Janam Muchata – Voice of the People | Telugu News Platform‘ధరణి’ కష్టాలు తీరుస్తాం… దొరల ఘడీల నుండి “భూ రికార్డుల”కు… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 5:38 am
Date of Publish : 21 May 2026, 2:47 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 111 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

‘ధరణి’ కష్టాలు తీరుస్తాం… దొరల ఘడీల నుండి “భూ రికార్డుల”కు విముక్తి కలిగిస్తాం:మంత్రి పొంగులేటి!!

‘ధరణి’ కష్టాలు తీరుస్తాం… దొరల ఘడీల నుండి “భూ రికార్డుల”కు విముక్తి కలిగిస్తాం:మంత్రి పొంగులేటి!!

సత్తుపల్లి:గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ‘ధరణి’ పోర్టల్ లోపాల వల్ల పేదలు, రైతులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను త్వరలోనే శాశ్వతంగా తొలగిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాడు దొరల గడీల్లో బందీ అయిన భూ రికార్డులను విడిపించి, భూములపై పేదలకే సర్వాధికారాలు కల్పిస్తామని ఆయన ఉద్ఘాటించారు. గురువారం సత్తుపల్లిలోని ఎంఆర్ గార్డెన్స్‌లో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాలకు సంబంధించిన 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక - ప్రజా దర్బార్' సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి.. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, పలు కీలక సమస్యలపై అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.....

గత పాలకులు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుని రూ.8.18 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయినప్పటికీ, అప్పులు ఉన్నాయనే నెపంతో తమ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదన్నారు. ఉన్న వనరులతోనే పేదవాడికి భద్రత, భరోసా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటం ఆడితే, తమ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ల వ్యవధిలోనే 72,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని, త్వరలోనే మరిన్ని కొలువుల ప్రకటన రాబోతోందని మంత్రి సభాముఖంగా ప్రకటించారు.....

గత పాలకుల కాలంలో ఎన్నికలు రాగానే 'ఇందిరమ్మ ఇళ్లు' అంటూ కాగితాలకే పరిమితమైన బొమ్మల ఇళ్లను చూపించి మోసం చేశారని మంత్రి విమర్శించారు. కానీ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటికే 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, జూన్ నాటికి మరో లక్ష ఇళ్లు సిద్ధమవుతాయని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇళ్లు నిర్మించుకునే పేదలకు ములకలపల్లి క్వారీ నుంచి నాణ్యమైన ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు. హైదరాబాద్‌లో బటన్ నొక్కితే ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే ప్రతి సోమవారం నిధులు జమ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.....

సత్తుపల్లి పట్టణ పరిధిలోని 399 సర్వే నంబర్ అంశంతో పాటు, చుట్టుపక్కల 9 గ్రామాల్లో ఉన్న దాదాపు 6,500 ఎకరాల భూ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. పేదపల్లి, నారాయణపురం పరిసరాల్లోని 5,500 ఎకరాల పైచిలుకు భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి, కొలతలు పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూమి స్వాధీనంలో ఉన్న అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడంతో పాటు, పహానీలలో వారి పేర్లు నమోదు చేయాలన్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయడానికి స్థానికులు, రైతులు అధికారులకు సహకరించాలని కోరారు. అలాగే, పాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధుల బకాయిలు, ఇతర పెండింగ్ బిల్లులను ఒకట్రెండు రోజుల్లోనే క్లియర్ చేస్తామని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు.....

సరిహద్దు గ్రామాల్లో నెలకొన్న అటవీ, రెవెన్యూ భూముల వివాదాలపై మంత్రి పొంగులేటి సీరియస్ గా స్పందించారు. రుద్రాక్షపల్లి, కొకపాడు, తాళపెంట, రామచంద్రాపురం, వెంకటగిరి సహా 10-12 గ్రామాల్లోని భూ సమస్యల పరిష్కారానికి అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపే అటవీ సరిహద్దులను కొలిచి తేల్చాలని, మిగిలిన రెవెన్యూ భూమిలో సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అటవీ హక్కుల చట్టం (RoFR) ప్రకారం పట్టాలు పొందిన రైతులు తమ పొలాల్లో బోర్లు వేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరాలు చెప్పవద్దని హెచ్చరించారు. ఈ వ్యవహారాలను జిల్లా అదనపు కలెక్టర్, ఉప కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, భారీ సంఖ్యలో ప్రజలు, రైతులు హాజరయ్యారు.....