Janam Muchata – Voice of the People | Telugu News Platformపువ్వాడ ఉదయ్ నగర్‌లో ‘ప్లాట్ల’దందా:ఉన్నతాధికారులకు బాధితుల ఫిర్యాదు !! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 14 Aug 2026, 1:56 pm
Date of Publish : 06 May 2026, 8:45 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 513 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

పువ్వాడ ఉదయ్ నగర్‌లో ‘ప్లాట్ల’దందా:ఉన్నతాధికారులకు బాధితుల ఫిర్యాదు !!

పువ్వాడ ఉదయ్ నగర్‌లో ‘ప్లాట్ల’దందా:ఉన్నతాధికారులకు బాధితుల ఫిర్యాదు !!

ఖమ్మం సిటీ: స్థానిక రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్‌లో అమాయక ప్రజల ప్లాట్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, స్థానిక అధికార యంత్రాంగం, రాజకీయ నేతలు కుమ్మక్కై తమను వేధిస్తున్నారని బాధితులు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించారు. బాధితులు షేక్ లాల్ పాషా, కందుకూరి రేణుక తదితరులు సోమవారం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లను కలిసి తమకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రాలు సమర్పించారు....

మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన షేక్ లాల్ పాషా ఫిర్యాదు మేరకు.. 2020లో పువ్వాడ ఉదయ్ నగర్‌లో ప్లాట్ నెంబర్ 1972ను (75 గజాలు) గ్రామ కార్యదర్శి, కాంగ్రెస్ నాయకుడు ఇస్మాయిల్ మధ్యవర్తిత్వంతో జయమ్మ అనే మహిళ నుండి కొనుగోలు చేశారు. అయితే, రిజిస్ట్రేషన్ సమయంలో జయమ్మను చూపించకుండా, ఆమె వృద్ధురాలని నమ్మించి ఇస్మాయిల్ స్వయంగా సంతకాలు చేయించి పత్రాలు తెచ్చాడని బాధితుడు పేర్కొన్నారు.తీరా 2023లో ఇల్లు కట్టుకోవడానికి వెళ్లగా, ఆ ప్లాట్‌లో అక్రమంగా రేకుల షెడ్డు వెలిసింది. దీనిపై ప్రశ్నించగా ఇస్మాయిల్ రాజీకి వచ్చి, డబ్బులు తిరిగి ఇస్తానని అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ గడువు ముగిసినా స్పందించడం లేదని, పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని లాల్ పాషా ఆరోపించారు....

మరో బాధితురాలు కందుకూరి రేణుక తన ఆవేదనను వ్యక్తపరుస్తూ.. ప్లాట్ నెంబర్ 412లో ఎనిమిదేళ్లుగా నివసిస్తున్నా,పంచాయతీ కార్యదర్శి కావాలనే తమకు ఇంటి నెంబర్ కేటాయించడం లేదని,వేలల్లో లంచం డిమాండ్ చేస్తున్నాడని,గట్టిగా నిలదీసి అడిగితే నీకు నువ్వేం చేస్తావో చూసుకో,నన్ను ఎవడు ఏం చేయలేడు,నాకు సర్పంచ్ తో పాటు మండల అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు. అంతే కాకుండా కరెంటు మీటర్, నివాస ధృవీకరణ పత్రాలు ఉన్నప్పటికీ, ఇందిరమ్మ ఇంటి పథకానికి దరఖాస్తు చేసుకోకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.....

అదే విధంగా దశాబ్ద కాలం క్రితం 192 సర్వే నెంబర్ పరిధిలో ప్లాట్లు పొందిన అలిబోయిలు మంగ, రంగమ్మ, సుభద్ర, నాగేంద్ర, భాగ్యమ్మలు కూడా తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ ప్లాట్లలో నిర్మాణాలు చేసుకుంటుంటే ప్రైవేట్ వ్యక్తులు బెదిరిస్తున్నారని, పంచాయతీ కార్యదర్శి వారికి వత్తాసు పలుకుతూ తమపైనే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని వారు వాపోయారు.అంతే కాకుండా వీరనారీమణుల సమితి ద్వారా ప్రజాసేవ చేస్తున్న భూక్య ఉపేంద్ర బాయి అనే సామాజిక కార్యకర్తపై కూడా వేధింపులు జరుగుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అరవ లత అనే మహిళ చేసిన తప్పుడు ఫిర్యాదును ఆధారంగా చేసుకుని, సిపిఐకి చెందిన యాకూబ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నాడని ఉపేంద్ర బాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశం మీద ఎలాంటి విచారణ జరపకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు....

రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూఅక్రమాలకు పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శి ,గ్రామ సర్పంచ్,అతని అనుచరుడుఇస్మాయిల్‌పై చర్యలు తీసుకోవాలని,బాధితులను  సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వేదింపులకు పాల్పడుతున్న యాకూబ్, గ్రామ సర్పంచ్, ఇస్మాయిల్ ,మరియు వారికి సహకరిస్తున్న  గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు  చేయాలని,నిజమైన బాధితులకు రక్షణ కల్పించి, ఇంటి నెంబర్లు కేటాయించాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో బాధితులతో పాటు యాకేష్, సరోజిని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.తమకు న్యాయం జరగకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు.....