Janam Muchata – Voice of the People | Telugu News Platformఖమ్మం రాజకీయాల్లో మళ్లీ మొదలైన పొలిటికల్ ‘వార్’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 4:53 am
Date of Publish : 20 May 2026, 4:26 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 772 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం రాజకీయాల్లో మళ్లీ మొదలైన పొలిటికల్ ‘వార్’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు!!

ఖమ్మం రాజకీయాల్లో మళ్లీ మొదలైన పొలిటికల్ ‘వార్’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు!!

ఖమ్మం సిటీ: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే ఖమ్మం జిల్లా రాజకీయం మరోసారి హీటెక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాను శాసించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతున్నాయి. ఎన్నికల తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న పువ్వాడ, ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీని, తుమ్మలను టార్గెట్ చేయడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.....

వివిధ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదని, కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మం నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, కానీ ప్రస్తుత పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.....

ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పాత కక్షలను, రాజకీయ కక్ష సాధింపులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులకే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు రంగులు మార్చి, రిబ్బన్లు కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఇక్కడి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎక్కడైనా దాడులు లేదా వేధింపులు జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమని, బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

గత నెల (ఏప్రిల్ 19న) జరిగిన తన 60వ జన్మదిన వేడుకలను ప్రస్తావిస్తూ పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "గత నెల 19వ తారీఖున నా జన్మదినం రోజున, నాకు 60 ఏళ్లు నిండిన సందర్భంలో నన్ను ఆశీర్వదించడానికి దాదాపు 10 వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అది చూసి ఇక్కడున్న కొందరికి కింద నుంచి వణుకు మొదలైంది. చక్కర్లు వచ్చి పడిపోతున్నారు. ఓర్వలేక దానికి వాంతులు చేసుకుంటూ, ఇంకేదో చేసుకుంటూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు" అంటూ ప్రత్యర్థి నాయకుడి పేరు ఎత్తకుండానే సెటైర్లు వేశారు.....

ప్రజల్లో ఆదరణ ఉంటే జనం ఎలా వస్తారో తన జన్మదినం సందర్భంగా వచ్చిన జనాన్ని చూసి నేర్చుకోవాలని అన్నారు, "ప్రజలకు మేలు చేస్తే, ప్రజల కడుపులో మనపై ప్రేమ ఉంటే.. జనం తప్పకుండా మన దగ్గరకు వస్తారు. అంతేగానీ, మీటింగ్ సక్సెస్ చేయడం కోసం టోకెన్లు పెట్టి, డబ్బులు ఇచ్చి, బలవంతంగా జనాన్ని తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు. అలా బలవంతంగా తీసుకురాకపోతే చివరకు మిగిలేవి ఖాళీ కుర్చీలే " అంటూ కాంగ్రెస్ సభలను, మంత్రి తుమ్మల అభినందన సభ నిర్వహణ తీరును పరోక్షంగా ఎద్దేవా చేశారు...

రాజకీయాల్లో అనుభవాన్ని చూపిస్తూ గొప్పలు చెప్పుకునే నేతలకు పువ్వాడ గట్టి కౌంటర్ ఇచ్చారు. "మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? ఎన్ని ఏళ్లు ప్రజాక్షేత్రంలో ఉన్నారు? అనేది ముఖ్యం కాదు. మీది 40 ఇయర్స్ ఇండస్ట్రీనా లేక 30 ఇయర్స్ ఇండస్ట్రీనా అనేది ఇక్కడ అనవసరం. ప్రజల కోసం మనం ఏం చేశాం? మన రాజకీయ జీవితం ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడింది? అనేది మాత్రమే ముఖ్యం. ఆ విషయం ఖమ్మం ప్రజలకు, ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు ప్రస్ఫుటంగా తెలుసు" అని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ కార్యకర్తలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని, నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తామని పువ్వాడ అజయ్ కుమార్ ఈ సందర్భంగా క్యాడర్‌లో ధైర్యాన్ని నింపారు. ఖమ్మం నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీ పట్టు కోల్పోలేదని నిరూపించుకునేందుకే పువ్వాడ ఈ తరహా ఘాటు వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు, మంత్రి తుమ్మల వర్గీయులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది......