Janam Muchata – Voice of the People | Telugu News Platformనా తుది శ్వాస వరకు పాలేరు ప్రజలకే నా జీవితం… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Sep 2026, 6:29 am
Date of Publish : 03 Sep 2026, 9:29 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 185 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

నా తుది శ్వాస వరకు పాలేరు ప్రజలకే నా జీవితం అంకితం: కందాళ ఉపేందర్ రెడ్డి…

నా తుది శ్వాస వరకు పాలేరు ప్రజలకే నా జీవితం అంకితం: కందాళ ఉపేందర్ రెడ్డి…

పాలేరు, సెప్టెంబర్ 3: నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా తుది శ్వాస వరకు పాలేరు నియోజకవర్గ ప్రజల కోసమే పనిచేస్తానని పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కందాళ ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తన జేబులో చివరి ₹100 ఉన్నా పాలేరు ప్రజల కోసమే ఖర్చు చేస్తానని భావోద్వేగంగా ప్రకటించారు.పాలేరు రిజర్వాయర్ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 1000 రోజులు గడిచినా ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు....

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన గ్యారెంటీలు కేవలం ఓట్లు పొందేందుకు చేసిన నాటకంగా తేలిపోయాయని కందాళ ఉపేందర్ రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కళ్యాణలక్ష్మి పథకానికి తులం బంగారం, రైతులకు బోనస్, నెలకు ₹4,000 పింఛన్, మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం వంటి హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని కోరారు....

పాలేరు నీటిపై తొలి హక్కు స్థానిక రైతులదే....

పాలేరు రిజర్వాయర్ నీటిపై మొదటి హక్కు స్థానిక రైతాంగానిదేనని కందాళ స్పష్టం చేశారు. స్థానిక రైతుల సాగునీటి అవసరాలను విస్మరించి ఇతర అవసరాలకు నీటిని మళ్లించడాన్ని సహించబోమని హెచ్చరించారు.తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించుకోవాలని, పాలేరు రైతుల సాగునీటి హక్కులను దెబ్బతీయవద్దని ప్రభుత్వాన్ని కోరారు.ఈ నెల 10వ తేదీలోపు పంటలకు కనీసం ఒక్క తడికైనా సాగునీరు విడుదల చేయకపోతే రైతుల పక్షాన రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.....

ప్రజాపాలన అంటే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఉండాలని, అధికార పార్టీ కార్యకర్తల ప్రయోజనాల కోసం పరిపాలన సాగకూడదని కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. పేదలకు అన్యాయం జరిగితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని స్పష్టం చేశారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న స్థానిక నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తే తగిన రీతిలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు....

తాను కేవలం మాటలు చెప్పే వ్యక్తిని కాదని, ప్రజలకు ఇచ్చిన మాటను చేతల్లో చేసి చూపించే నాయకుడినని కందాళ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు.“నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా జేబులో ఆఖరి ₹100 ఉన్నా పాలేరు ప్రజల కోసమే ఖర్చు చేస్తాను. పాలేరు బిడ్డగా ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన నా పోరాటం ఎన్నటికీ ఆగదు” అని ఆయన భావోద్వేగంగా ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పాలేరు ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.పాలేరు రైతుల నీటి హక్కులు, పేదల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే తన రాజకీయ జీవిత లక్ష్యమని,నా చివరి శ్వాస వరకు పాలేరు ప్రజల పక్షాన పోరాడుతానని మరోసారి స్పష్టం చేశారు....