తెలంగాణ /హైదరాబాద్ :
హైదరాబాద్ : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తనపై రాసిన 'వీకెండ్ కామెంట్' వ్యాసంపై తనదైన శైలిలో స్పందించారు. రాధాకృష్ణ చేసిన ప్రతి వ్యాఖ్యను విశ్లేషిస్తూ, తనపై జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియా ట్రోలింగ్, క్రిమినల్ కేసుల వ్యవహారంపై ఆయన తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా సూటిగా బదులిచ్చారు....
నేను సీపీఎం సానుభూతిపరుడినా?....
రాధాకృష్ణ తన "వీకెండ్ కామెంట్"లో తనను 'సీపీఎం సానుభూతిపరుడు' అని పేర్కొనడం పట్ల నాగేశ్వర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.40 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిష్పాక్షిక విశ్లేషణలు అందిస్తున్న తాను ఎవరో ఇతరులు పరిచయం చేయాల్సిన పనిలేదన్నారు. కొందరు తనను 'వైసీపీ' అని, బీజేపీ నేతలు 'నక్సలైట్' అని ముద్రవేశారని గుర్తుచేశారు. ఒకవేళ తాను లెఫ్ట్ అయితే వైసీపీ ఎలా అవుతానని ఆయన లాజికల్ గా ప్రశ్నించారు. వైసీపీ కండువా తన మెడలో వేసి ప్రచారం చేసిన వారి గురించి రాధాకృష్ణ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కమ్యూనిస్టు పార్టీలు రహస్యంగా కాకుండా బహిరంగంగానే పొత్తులు పెట్టుకుంటాయని ఆయన స్పష్టం చేశారు....
నా ప్రత్యేకతను ఏపీ ప్రజలకు దూరం చేయలేరు....
ఈ వివాదంతో తాను ప్రత్యేకతను కోల్పోయానని రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యను నాగేశ్వర్ తిప్పికొట్టారు తనను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరం చేయాలన్న లక్ష్యంతోనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని,కానీ అవి సఫలం కావని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు, కేజీ బేసిన్ గ్యాస్ నిక్షేపాలు, పోలవరం ముంపు, కిరండూల్-కేకే లైన్, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తాను ఏపీ ప్రజల పక్షాన
ఏ స్వార్థం ఆశించకుండా పోరాడానని ఆయన గుర్తుచేశారు...
నేను ఎక్కడా ఎవరికి 'సారీ' చెప్పలేదు....
తాను జనసేన పార్టీకి 'సారీ' చెప్పానని రాధాకృష్ణ రాయడాన్ని నాగేశ్వర్ తీవ్రంగా ఖండించారు,జనసేన పార్టీ తనను క్షమాపణ అడగలేదని, కేవలం చెప్పిన వార్తకు 'సోర్స్' (మూలం) చెప్పాలని లేదా ఉపసంహరించుకోవాలని మాత్రమే గౌరవప్రదంగా కోరిందన్నారు. జర్నలిజం విలువల ప్రకారం ఒక జర్నలిస్టుగా సోర్స్ చెప్పకూడదు కాబట్టి, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని, దీన్ని సారీ చెప్పడంగా ఎలా అన్వయిస్తారని ప్రశ్నించారు.గత రెండేళ్లుగా 'తెలంగాణ వాడివి నీకు ఏపీ రాజకీయాలతో పనేంటి?' అని తనపై తీవ్రమైన ప్రాంతీయ దాడి జరుగుతున్నా, రాధాకృష్ణ కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేదని నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు,ఒక సాటి జర్నలిస్టుపై క్రిమినల్ కేసులు పెడితే, మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడే రాధాకృష్ణ ఎందుకు ఖండించలేదని ఆయన నిలదీశారు, బీజేపీ నేతలు సైతం ఈ కేసులను తప్పుబట్టారని, కానీ రాధాకృష్ణకు మాత్రం వాటిని తప్పు అని చెప్పే ధైర్యం లేకపోయిందని విమర్శించారు....
రాధాకృష్ణ సొంత ఛానెల్‌లోనే నాకు అవమానం....
సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దూషణలు, క్యారెక్టర్ అసాసినేషన్ గురించి ఏబీఎన్ ఎండీ మౌనం వహించడం బాధాకరమన్నారు. ఏబీఎన్ ఛానెల్‌లోనే తనపై జరిగిన చర్చా కార్యక్రమంలో యాంకర్ ప్రోత్సాహంతో తనను అత్యంత నీచంగా అవమానించిన తీరును తాను స్వయంగా రాధాకృష్ణకు ఫోన్ చేసి చెప్పినా, కనీసం ఆ విషయాన్ని తన "వీకెండ్ కామెంట్"లో ఎక్కడా ప్రస్తావించకపోవడం ఏ రకమైన జర్నలిజం అని ప్రొఫెసర్ నాగేశ్వర్ నిలదీశారు,తాను ఏ పార్టీకి, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని, తన విశ్లేషణలు ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటాయని ప్రొఫెసర్ నాగేశ్వర్ తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యబద్ధమైన చర్చలకు తాను సిద్ధమేనని, కానీ వ్యక్తిగత దాడులను ఎవరూ సమర్థించకూడదని ఆయన కోరారు.....
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456