Janam Muchata – Voice of the People | Telugu News Platform › ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ బదిలీలో హైడ్రామా… పాత సెక్రటరీకే ఐదోసారి… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 10 Oct 2026, 10:09 pm
Date of Publish : 06 Jun 2026, 9:57 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 293 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ బదిలీలో హైడ్రామా… పాత సెక్రటరీకే ఐదోసారి కొనసాగింపు ఉత్తర్వులు !!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ బదిలీలో హైడ్రామా… పాత సెక్రటరీకే ఐదోసారి కొనసాగింపు ఉత్తర్వులు !!

ఖమ్మం సిటీ (ప్రత్యేక కథనం):ఆసియాలోనే ప్రఖ్యాతి గాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సెక్రటరీ బదిలీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీపై వచ్చిన నూతన అధికారిని వెనక్కి పంపి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత అధికారికే మళ్లీ కుర్చీ అప్పగించడం రాజకీయ, వ్యాపార, మార్కెట్ వర్గాల్లో తీవ్ర విస్మయం కలిగిస్తోంది. నిత్యం అవినీతి ఆరోపణలతో సహవాసం చేస్తున్న సదరు సెక్రటరీకి ప్రభుత్వం ఏకంగా ఐదోసారి పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.....

మార్కెట్ సెక్రటరీ బదిలీ వ్యవహారంలో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రస్తుత సెక్రటరీ స్థానంలో బదిలీపై వచ్చిన మరో సెక్రటరీ.. జాయినింగ్ ఆర్డర్స్ పట్టుకుని విధుల్లో చేరేందుకు మార్కెట్‌కు రాగా, ఆయనకు చుక్కెదురైంది. జాయిన్ చేసుకోకుండానే ఆయన్ని వెనక్కి తిప్పి పంపినట్లు సమాచారం. అదే సమయంలో, ఎవరూ ఊహించని విధంగా ప్రస్తుత సెక్రటరీనే అదే స్థానంలో మరో ఆరు నెలల పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం నుంచి పొడిగింపు (ఎక్స్‌టెన్షన్) ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.....

సాధారణంగా ఏ ప్రభుత్వ అధికారికైనా బదిలీలు, ఒకట్రెండు సార్లు పొడిగింపులు సహజం. కానీ, ప్రస్తుత సెక్రటరీకి ప్రభుత్వం ఇప్పటికి ఏకంగా ఐదుసార్లు పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడం మార్కెట్ వర్గాలతో పాటు ఉన్నతాధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇంతలా బదిలీలను అడ్డుకుంటూ, పదే పదే పొడిగింపులు తెచ్చుకుంటున్న ఆ సెక్రటరీ వెనుక ఉన్న అంతర్యం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది.... తీరుపై రైతులు, రైతు సంఘాల నుంచి తీవ్ర స్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అదే విధంగా సెక్రటరీ పని తీరుపై,మార్కెట్లో జరిగే ఆర్డీలు, జీరో దందాలపై (పన్ను ఎగవేత వ్యాపారం) అధికారి కనీస దృష్టి సారించడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. రైతుల సంక్షేమం చూడాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి, ప్రైవేటు వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి అంతే కాకుండా వ్యాపారులతో కుమ్మక్కై తప్పుడు కాటాలు వేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్న దడవాయిలపై (తూకం వేసే కార్మికులు) ఫిర్యాదులు వస్తున్నా.. వారిపై కేవలం నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ, మార్కెట్ అభివృద్ధిపై కానీ, రైతులకు జరిగే అన్యాయంపైగానీ సెక్రటరీకి చిత్తశుద్ధి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.....

నిత్యం ఇన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, వివాదాస్పదంగా మారిన ఈ సెక్రటరీని బదిలీ కాకుండా కాపాడుతున్న ఆ అధికార పార్టీ నాయకులు ఎవరనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతుల ఉసురు తగులుతున్నా పట్టించుకోకుండా, కేవలం మామూళ్లకు, పైరవీలకు తలొగ్గి సదరు అధికారికి అధికార పార్టీ పెద్దలు అండగా నిలవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రైతులకు న్యాయం జరగాలన్నా, మార్కెట్ గాడిన పడాలన్నా.. ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించి ఈ 'పొడిగింపుల' వెనుక ఉన్న మాయాజాలంపై, మార్కెట్‌లో జరుగుతున్న అవినీతి దందాపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు....