Khammam City:Feb:6:2:2026
ఏదులాపురం : "గత పదేళ్ల పాలనలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే కనీస జ్ఞానం కూడా ఆనాటి 'దొర'కు లేకపోయింది. కానీ మా ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాది. మీరు అభ్యర్థులను గెలిపించండి.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను" అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఏదులాపురం మున్సిపాలిటీలోని 1,21,19,18,31,32,17,14,16వ వార్డుల్లో ఆయన విస్తృతంగా రోడ్ షో నిర్వహించారు,మంత్రి పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మహిళలు హారతులతో స్వాగతం పలకగా, పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, నినాదాలతో హోరెత్తించారు,ఆయా వార్డుల అభ్యర్థులు,పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు……
ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి...
మాయ మాటలు నమ్మొద్దు..
రెడ్డిపల్లి (1వ వార్డు) నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో ముత్తగూడెం, గొల్లగూడెం, బారుగూడెం మీదుగా ఏదులాపురం, మద్దులపల్లి, తెల్దారుపల్లి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే రంగు రంగుల కండువాలు వేసుకుని మాయ మాటలు చెప్పేందుకు వస్తారు. గతంలో 'వరి వేస్తే ఉరి' అని రైతులను భయపెట్టిన వారు నేడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?" అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటోందని గుర్తు చేశారు....
మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచార సభకు బారీగా హాజరైన కార్యకర్తలు...
సొంతింటి కల నెరవేరుస్తాం..
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీలో మొదటి విడత కింద ఇప్పటికే 587 ఇళ్లు మంజూరు చేశామని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రెండో విడత జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన పేదలకు స్థలాలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు…..