తెలంగాణ /ఆంధ్రప్రదేశ్ :
హైదరాబాద్/అమరావతి:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మచిలీపట్నం పోర్టు అనుసంధానంపై చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు, రాజకీయ దుమారానికి దారితీశాయి. రెండు రాష్ట్రాల మధ్య కీలకమైన మౌలిక సదుపాయాల వినియోగంపై తెరవెనుక చర్చలు జరిగాయన్న ఆయన ప్రకటన ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది.తెలంగాణ భౌగోళికంగా చుట్టూ భూభాగంతో కూడిన (Land-locked) రాష్ట్రం. ఇక్కడ సముద్ర తీరం కానీ, పోర్టులు కానీ లేవు. ఈ లోటును భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది,మచిలీపట్నం పోర్టును తెలంగాణకు అనుసంధానం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రితో ఇప్పటికే చర్చలు జరిపామని రేవంత్ రెడ్డి స్వయంగా ఒక కార్యక్రమంలో ప్రకటించారు ఇందుకోసం ఏకంగా 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ వేతో పాటు, రైల్వే కనెక్టివిటీని కూడా మచిలీపట్నానికి తీసుకురాబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధమయ్యాయని, దాదాపుగా అన్ని అనుమతులు కూడా వచ్చేశాయని ఆయన వెల్లడించారు. రాబోయే కొన్నేళ్లలోనే ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తి కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు....
గతంలో మచిలీపట్నం పోర్టుపై టీడీపీ వైఖరిపై ఏపీలో రాజకీయ కలకలం.....
రేవంత్ రెడ్డి ప్రకటనతో ఏపీలో ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గతంలో మచిలీపట్నం పోర్టుపై టీడీపీ వ్యవహరించిన తీరేనని విశ్లేషకులు భావిస్తున్నారు...2019 ఎన్నికలకు ముందు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మచిలీపట్నం పోర్టును అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కు అప్పగించేస్తారని చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు, ఒక దశలో నారా లోకేష్ సైతం "కోర్టు/పోర్టు ఆంధ్రుల హక్కు" అని, దాన్ని ఇతరులకు కట్టబెట్టే సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం వైఎస్ జగన్ కు లేదని అప్పట్లో గట్టిగా నినదించారు. జగన్ ప్రభుత్వం కేసీఆర్ కు రహస్యంగా ఈ పోర్టును రాసిచ్చేస్తోందని టీడీపీ పత్రికలు, మీడియా సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి...
పారదర్శకతపై వెల్లువెత్తుతున్న డిమాండ్లు....
ఒకప్పుడు మచిలీపట్నం పోర్టు తెలంగాణకు వాడుకోవడానికి ఇస్తే ఆంధ్రాకు తీరని అన్యాయం జరుగుతుందని సెంటిమెంట్ రగిల్చిన నాయకులు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తెలంగాణ ముఖ్యమంత్రితో ఎందుకు రహస్యంగా చర్చలు జరిపారన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.ఇంతటి కీలకమైన ప్రాజెక్టుకు సంబంధించి, దాదాపు అనుమతులు వచ్చే స్థాయి వరకు పనులు జరిగినా ఏపీ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా ప్రజలకు ఈ విషయాన్ని వెల్లడించలేదు?...తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఈ ప్రతిపాదనలు పెట్టింది? రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా ఏపీ ప్రభుత్వం విధించిన షరతులు ఏమిటి? తదితర వివరాలను చంద్రబాబు ప్రభుత్వం పారదర్శకంగా బయటపెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.వాణిజ్యపరంగా చూస్తే...12 లేన్ల రహదారితో తెలంగాణకు చెందిన సరుకులు మచిలీపట్నం పోర్టు ద్వారా ఎగుమతి, దిగుమతి అయితే పోర్టు కార్యకలాపాలు పెరిగి ఆంధ్రప్రదేశ్ కు కూడా భారీగా ఆదాయం వస్తుందన్నది వాస్తవం. ఇరు రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి ఇది దోహదపడుతుంది. అయితే, గతంలో ఇదే అంశాన్ని రాజకీయం చేసి, సెంటిమెంట్‌గా మార్చిన నేపథ్యంలో... ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం, పారదర్శకత లేకుండా ఒప్పందాలు చేసుకోవడం ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించేలా చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు,దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించి ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది....
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456