్తలకు, నాయకులకు పదవుల పంపకంలో తీవ్ర అన్యాయం జరిగిందనే అసంతృప్తి ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రఘునాథపాలెం మండల బలమైన నేత మానుకొండ రాధా కిషోర్ నేడు హైదరాబాద్‌లో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలవడం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ సుదీర్ఘ భేటీ కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది….

గతంలో దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడిగా జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక పట్టు సాధించారు రాధా కిషోర్. రాంరెడ్డి మరణానంతరం ఆయన రేణుకా చౌదరి వర్గంలో కీలక నేతగా ఎదిగారు. ముఖ్యంగా రఘునాథపాలెం మండలంలో తిరుగులేని ప్రజాబలం కలిగిన రాధా కిషోర్, గత సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గెలుపు కోసం రాత్రింబగళ్లు శ్రమించి కీలక పాత్ర పోషించారు.మొదటి నుండి కాంగ్రెస్ జెండా మోస్తూ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన రాధా కిషోర్‌కు.. ఇటీవల జరిగిన పదవుల పందేరంలో కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపించడంపై ఆయన వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది….

పార్టీ కోసం రక్తం ధారపోసిన నిజమైన కార్యకర్తలను పక్కనపెట్టి, కేవలం పైరవీలు చేసుకునే వారికే పదవులు కట్టబెట్టారనే విమర్శలు వ్యూహాత్మకంగా ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వర్గాన్ని ఉద్దేశించి రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దావాగ్నిలా రగిలాయి."పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన నాయకులను విస్మరించి.. చెప్పులు, సంచులు మోసే వాళ్లకు పదవులు ఇచ్చుకుంటున్నారు" అంటూ రేణుకా చౌదరి చేసిన తీవ్ర వ్యాఖ్యలు జిల్లా కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలను బట్టబయలు చేశాయి.

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారకులైన ఎందరో సీనియర్ కార్యకర్తలు ప్రస్తుతం తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. పదవుల పంపకాల విషయంలో జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలపట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు,పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు, లాఠీ దెబ్బలు తిన్న ఉద్యమకారులను విస్మరించి, అధికారంలోకి రాగానే చేరిన వారికి, నేతల చుట్టూ తిరిగే భజనపరులకే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.అంతే కాకుండా జిల్లాలోని అగ్రనేతల మధ్య ఉన్న వర్గపోరు కారణంగా సమర్థులైన ద్వితీయ శ్రేణి నాయకులు బలైపోతున్నారు. ఒక వర్గానికి చెందిన నాయకుడనే ముద్ర పడటంతో, మరో వర్గం కావాలనే వారిని తొక్కిపెడుతోందనే ఆవేదన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది…. రాధా కిషోర్ వంటి క్షేత్రస్థాయి పట్టున్న నాయకులకే గుర్తింపు లేనప్పుడు, ఇక తామెంత అనే భావన సాధారణ కార్యకర్తల్లో నెలకొంది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది,ఈ పరిస్థితుల నడుమ, రేణుకా చౌదరితో రాధా కిషోర్ సుదీర్ఘంగా భేటీ కావడం వెనుక భవిష్యత్తు రాజకీయ వ్యూహం దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది. అధిష్టాన వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈ ఇద్దరు నేతలు.. జిల్లాలో తమ వర్గాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.ఈ పరిణామాలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైన పెను భూకంపానికి దారితీస్తాయో, పరిస్థితులు ఎటుబోయి ఎటు వస్తాయోనని సాధారణ కాంగ్రెస్ శ్రేణులు మరియు కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. రాబోయే రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్ రాజకీయం మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది…..