ఆంధ్రప్రదేశ్,తెలంగాణ :
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు 'డీలిమిటేషన్' (నియోజకవర్గాల పునర్విభజన) అంశం హాట్ టాపిక్‌గా మారింది. పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు ఆగిపోయిన నేపథ్యంలో ఇక నియోజకవర్గాల పెంపు ఉండదని భావించిన నేతలకు, తాజా పరిణామాలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్యను పెంచుకునే అవకాశం కల్పించారు. గత పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంట్‌లో దీనిపై గళమెత్తుతూనే ఉన్నారు 2026 జనాభా లెక్కల తర్వాతే ఈ ప్రక్రియ ఉంటుందని కేంద్రం గతంలో ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం జనాభా గణన ప్రారంభం కావడంతో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి....
చంద్రబాబు వ్యూహం వెనుక అసలు కారణాలు....
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం (TDP-JSP-BJP) అధికారంలో ఉండటం, కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు కీలక మద్దతుదారుగా ఉండటం వల్ల డీలిమిటేషన్ సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. చంద్రబాబు ఈ అంశాన్ని ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే విషయానికి వస్తే నియోజకవర్గాలు పెరిగితే జనసేన, బీజేపీలకు గౌరవప్రదమైన స్థానాలు కేటాయించడం సులభమవుతుంది. పార్టీలో టికెట్లు ఆశించే అసంతృప్త నేతలను కూడా అకామిడేట్ చేయవచ్చు అనే ఆలోచన మరియు కొత్త నియోజకవర్గాల ఏర్పాటు వల్ల ప్రస్తుత ఎమ్మెల్యేలపై ఉన్న స్థానిక వ్యతిరేకతను తగ్గించే అవకాశం ఉంటుందనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది అంతే కాకుండా 2009లో డీలిమిటేషన్ జరగడం వల్లే అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందని టీడీపీ బలంగా నమ్ముతోంది,నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం ద్వారా తమకు అనుకూలమైన ఓటు బ్యాంకును సమీకరించుకోవచ్చననే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది....
తెలంగాణ పరిస్థితి ఏమిటి?
తెలంగాణలో బీజేపీకి డీలిమిటేషన్ పట్ల పెద్దగా ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 119 స్థానాల్లోనే సరైన అభ్యర్థులు లేని తరుణంలో, స్థానాలు పెంచితే తమకు నష్టం జరుగుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం,అయితే ఏపీ కోసం చేసే ప్రక్రియలో భాగంగా తెలంగాణలో కూడా స్థానాలు పెరిగే అవకాశం మెండుగా ఉన్న నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు, డీలిమిటేషన్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది, ఏపీ అభివృద్ధి కోసం నిధులు, ప్యాకేజీలతో పాటు రాజకీయ ప్రయోజనం కలిగించే ఈ అంశాన్ని కూడా ఆయన పట్టుబడుతున్నారు. దీనివల్ల కేంద్రానికి ఆర్థిక భారమేమీ ఉండదు కాబట్టి, మోదీ ప్రభుత్వం చంద్రబాబు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు...మొత్తానికి, వచ్చే ఎన్నికల నాటికి ఏపీ, తెలంగాణల్లో శాసనసభ స్థానాల సంఖ్య పెరిగితే, అది తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.....
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456