Janam Muchata – Voice of the People | Telugu News Platformకేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ…ఖమ్మం కార్పొరేషన్‌పై మళ్లీ గులాబీ జెండా… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 2:26 am
Date of Publish : 02 Jun 2026, 1:46 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 68 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ…ఖమ్మం కార్పొరేషన్‌పై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం…యువతకు పెద్దపీట వేస్తాం:పువ్వాడ అజయ్ కుమార్ !!

కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ…ఖమ్మం కార్పొరేషన్‌పై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం…యువతకు పెద్దపీట వేస్తాం:పువ్వాడ అజయ్ కుమార్ !!

ఖమ్మం సిటీ :తెలంగాణ రాష్ట్రం అనేది బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ఒంటరిగా పిడికిలి బిగించి, లక్షలాది మందిని ఏకం చేసి, సాగించిన సుదీర్ఘ పోరాట ఫలితమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పీఏసీ సభ్యుడు పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు…..

అనంతరం జరిగిన పార్టీ సమావేశంలో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, మలిదశ ఉద్యమానికి కేసీఆర్ ఊపిరి పోశారని కొనియాడారు. తెలంగాణ ఆకాంక్షను సాకారం చేయడం కోసం ఆయన తన పదవులను సైతం అనేకసార్లు తృణప్రాయంగా త్యాగం చేశారని గుర్తుచేశారు. సమైక్య పాలకుల అణిచివేతను ఎదిరించి సబ్బండ వర్గాలను ఏకం చేయడం ద్వారానే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు."ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి లేదనే అపోహతో ఆనాటి పాలకులు కేసీఆర్‌ను అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు. ఆయన ఖమ్మం జైలులో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇక్కడి ఉద్యమాన్ని భుజానెత్తుకొని నడిపింది కేవలం ఒకటి రెండు పార్టీలు మాత్రమే…..

2009లో ఉద్యమ తీవ్రతకు భయపడి తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్, ఆ తర్వాత మళ్లీ కుట్రలు పన్నిందని పువ్వాడ విమర్శించారు. నాడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రైఫిల్ పట్టుకుని తిరిగిన రేవంత్ రెడ్డి, ఇవాళ అమరవీరులకు నివాళులు అర్పించడం అత్యంత విడ్డూరంగా ఉందన్నారు. నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ కోసం 11 రోజులు పస్తులున్న మాజీ మంత్రి హరీశ్ రావు గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అలాగే నాడు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డికి, కనీసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా దొరకకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు….

నాడు కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, చారిత్రాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశారని పువ్వాడ తెలిపారు. కానీ నేడు కాంగ్రెస్ పార్టీకి చెందిన 'కుక్కమూతి పిందెలు' కాళేశ్వరంపై విషప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని, అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ గ్యారంటీలను నెరవేర్చకుండా ప్రజలను వంచిస్తోందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నది అసలైన కాంగ్రెస్ నాయకులు కాదని విమర్శించారు….

ఇది 'జెన్ జీ' (Gen Z) కాలమని, పార్టీలో యువతకు, ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని మాజీ మంత్రి ప్రకటించారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైతే తాను సైతం పక్కకు తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఉద్ఘాటించారు. కేసీఆర్ హయాంలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని, కానీ జాతీయ పార్టీలు మహిళలకు అన్యాయం చేశాయని ఆరోపించారు. రాబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో యువతకు, ఉద్యమకారులకు పూర్తిస్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తామని, ఖమ్మం కార్పొరేషన్‌పై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు….ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు RJC కృష్ణ,పగడాల నాగరాజు, వీరు నాయక్, కూరాకుల నాగభూషణం,ఖమర్, బచ్చు విజయ్ కుమార్, గిరిబాబు, మనీషా లక్ష్మి, ఉప్పల వెంకట రమణ, బొమ్మేర రామ్మూర్తి, తిరుమల్ రావు, తాజుద్దీన్, కర్నాటి కృష్ణ, మక్బుల్, శీలంశెట్టి వీరభద్రం, నాగండ్ల కోటేశ్వరరావు, కూరాకుల వలరాజు, పసుమర్తి రామ్మోహన్, బుర్రీ వెంకట్ కుమార్, బత్తుల మురళి, మాటేటి నాగేశ్వరరావు, పల్లా రోజ్ లీనా, బిక్కసాని ప్రశాంతి జస్వంత్, పగడాల శ్రీవిద్య, కొల్లు పద్మ, షకీనా, ధనలక్ష్మి మరియు లీగల్ సెల్ నాయకులు సుగుణ రావు, కొత్త వెంకటేశ్వరరావు, సిరిపురపు సుదర్శన్, వెంకట అప్పారావు, రామారావు, ప్రదీప్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…..