Janam Muchata – Voice of the People | Telugu News Platformప్రజాపాలన ప్రగతికి సరికొత్త బాట: మంత్రి పొంగులేటి!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 5:38 am
Date of Publish : 06 Mar 2026, 2:12 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 290 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ప్రజాపాలన ప్రగతికి సరికొత్త బాట: మంత్రి పొంగులేటి!!

ప్రజాపాలన ప్రగతికి సరికొత్త బాట: మంత్రి పొంగులేటి!!

ఖమ్మం సిటీ: ప్రజలకు మేలైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.....

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గతంలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణాల్లో చోటుచేసుకున్న లోపాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని ప్రాంతాల్లో సరైన లెవల్స్ లేకపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోయి ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రత్యేకంగా సమావేశమై, ఎక్కడైతే నీరు ఆగుతుందో ఆ ప్రాంతాలను గుర్తించి తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. అవసరమైతే లోపభూయిష్టమైన నిర్మాణాలను తొలగించి, కొత్తగా నిర్మించాలని సూచించారు. ఏ అధికారి హయాంలో ఈ పొరపాట్లు జరిగాయో రికార్డుల్లో నమోదు చేసి, వారిని బాధ్యులను చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్లకు స్పష్టం చేశారు.....

ఉమ్మడి జిల్లాలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న అటవీ మరియు రెవెన్యూ భూముల వివాదాలను పరిష్కరించేందుకు ఈ 99 రోజుల ప్రణాళికను వేదికగా చేసుకోవాలని మంత్రి సూచించారు. కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లెందు, వైరా వంటి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. కలెక్టర్లు, డి.ఎఫ్.ఓలు మరియు రెవెన్యూ యంత్రాంగం ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, సరిహద్దులను ఖరారు చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకుండా నూటికి నూరు శాతం పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు....

కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, మేయర్లు మరియు చైర్మన్లకు పాలనాపరమైన అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఈ నెల 12న ఉమ్మడి జిల్లా స్థాయిలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అనుభవజ్ఞులైన అధికారులతో ఈ శిక్షణ ఇప్పించడం ద్వారా, గ్రామాల్లో నిధుల వినియోగంపై వారికి స్పష్టత వస్తుందన్నారు. ముఖ్యంగా గత రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పంచాయతీ నిధులు ఇప్పుడు విడుదలవుతున్నాయని, వాటిని గ్రామాభివృద్ధికి పారదర్శక పద్ధతిలో ఖర్చు చేసేలా విలేజ్ సెక్రటరీలతో కలిసి పని చేయాలని సూచించారు.

వ్యవసాయ రంగంలో రైతులు విచక్షణారహితంగా వాడుతున్న ఎరువులు, పురుగుమందుల ప్రభావం భూసారంపై పడుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి రైతుకూ భూసార పరీక్షలు, పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పించాలన్నారు. అధికారులే నేరుగా రైతుల వద్దకు వెళ్లి ఆధునిక సాంకేతికతను వివరించాలని, అవసరమైతే ఇతర ప్రాంతాల్లోని ఆదర్శ సాగు పద్ధతులను పరిశీలించేందుకు ప్రభుత్వ ఖర్చుతో రైతులకు క్షేత్ర పర్యటనలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉన్నా, గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులందరూ ప్రజల కోసమే పని చేయాలని మంత్రి ఉద్ఘాటించారు. ఈ అభివృద్ధి ప్రణాళికలో అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం లేకుండా అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అధికారులు మరింత శ్రద్ధ వహించి ప్రభుత్వ ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు……